చాలామందికి టైమ్ అంటే అస్సలు విలువ ఉండదు. ఈ రోజు పని చేయ్ అంటే రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేస్తుంటారు. మరికొందరు మాత్రం రోజుకి 24 గంటలు ఉన్నా సరిపోవట్లేదని బాధపడుతుంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్లకు ఎంత కావాలంటే అంత టైమ్ కొనుక్కునే ఛాన్స్ వస్తే.. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఇదేదో విడ్డూరంగా ఉంది కదా! అవును ఓటీటీలో 'ఇన్ టైమ్' (2011) అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చూశారంటే ఇలాంటి వింతలు బోలెడు కనిపిస్తాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంత బాగుంటుందా?
అది 2169 సంవత్సరం. ప్రతి ఒక్కరూ చేతికి డిజిటల్ క్లాక్‌తో పుడతుంటారు. ముసలితనం అనేది రాకుండా జెనెటిక్స్‌లో శాస్త్రవేత్తలు మార్పులు చేసుంటారు. దీంతో ప్రతి ఒక్కరి వయసు 25 ఏళ్ల దగ్గరకొచ్చి ఆగిపోతుంది. బతకాలంటే మాత్రం కష్టపడి టైమ్ సంపాదించుకోవాలి. ఆ టైమ్‌తోనే వస్తువులు కొనుక్కోవాలి, అదే టైమ్‌ని ఎక్కడా పోగొట్టుగోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ చేతికున్న టైమ్ జీరో అయిపోతే మాత్రం నొప్పి లేకుండా చచ్చిపోతారు. అలా మురికివాడలో ఉండే హీరో విల్.. ఇదే టైమ్ కారణంగా ఒక్క సెకనులో తల్లిని కోల్పోతాడు. దీంతో పగ పెంచుకుంటాడు. తనకు ఇలాంటి పరిస్థితి కల్పించిన డబ్బునోళ్లపై పగ తీర్చుకుంటాడు? ఇంతకీ ఏం చేశాడు? వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది.. ఓటీటీలో ఈ మలయాళ థ్రిల్లర్ చూశారా?)
2011లో రిలీజైన హాలీవుడ్ మూవీ 'ఇన్ టైమ్'. బతకాలంటే టైమ్ కొనుక్కోవాలి, ఆ టైమ్‌తోనే ప్రతిదీ చేసుకోవాలి అనే డిఫరెంట్ కాన్సెప్టుతో తీసిన మూవీ ఇది. విల్ అనే కుర్రాడు తల్లితో కలిసి జీవిస్తుంటాడు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని టైమ్ సంపాదిస్తుంటాడు. అలాంటిది ఓ రోజు ఇతడికి ఓ వ్యక్తి 100 సంవత్సరాల్ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంకేముంది తల్లితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చని అనుకుంటాడు. కానీ ఒక్క సెకను లేట్ కావడంతో తన చేతుల్లోనే తల్లి చనిపోతుంది. దీంతో వేల సంవత్సరాలు దగ్గర పెట్టుకుని దర్జాగా బతికేస్తున్న డబ్బున్నోళ్లపై హీరో పగ పెంచుకుంటాడు.
వాళ్ల చోటుకే వెళ్లి వీస్ అనే ధనవంతుడు కూతురిని కిడ్నాప్ చేస్తాడు. ఇతడి ఆలోచనలకు ఫిదా అయిన ఆ అమ్మాయి.. హీరో విల్‌తో కలిసి టైమ్ దొంగిలించడం మొదలుపెడుతుంది. అలా సొంతం చేసుకున్న టైమ్‌ని వీళ్లిద్దరూ కలిసి పేదలకు పంచుతారు. ఇలా కథ సింపుల్‌గా చెప్పాను గానీ సినిమా చూస్తుంటే మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం బోర్ కొట్టకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఎంటర్‌టైన్ చేస్తుంది. మనుషులకు టైమ్ విలువ తెలిస్తే అది వృథా కాకుండా కాపాడుకోవడానికి ఎంత విలువ ఇస్తారో తెలియజేసే 'ఇన్ టైమ్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 'టైమ్' ఉంటే దీనిపై ఓ లుక్కేయండి. మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు.
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment