ఇంజనీరింగ్‌ కొలువుల భర్తీ షురూ | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కొలువుల భర్తీ షురూ

Published Thu, Mar 14 2024 5:37 AM

Engineering Jobs Replacement Started - Sakshi

1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. వివిధ విభాగాల్లో దాదాపు 1,120 ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు  

ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన.. పెండింగ్‌లో ఉన్న డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలు ఖరారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఏఈఈ) ఉద్యోగాల భర్తీలో ముందడుగు పడింది. ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది కావస్తుండగా... తాజాగా కేటగిరీల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాను తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 సెపె్టంబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 ప్రభుత్వ విభాగాల్లో 1,540 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకుగాను గతేడాది జనవరిలో అర్హత పరీక్షలను కమిషన్‌ నిర్వహించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ... ఆ తర్వాత గతేడాది మే నెలలో మరోమారు అర్హత పరీక్షలను నిర్వహించింది. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను కమిషన్‌ వెల్లడించింది. 

18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
ఏఈఈ ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ)లోని పరిపాలన విభాగంలో ఈ పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు కమిషన్‌ వెబ్‌సైట్‌ను తెరిచి చెక్‌లిస్టు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అప్లికేషన్‌ పత్రాలను రెండు కాపీలు ప్రింట్‌ తీసుకోవాలని, అదేవిధంగా అటెస్టెషన్‌ పత్రాలను కూడా రెండు సెట్లు ప్రింట్‌ తీసుకుని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

చెక్‌లిస్టులో నిర్దేశించినట్లుగా అభ్యర్థులు అన్నిరకాల సర్టిఫికెట్లుతో హాజరు కావాలని పేర్కొంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు సమర్పించకుంటే తదుపరి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు సైతం మరో అవకాశం ఇచ్చేది లేదని కమిషన్‌ తేల్చిచెప్పింది. 
 
వెబ్‌సైట్‌లో డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓ పరీక్షల తేదీలు 
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏఓ), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(హెచ్‌డబ్ల్యూఓ) ఉద్యోగ అర్హత పరీక్షల తేదీలను కూడా కమిషన్‌ వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. డీఏఓ ఉద్యోగ ఖాళీలు 53, హెచ్‌డబ్ల్యూఓ ఖాళీలు 581 ఉన్నాయి.   

Advertisement
Advertisement