‘‘రోహిత్ శర్మ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. అతడొక అద్భుతమైన క్రికెటర్. కానీ.. ప్రస్తుతం బ్యాటింగ్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్‌తో పోలిస్తే విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ మెరుగైన ఫామ్‌లో ఉన్నారు.
ఓపెనింగ్ స్థానాల కోసం గట్టి పోటీనిస్తున్నారు. అయితే, రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి కచ్చితంగా అతడొక ఓపెనర్‌గా ఉంటాడు. కాబట్టి ఫామ్‌లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనుక రావాల్సి ఉంటుంది.
నిజానికి ఇలాంటి సమయంలో.. వరల్డ్‌కప్ టోర్నీకి ముందు రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా తిరిగి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరికాదు.
ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ ఐడియల్ కెప్టెన్ కాదు. అతడి కోసం యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌లలో ఎవరో ఒకరిపై తప్పక వేటు పడుతుంది’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న కారణంగా ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లపై వేటు పడుతుందంటూ ఘాటు విమర్శలు చేశాడు. హిట్‌మ్యాన్ టీ20లలో మునుపటిలా ఆటడం లేదని.. అతడి పునరాగమనం జట్టు కూర్పులో చిక్కులు తెస్తుందని జాయ్ భట్టాచార్య అభిప్రాయపడ్డాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు టీ20 జట్టుకు దూరంగా ఉన్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చారు. ఇక రోహిత్ గైర్హాజరీలో టీ20 జట్టును ముందుకు నడిపిన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లు గాయాల బారిన పడిన తరుణంలో.. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లి మెగా ఈవెంట్లో ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌లలో ఎవరో ఒకరిపై వేటు పడటం ఖాయం. ఈ నేపథ్యంలో జాయ్ భట్టాచార్య ఈమేరకు వ్యాఖ్యల చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు.. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 303 పరుగులు చేశాడు.
మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 రన్స్ చేయగా.. శుబ్‌మన్ గిల్ 304, యశస్వి జైస్వాల్ ఓ సెంచరీ సాయంతో 225 పరుగులు సాధించాడు. కాగా జూన్ 1న అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment