T20 WC Qualifier: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం | Sakshi
Sakshi News home page

T20 WC Qualifier: థ్రిల్లింగ్‌ మ్యాచ్‌.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం

Published Mon, Nov 6 2023 12:27 PM

Oman Beat Nepal In Super Over To Clinch T20 World Cup Asia Qualifier Trophy - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా జరిగిన భారత్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌తో క్రికెట్‌ ప్రపంచం మొత్తం బిజీగా ఉంటే.. నేపాల్‌లోని ఖాట్మండులో ఓ అద్భుతం జరిగింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌ ఫైనల్లో ఒమన్‌.. తమకంటే పటిష్టమైన నేపాల్‌ను సూపర్‌ ఓవర్‌లో మట్టికరిపించింది.

ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సమానమైన స్కోర్లు (184 పరుగులు) చేయడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేయగా.. నేపాల్‌ కేవలం 10 పరుగులకు (వికెట్‌ కోల్పోయి) మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో ఒమన్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం​ లేకుండా ఇరు జట్లు ఇదివరకే 2024 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

కిక్కిరిసిపోయిన స్టేడియం.. ఇసుకేస్తే రాలనంత జనం
నేపాల్‌లో క్రికెట్‌ క్రేజ్‌ రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్‌ జరిగినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. సొంత జట్టు మ్యాచ్‌ అయితే అభిమానులను కంట్రోల్‌ చేయలేని పరిస్థితి ఉంది. స్టేడియంలో నిలబడేందుకు కూడా ప్లేస్‌ దొరక్క జనాలు చెట్లు, టవర్లు ఎక్కుతున్నారు. ఇక్కడ క్రికెట్‌ క్రేజ్‌ ప్రమాదకర స్థాయికి చేరింది.

నిన్న కిరిటీపూర్‌లో జరిగిన నేపాల్‌-ఒమన్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌ ఫైనల్ మ్యాచ్‌ చూసేందుకు జనాలు తండోపతండాలుగా స్టేడియంకు వచ్చారు. స్టేడియంలో వాతావరణం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.

ఇది చాలదనట్లు జనాలు స్టేడియం బయట ఉన్న చెట్లు, ఎత్తైన హోర్డింగ్‌లు ఎక్కి మ్యాచ్‌ వీక్షించారు. క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం జనాలు స్టేడియానికి రావడం మంచిగానే అనిపిస్తున్నప్పటికీ, జరగరానిది ఏదైన జరిగితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. 

ఇదిలా ఉంటే, నేపాల్‌ ఫ్యాన్స్‌ తమ జట్టు టైటిల్‌ సాధిస్తుందేమోనని కిరీటీపూర్‌ స్టేడియానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ జట్టు అనూహ్యంగా సూపర్‌ ఓవర్లో ఓటమిపాలై, వారిని నిరాశపరిచింది. 

 
Advertisement
 
Advertisement