చంద్రబాబూ.. దళితులంటే చులకనా?
- ముఖ్యమంత్రిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ ధ్వజం
- రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిప్పులు చెరిగారు. మంత్రి పదవుల విషయంలోనూ తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దళితులు ఇంకెంత కాలం మోసపోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళిత వ్యతిరేక పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల బ్యాక్‌లాగ్ పోస్టులున్నా.. ఈ మూడేళ్లలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా దళిత యువకులకు అన్యాయం చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం చిత్తూరులో ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాల్లో ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం కింద దళితుల భూములను లాక్కొని.. వారిని కూలీలుగా మారుస్తోందని ఆరోపించారు. ఫలితంగా దళితులు ఆర్థికంగా. సామాజికంగా మరింత వెనక్కి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని చెప్పారు.
దళితులు మంత్రులుగా పనికిరారా?
‘‘రాష్ట్ర జనాభాలో 20 శాతం కంటే ఎక్కువగా ఉన్న దళితులు, గిరిజనులకు కేవలం రెండు మంత్రి పదవులే కేటాయిస్తారా? జనాభా దామాషా ప్రకారం ఐదు నుంచి ఆరు రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు పదవులతో సరిపెట్టారు. కేంద్ర మంత్రి పదవుల విషయంలోనూ దళితులకు తీరని అన్యాయం చేశారు. కేంద్ర మంత్రులుగా దళితులు పనికిరారా? మంత్రివర్గంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులుంటే, అందులో ఒక్కరు కూడా దళితులు లేకపోవడం శోచనీయం. టీడీపీకి దక్కిన రెండు కేంద్ర మంత్రి పదవులను అగ్రవర్ణాల వారికే ఇచ్చారు. దళితులంటే ఎందుకంత చులకన? ఉప ప్రణాళిక(సబ్‌ప్లాన్) నిధుల వినియోగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది’’ అని శివప్రసాద్ అన్నారు.
ఇంకెంత కాలం మోసపోవాలి?
‘‘సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు దళితులకు ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఒక్క దళితుడికైనా ఇల్లు కట్టించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చామని చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, మిగిలిన 10 శాతం హామీలు ఎస్సీ, ఎస్టీలవి కాబట్టే నెరవేర్చలేదు. దళితులు ఇంకెంతకాలం మోసపోవాలి? ఇంకెంతకాలం ఇతరుల పల్లకీ మోయాలి? జయంతి ఉత్సవాలప్పుడే అంబేడ్కర్ లాంటి మహనీయులు పాలకులకు గుర్తుకొస్తారు. తరువాత వారిని మరచిపోతారు.
ఎకరాలకు ఎకరాలు సర్కారు భూములు కబ్జాకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. ఒక్క సెంటు భూమిలో దళితులు వేసుకున్న గుడిసెలను మాత్రం కూల్చేస్తారు. దళితుల డీకేటీ పట్టా భూములను పరిశ్రమల కోసం కారుచౌకగా తీసుకుంటూ 259 జీవోకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. డీకేటీ పట్టాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంకా నెరవేర్చలేకపోయారు’’ అని ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.