Why New Zealand Team is Called Blackcaps? NZ Lost the Match Against PAK
Sakshi News home page

New Zeland: 'బ్లాక్‌క్యాప్స్‌' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం

Published Wed, Nov 9 2022 5:50 PM | Last Updated on Wed, Nov 9 2022 6:26 PM

Reason Why Should-Call NZ Black Caps Lost Match Vs PAK T20 WC Semis - Sakshi

న్యూజిలాండ్‌ జట్టును ఇష్టపడని వారు ఉండరు. వివాదరహిత జట్టుగా పేరున్న కివీస్‌కు మంచి జట్టు అనే ట్యాగ్‌లైన్‌ ఉంది. ఈ ట్యాగ్‌లైన్‌ ఒక్కటే ఉంటే సరిపోదు.. దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కానీ కివీస్‌ విషయంలో అలా పిలవచ్చో లేదో అనే డైలమా నెలకొనేలా చేశారు. క్రికెట్‌లో సౌతాఫ్రికాకు 'చోకర్స్‌' అనే ముద్ర ఉంది. కానీ కివీస్‌ను అలా పిలవాలన్న మనసొప్పదు. కారణం వారి ఆటతీరు.

సౌతాఫ్రికాకు దురదృష్టం ఎక్కువగా ఉంటే.. కివీస్‌ విషయంలో మాత్రం కొంత దురదృష్టం.. కొంత స్వయంకృతం తోడవుతాయి. అందుకే వారికి బ్లాక్‌క్యాప్స్‌ అని ముద్ర పడింది. సైన్స్‌ను నమ్మేవాళ్లకు వింత అనిపించినా.. న్యూజిలాండ్‌ జట్టు ధరించే బ్లాక్‌ జెర్సీని మారిస్తేనైనా కప్‌ కొడుతుందేమోనన్న నమ్మకం ఈరోజుతో మరింత బలంగా తయారైంది. బ్లాక్‌ క్యాప్స్‌ అని ఊరికే అనలేదన్న విషయాన్ని కివీస్‌ జట్టు మరోసారి నిరూపించుకుంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో న్యూజిలాండ్‌ జట్టు మరోసారి తేలిపోయింది. ఈసారి కప్‌ కచ్చితంగా కొడుతుంది అన్న తరహాలో వారి ప్రదర్శన కొనసాగడం.. తీరా నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ 2022లోనూ ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. 

సూపర్‌-12 దశలో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి మినహా టాప్‌ ప్రదర్శన కనబరిచిన కివీస్‌ అందరూ ఊహించినట్లుగానే సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో మాత్రం మళ్లీ పాత కథే. గ్రూప్‌-1 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌.. కీలకమైన నాకౌట్‌(సెమీస్‌)లో తమకు అలవాటైన రీతిలోనే పాకిస్తాన్‌ చేతిలో చిత్తైంది. అందునా పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌ అంటేనే చెత్త రికార్డు కలిగి ఉన్న న్యూజిలాండ్‌ దానిని విజయవంతంగా నిలబెట్టుకుంది. 

ఇప్పటివరకు ఐసీసీ మెగాటోర్నీల్లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్‌ నాలుగుసార్లు ఓడించింది. ఇందులో రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్‌లో(1992, 1999).. రెండుసార్లు (2007, 2022) టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ ఉన్నాయి. అంతేకాదు 2015 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నీల్లో(ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ మినహా) కనీసం సెమీస్‌ చేరిన జట్టుగా నిలిచింది న్యూజిలాండ్‌. అయితే నాకౌట్‌ ఫోబియా మాత్రం ఆ జట్టును వీడడం లేదు. ఇక వచ్చే ఏడాది 2023లో వన్డే వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో అప్పుడైనా తమపై ఉన్న బ్లాక్‌క్యాప్స్‌ ముద్ర తొలగించుకుంటారేమో చూడాలి. 

అయితే క్రికెట్‌ అభిమానులు మాత్రం న్యూజిలాండ్‌ ఆటతీరు విషయంలో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. మంచి జట్టుగా పేరున్న కివీస్‌కు ఈ నాకౌట్‌ ఫోబియా ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. ఎందరు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మారడం లేదని.. తాను కెప్టెన్సీ చేపట్టిన ఆరేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్‌ను మూడుసార్లు కనీసం సెమీస్‌ చేర్చిన కేన్‌ విలియమ్సన్‌ కల కూడా నెరవేరేలా కనిపించడం లేదని అంటున్నారు.

2019లో న్యూజిలాండ్‌ టైటిల్‌ కొట్టబోతుందంటూ  ఆ దేశ దిగ్గజ క్రికెటర్‌ మార్టిన్‌ క్రో జోస్యం చెప్పారు. కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూయడం సగటు అభిమానిని బాధపడేలా చేసింది. కనీసం ఈసారైనా టైటిల్‌ కొట్టి తామేంటో నిరూపించుకోవాలనుకున్న కివీస్‌కు మరోసారి భంగపాటే ఎదురైంది. 

ఇక కివీస్‌ ఓటమికి కొన్ని కారణాలున్నాయి. అందులో మార్టిన్‌ గప్టిల్‌ లాంటి సీనియర్‌ ప్లేయర్‌ను పక్కనబెట్టడం జట్టు సమతుల్యం దెబ్బతీసిందని చెప్పొచ్చు. అతను ఫామ్‌లో ఉన్నాడో లేదో తెలియదు కానీ జట్టుకు ఒక సీనియర్‌ ఆటగాడి సేవలు చాలా అవసరం. 2015, 2019 వన్డే వరల్డ్‌కప్స్‌తో పాటు 2021 టి20 ప్రపంచకప్‌ల్లో కివీస్‌ ఫైనల్‌ చేరడంలో మార్టిన్‌ గప్టిల్‌ది కీలకపాత్ర. అతనికి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సిందని క్రీడా ఫ్యాన్స్‌ వాపోయారు. ఏమో గప్టిల్‌ ఉండి ఉంటే.. సెమీఫైనల్‌లో బాగా స్కోరు సాధించి జట్టును ఫైనల్‌ చేర్చేవాడేమో అని పేర్కొన్నారు. అయినా న్యూజిలాండ్‌ కథ ముగిసింది.. ఇక ఇప్పుడు ఎన్ని మాట్లాడి ఏం ప్రయోజనం. ఈ ప్రపంచకప్‌లో కివీస్‌కు సెమీస్‌ వరకే రాసిపెట్టి ఉన్నట్లుంది. 

చదవండి: NZ Vs Pak: న్యూజిలాండ్‌ ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

ఫామ్‌ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్‌ ప్రత్యేకత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement