సాత్విక్‌–చిరాగ్‌ జోరు | Sakshi
Sakshi News home page

సాత్విక్‌–చిరాగ్‌ జోరు

Published Sat, Jan 13 2024 3:48 AM

Satwik and Chirag enter the semifinals - Sakshi

కౌలాలంపూర్‌: గత ఏడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి కొత్త సీజన్‌లో కూడా తమ జోరు కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌–చిరాగ్‌ 21–11, 21–8తో ప్రపంచ 32వ ర్యాంక్‌లో ఉన్న హి జి టింగ్‌–రెన్‌ జియాంగ్‌ యు (చైనా)లపై విజయం సాధించారు.

కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. తొలి గేమ్‌లో వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన సాత్విక్‌–చిరాగ్‌ అదే ఊపులో గేమ్‌ను దక్కించుకున్నారు. రెండో గేమ్‌లోనూ భారత జంట దూకుడు కొనసాగించింది. స్కోరు 7–3 వద్ద సాత్విక్‌–చిరాగ్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 14–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.

నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్‌ జంట కాంగ్‌ మిన్‌ హైక్‌–సియో సెయుంగ్‌ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్‌–చిరాగ్‌ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్‌–చిరాగ్‌ 3–1తో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో అశి్వని–తనీషా జంట 15–21, 13–21తో రిన్‌ ఇవనాగ–కీ నకనిషి (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అశ్విని–తనీషా జోడీకి 8,125 డాలర్ల (రూ. 6 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

 
Advertisement
 
Advertisement