న్యూజిలాండ్ జట్టు టాప్ క్లాస్ ఆటకు పెట్టింది పేరు. వాళ్లు మ్యాచ్ ఆడుతున్నారంటే ప్రత్యర్థి జట్టుకు బౌండరీలు, సిక్సర్లు రావడం చాలా కష్టం. ఎందుకంటే అంత పకడ్బందీగా ఉంటుంది వారి ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్‌తో పాటు మంచి జట్టు అని పేరు పొందిన న్యూజిలాండ్ తాజాగా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం నాసిరకమైన ఆటను ప్రదర్శించింది. అసలు సెమీస్ ఆడుతుంది కివీసేనా లేక మరో జట్టా అన్న సందేహం కూడా కలిగింది.
ఇక ఇవాళ పాక్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటతీరు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 59 పరుగులే చేసింది. డెత్ ఓవర్లలో అయితే పరిస్థితి మరీ దారుణం. భీకరమైన బౌలింగ్ లైనఫ్ ఉన్న పాకిస్తాన్ బౌలర్ల ముందు కివీస్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. చెప్పాలంటే బౌండరీలు బాదడానికి తెగ ఇబ్బంది పడ్డారు.
16 నుంచి 20 ఓవర్ల మధ్య న్యూజిలాండ్ బ్యాటర్లు కొట్టింది కేవలం రెండంటే రెండు ఫోర్లు... ఈ ఐదు ఓవర్లలో 46 పరుగులు మాత్రమే వచ్చాయి. భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా పెద్ద ఇబ్బందేమీ ఉండేది కాదు. కానీ జేమ్స్ నీషమ్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కూడా సింగిల్స్, డబుల్స్ తీయడం ఆశ్చర్యం కలిగించింది. డారిల్ మిచెల్ కాస్తో కూస్తో పర్వాలేదనిపించినా.. ముఖ్యంగా విలియమ్సన్ మాత్రం టెస్టు బ్యాటింగ్ చేయడం అభిమానులను విసిగించింది. 42 బంతులెదుర్కొన్న విలియమ్సన్ 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతని బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో.
బ్యాటింగ్ నీరసంగా చేశారనుకుంటే.. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మరింత దారుణ ప్రదర్శన కనబరిచారు. సాధారణంగా తమ ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు పరుగులు పెద్దగా ఇవ్వదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు నేలపాలు చేస్తే .. ఈజీ రనౌట్ చాన్స్‌లను మిస్ చేశారు. మొత్తానికి మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ ప్రదర్శన చూస్తుంటే... 2021లో టీమిండియా పర్ఫామెన్స్ గుర్తుకురావడం ఖాయం.
న్యూజిలాండ్‌కి ఫైనల్ ఫోబియా చాలా ఎక్కువ. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పితే 2015 వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ మ్యాచుల్లో ఇలాంటి నాసిరకమైన ప్రదర్శననే కనబరిచింది. ఐసీసీ టోర్నీల్లో సౌతాఫ్రికాని బ్యాడ్ లక్ వెంటాడుతుంది. న్యూజిలాండ్ కథ మాత్రం పూర్తిగా వేరు.ఫైనల్ వరకు చేరుకున్నప్పటికి ఆఖరి మెట్టుని ఎలా దాటాలో మాత్రం ఆ జట్టుకు తెలిసి రావడం లేదు. తమ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ గెలిచిన ఐకైక ఐసీసీ టైటిల్ ఏదైనా ఉందంటే అదీ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ మాత్రమే. ఇది కూడా వాతావరణం కలిసి రావడం.. టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడడం వల్లేనని ఈ ఓటమితో రుజువు చేసుకుంది న్యూజిలాండ్.
Comments
Please login to add a commentAdd a comment