ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ‘రాంచి హీరో’ భావోద్వేగం | Sakshi
Sakshi News home page

#Dhruv Jurel: ఈ కుర్రాడిని నమ్మినందుకు ధన్యవాదాలు.. ఫొటో వైరల్‌

Published Mon, Feb 26 2024 6:06 PM

Ranchi Hero Dhruv Jurel Heartfelt Message To Rohit Dravid Pic Viral - Sakshi

India vs England, 4th Tes: రాంచి టెస్టు హీరో ధ్రువ్‌ జురెల్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. తనపై నమ్మకం ఉంచినందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా రాజ్‌కోట్‌ వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు ధ్రువ్‌ జురెల్‌. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకున్న ఈ యూపీ ఆటగాడు.. అరంగేట్ర మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు.

రాజ్‌కోట్‌లో కీపింగ్‌ నైపుణ్యాలతో పాటు బ్యాటింగ్‌ మెరుపులనూ చూపించాడు 23 ఏళ్ల జురెల్‌. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో మెరవగా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరమే లేకుండా సహచరులు జట్టును గెలిపించారు.

ఇలా అరంగేట్రంలో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయిన ధ్రువ్‌ జురెల్‌.. నాలుగో టెస్టులో మాత్రం అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో మునిగిపోయిన తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 90 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అంతకంటే గొప్ప ఇన్నింగ్సే ఆడాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్‌ గిల్‌(52- నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కీలక సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా.. 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా టీమిండియాను గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

ఈ నేపథ్యంలో ఎక్స్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ జురెల్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘రోహిత్‌ భయ్యా, రాహుల్‌ సర్‌.. ఈ కుర్రాడిని నమ్మినందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ వాళ్లిద్దరు తన ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు పంచుకున్నాడు. కాగా ధ్రువ్‌ జురెల్‌ తండ్రి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నారు.

కొడుకును కూడా తనలాగే సైనికుడిని చేయాలని భావించారు. కానీ జురెల్‌ మాత్రం క్రికెట్‌పై మక్కువతో అనేక కష్టనష్టాలకోర్చి టీమిండియా తరఫున ఆడే స్థాయికి చేరుకున్నాడు.

చదవండి: #Sarfaraz Khan: గోల్డెన్‌ డకౌట్‌.. అయినా సర్ఫరాజ్‌ అలా!..

 
Advertisement
 
Advertisement