కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా  | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా 

Published Thu, Apr 13 2023 3:45 AM

 kalthi kallu deaths in mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. 

చికిత్స చేసినా ఫలితం లేక..  
మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్‌ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్‌ భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ గ్రామంలో పోస్టల్‌ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు.

తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్‌ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్‌ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది.

మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్‌ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్‌ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకిషన్‌ తెలిపారు. 

ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! 
కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్‌ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్‌ నగర్‌ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి.

ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్‌ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ బాధితులు! 
కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. 
 

 
Advertisement
 
Advertisement