Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా | Human trafficking in the name of jobs in Cambodia | Sakshi
Sakshi News home page

విశాఖ: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా

Published Sun, May 19 2024 5:33 AM | Last Updated on Sun, May 19 2024 8:02 AM

Human trafficking in the name of jobs in Cambodia

మానవ వనరుల అక్రమ రవాణా బట్టబయలు

డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతకు వల

ఏజెంట్ల ద్వారా రూ.1.5 లక్షల వంతున వసూలు  

ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌ స్కాముల్లో శిక్షణ

చైనా గ్యాంగ్‌ చేతుల్లో  5 వేల మంది భారత యువత

ఏపీ నుంచే 150 మంది వరకు ఉన్నట్లు గుర్తింపు

యువతను వంచించిన ముగ్గురు ఏజెంట్ల అరెస్టు

మీడియాతో విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌

విశాఖ సిటీ: ఉద్యోగాల పేరుతో విదేశాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఛేదించారు. విదేశాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను చైనా గ్యాంగ్‌కు అమ్మేస్తున్న ముగ్గురు ఏజెంట్లను శనివారం అరెస్టు చేశారు. దీనిపై విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ శనివారం సాయంత్రం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

అక్కడ పని చేసి చైనా ముఠా చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ సైబర్‌ హెల్ప్‌లైన్‌ 1930 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. దీనిపై నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవాని ప్రసాద్‌ బృందం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

ప్రధాన ఏజెంట్‌  చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్‌ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు (37), మన్నేన జ్ఞానేశ్వరరావు (29)లను అదుపులోకి తీసుకుని విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా సీపీ రవిశంకర్‌ మానవ వనరుల అక్రమ రవాణా గురించి వెల్లడించిన వివరాలివి...

నిరుద్యోగులకు వల...
గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్‌ చుక్కా రాజేష్‌ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్‌ దేశాల్లో ఫైర్‌ సేఫ్టీ అండ్‌ ప్రికాషన్‌ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్‌ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో  కాంబోడియా నుంచి సంతోష్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి, కాంబోడియాలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు.  

ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్‌ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్‌ అందుకు అంగీకరించి సోషల్‌ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్‌ వారిని కాంబోడియా ఏజెంట్‌ సంతోష్‌కు అప్పగించాడు. 

ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్‌ చేసింది. సంతోష్‌ కంటే ఎక్కువ కమిషన్‌ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్‌.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్‌ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.

చీకటి గదిలో బంధించి..
ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా  ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్‌లైన్‌ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్‌ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది. 

సైబర్‌ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్‌ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది.    

చైనా ముఠా చెరలో 5వేల మంది..
చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 150 మంది చైనా గ్యాంగ్‌ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నట్లు సీపీ రవిశంకర్‌ తెలిపారు.  ఈ నెట్‌వర్క్‌ వెనుక ప్రధాన ముఠాను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. 

కాంబోడియాలో భారత ఎంబసీకీ దీనిపై సమాచారం అందిస్తామన్నారు. విశాఖ నుంచి ఎవరైనా కాంబోడియాకు వెళ్లి ఇబ్బందులు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. భారతదేశం నుంచి కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్‌ వంటి దేశాలకు  రెండేళ్లుగా మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోందని సీపీ తెలిపారు. ఇలా వెళ్లిన భారతీయుల ద్వారా సైబర్‌ నేరాల రూపంలో మన దేశీయుల నుంచే సుమారు రూ.100 కోట్ల వరకు దోచుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు.

అది కుటుంబాల మధ్య తగాదాలో దాడి...
కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా మహిళపై దాడి జరిగిందని సీపీ రవిశంకర్‌ స్పష్టం చేశారు. దీనికి రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దాడి ఘటన వీడియోలు ఉన్నాయని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చైనా ముఠాకు భారత యువత విక్రయం...
నిరుద్యోగులను  ముందు బ్యాంకాక్‌ పంపించి,  అక్కడ రెండో ఏజెంట్‌కు అప్పగించారు. వీరు నిరుద్యోగులను కాంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకువెళ్లి ఒక నెలకు టూరిస్ట్‌ వీసా తీసుకున్నారు. అలా తీసుకువెళ్లిన నిరుద్యోగులను ఏజెంట్లు వారికున్న  నైపుణ్యం ఆధారంగా వారికి రూ.2500 నుంచి రూ.4 వేల అమెరికన్‌ డాలర్ల రేటు కట్టి చైనా కంపెనీలకు అమ్మేశారు. 

 తమ వద్ద ఏడాది పాటు పనిచేసేలా చైనా ముఠా అగ్రిమెంట్‌ రాయించుకుంది. సెక్యూరిటీ కింద 400 డాలర్ల పూచీకత్తును కట్టించుకుంది. ఒకవేళ కంపెనీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే ఆ మొత్తం చెల్లించాలని ఒప్పందంలో ఈ ముఠా షరతులు విధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement