పోలీసుల అదుపులో లోకేశ్‌బాబు
గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు
అమెరికా పౌరసత్వం కలిగిన డాక్టర్ లోకేశ్‌బాబుగా గుర్తింపు
విదేశాలకు వెళ్తున్న సీఎంను అడ్డుకొనేందుకు వచ్చినట్లు విచారణలో వెల్లడి
ఆయన సెల్‌ఫోన్‌లో సీఎం పర్యటన మెసేజ్‌లు.. కవరేజి కోసం ఎల్లో మీడియాకు వినతి
సీఎం జగన్ విదేశీ పర్యటనపై చానళ్లలో లోకేశ్‌బాబు వ్యతిరేక వ్యాఖ్యలు
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది.
టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్‌బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారం
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు.
ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment