హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ ఏర్పడనుంది. ఎందుకంటే ఇక్కడ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. సాధారణ ఓటరును తమవైపు తిప్పుకోవడంలో ఏ పార్టీ విజయం సాధిస్తే అది పార్లమెంటు వరకూ చేరుకోగలుగుతుంది.
మోదీ మ్యాజిక్, మాజీ సీఎం జైరాం ఠాకూర్ మద్దతు, స్టార్‌డమ్ మొదలైనవి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌కు కలసివచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే అతని తండ్రి, ఆరుసార్లు రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర కె సింగ్ అభిమానులు విక్రమాదిత్యకు అండగా నిలుస్తారనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎవరు గెలిచినా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కుతుందనే అంచనాలున్నాయి.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. విక్రమాదిత్య తండ్రి దివంగత వీరభద్ర సింగ్, తల్లి ప్రతిభా సింగ్‌లు మండీ నియోజక వర్గం నుండి మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 2021 వరకు ఈ నియోజక వర్గంలో జరిగిన 20 ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ 14 సార్లు, బీజేపీ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలుపొందాయి. ప్రస్తుతం మండీ నియోజకవర్గంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కులు, కిన్నౌర్, లాహౌల్-స్పితి, సిమ్లాలోని రాంపూర్, చంబాలోని భర్మౌర్ స్థానాల్లో ఆధిక్యత సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మే 24న మండిలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోజు (బుధవారం) కులు, సుందర్‌నగర్‌లలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment