రామోజీకి సాక్షి సవాల్ | sakshi savals to ramoji rao | Sakshi
Sakshi News home page

రామోజీకి సాక్షి సవాల్

Published Sat, Apr 5 2014 2:17 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రామోజీకి సాక్షి సవాల్ - Sakshi

రామోజీకి సాక్షి సవాల్

ఇది సాక్షి సవాల్. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాన్ని ‘సాక్షి’ వ్యవస్థాపక చైర్మన్ వైఎస్ జగన్‌కుఅంటగడుతున్న రామోజీకి ఇది సాక్షి ప్రత్యక్షంగా విసురుతున్న సవాల్. ఏం రామోజీ! చేతికొచ్చినట్లు రాయటం కాదు. ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? ఆ ధైర్యం మీకుందా? టైటానియం తవ్వకాల కోసం దిమిత్రీ ఫిర్టాష్ కంపెనీ ఇండియాలోని పలువురికి లంచాలిచ్చిందంటూ అమెరికా దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసిందని, అందులో పేరు వెల్లడించకుండా ‘సి’ అనే వ్యక్తిని పేర్కొందని... ఆ ‘సి’ జగనేనని మీ విషపుత్రిక ‘ఈనాడు’ రాసేయటం... మీ కవలలాంటి చంద్రబాబు అవునంటూ తలూపటం... ఇవన్నీ మీకు తప్పనిపించలేదా? 40 ఏళ్లుగా పత్రిక నడుపుతున్న మీకు... ఏమైనా విలువలున్నాయా?
 
 

అమెరికాలో ఎఫ్‌బీఐ అభియోగాలు నమోదు చేసిన ‘టైటానియం మైనింగ్’ వ్యవహారానికి సంబంధించి రెండ్రోజులుగా తన విషపుత్రిక ‘ఈనాడు’లో పతాక శీర్షికలు వండి వారుస్తున్నారు రామోజీ. తొలిరోజు ఎఫ్‌బీఐ అభియోగాల్లో పేరున్న కె.వి.పి.రామచంద్రరావుపై కథనాన్ని ప్రచురించి... రెండోరోజు మాత్రం దాన్లో పేర్కొన్న ‘సి’ అనేవ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనంటూ తన ఊహల్ని ఆకాశానికి ఎగదోసి నిలువెల్లా విషం కక్కారు. అక్కడితో ఆగలేదు కూడా! ‘అలాంటి స్కెచ్చే’ అంటూ మరో కథనాన్ని వండేసి... వర్జిన్ ఐలాండ్ కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి ఈ నిధులు వచ్చాయని కూడా రాసేశారు. సి అంటే సిన్నోడు... అదెవరో మీకందరికీ తెలుసు!! అంటూ అందరి ఊహాశక్తీ తనలానే కుట్రపూరితంగా ఉంటుందని అనుకున్నారు రామోజీ. అందరి మాటా ఏమోగానీ చంద్రబాబుకు అచ్చంగా రామోజీలాంటి ఊహాశక్తే ఉంది. అందుకే ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ... ఇంకెవరు! జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. అసలు ‘స్కెచ్’ అంటే ఏంటి? ముందే రామోజీ, చంద్రబాబు మాట్లాడుకోవటం... ఇద్దరూ కూడబలుక్కుని ఒకే ఆరోపణ చేయటం... జగన్‌పై దుష్ర్పచారం చేస్తూ అచ్చేసిన వార్త కిందే... ‘సైకిల్ జోరు’ అంటూ బాబు ఫోటోతో మరో వార్త వెయ్యటం!! ఇది కాదూ.. స్కెచ్ అంటే!!
 
 జగన్ పేరుంటే వదిలేవారా?


 ఎఫ్‌బీఐ ఆరోపణ పత్రంలో నిజంగానే జగన్‌మోహన్ రెడ్డి పేరు ఉంటే ‘ఈనాడు’కు కోతికి కొబ్బరి కాయ దొరికినట్టే కదా!. మరి అప్పుడు జగన్‌ను వదిలి కేవీపీ బొమ్మతో పతాక శీర్షికన వార్తలెందుకు అచ్చేస్తుంది? ఈ మాత్రం జ్ఞానం కూడా జనానికి ఉండదన్నది రామోజీ ఫీలింగ్. అందుకే తొలిరోజు కేవీపీ పేరుతో వార్త ప్రచురించినా... రెండోరోజు బాబుతో కలిసి మొత్తం వ్యూహాన్ని చర్చించి, జగన్‌ను ఎన్నికల్లో అడ్డుకోవాలంటే ఎలాగైనా ఆయన్నే టార్గెట్ చేస్తూ దుష్ర్పచారం చేయాలని తీర్మానించుకున్నారు. ఆ వ్యూహం ప్రకారమే ఇద్దరూ కూడబలుక్కుని జగన్‌పై విషం గక్కే ప్రయత్నం చేశారు. జర్నలిజం అంటే నిజాన్ని రిపోర్ట్ చేయటం. ఎల్లో జర్నలిజం అంటే నిజంతో నిమిత్తం లేకుండా మనకు కావాల్సింది రాసుకోవటం. రామోజీ... ఆరోపణ పత్రంలో లేనివి ఉన్నట్టు రాసిన మీది ఏ జర్నలిజం..?
 
 జగన్‌కు ఏం సంబంధం?
 
 అసలు టైటానియం డీల్‌కీ, జగన్‌మోహన్‌రెడ్డికీ ఏమిటి సంబంధం? ఆ కంపెనీ సొమ్ము ఏ రకంగానూ ఒక్క పైసా కూడా జగన్ కంపెనీల్లోకి రాలేదన్నది పచ్చి నిజం. జగన్‌కు ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులెవరో కూడా తెలియదు. అన్నిటికీ మించి ఆయన ఏనాడూ సెక్రటేరియట్‌కు వెళ్లింది లేదు. హైదరాబాద్‌లో నివసించిందీ లేదు. బెంగళూరులో ఉంటూ... తన వ్యాపారాలేవో తాను చేసుకునేవాడన్నది రహస్యమేమీ కాదు. మరి అధికారులతో మాట్లాడి జగన్ పైరవీలు చేశాడని రాసిన రామోజీకి, ‘ఈనాడు’కు... ఆయన ఏ ఒక్క అధికారితో అయినా మాట్లాడినట్టు నిరూపించే గుండె ధైర్యం ఉందా?
 
 కొడుకునెవరైనా బంధువంటారా?
 
 ఈ ఆరోపణ పత్రంలో నిందితులుగా పేర్కొన్న ఆరుగురిలో కేవీపీ ఒకరు. నిందితులుగా పేర్కొనకపోయినా... ‘వైఎస్ బంధువు వీరికి సహకరించారు’ అని దాన్లో ఉందని, ఆ బంధువు జగనేనని ‘ఈనాడు’, తోకపత్రిక కూడా చంద్రబాబు సహకారంతో స్క్రిప్టు రెడీ చేసి ప్రచారం చేసేశాయి. పెపైచ్చు మామూలు బంధువులకు వైఎస్‌కు అంత దగ్గరగా ఉండటం సాధ్యం కాదని, జగన్‌కే సాధ్యమని తన సొంత భాష్యం జోడిస్తూ మరీ రెచ్చిపోయారు రామోజీ!! కొడుకుని ఎవరైనా కుటుంబ సభ్యుడంటారు కానీ బంధువంటారా? అమెరికాలో అయినా.. ఇండియాలో అయినా కొడుకుని ‘మా బంధువు’ అని ఎవరైనా చెబుతారా? రామోజీరావుకు కిరణ్‌గానీ, సుమన్‌గానీ బంధువులు కాదుగా? కొడుకులేగా!! చంద్రబాబుకు లోకేష్ బంధువా లేక కొడుకా?
 
 అమెరికా ఆరోపణలేమైనా కొత్తా!


 అమెరికా ప్రభుత్వం భారతీయ పౌరులపై ఆరోపణలు చేయటం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందూ చేసింది. ఒకవేళ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఈ డీల్‌తో సంబంధం ఉంటే నేరుగా ఆయన పేరే రాసేదిగా! ప్రభుత్వమే బయట పెట్టేదిగా! గోధ్రా మారణకాండకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కారకుడని తానే తేల్చేసిన అమెరికన్ ప్రభుత్వం... ఆయనకు వీసా కూడా ఇవ్వం పొమ్మంది. అలాగే యూపీఏ అధ్యక్షురాలు సోనియాకు 1984 సిక్కుల ఊచకోత కేసుతో సంబంధం ఉందంటూ అమెరికా కోర్టు సమన్లూ ఇచ్చింది. తాజా చార్జిషీట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావును నిందితుడిగా పేర్కొంది. మరి జగన్‌మోహన్ రెడ్డి కూడా నిందితుడైతే అమెరికా కోర్టు ఆ మేరకు ఆరోపణ చేయకుండా ఉంటుందా? దాన్నెవరైనా ఆపగలరా? మరి రామోజీకి ఇదంతా తెలియదా? తెలిసి కూడా ఎన్నికల ముందు జగన్‌పై బురద జల్లుతుండడాన్ని చూసి ఏమనుకోవాలి?
 
 ఎఫ్‌బీఐ అయినా... సీబీఐ అయినా
 
 రామోజీకి ఏదైనా ఒకటే. తననెవరైనా ప్రశ్నిస్తే నచ్చదు. అందుకే గతంలో సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఏకి పారేశారు. కానీ అదే సీబీఐ జగన్‌పైకి వచ్చేసరికి... దానికి విపరీతమైన పవిత్రతను ఆపాదించి, దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అంటూ కితాబులిచ్చేశారు. బాబు సూత్రధారిగా ఆరోపణలున్న ఐఎంజీ కేసులో సిబ్బంది లేరంటూ దర్యాప్తు చేయకపోయినా లక్ష్మీనారాయణను తప్పుబట్టలేదు సరికదా... వైఎస్ కుటుంబ పరువు ప్రతిష్టలే టార్గెట్‌గా జగన్ కేసులో తనకు లీకులివ్వటంతో  ఆయన్ను ఆకాశానికెత్తేశారు. అలాంటి రామోజీ... ఇపుడు ఎఫ్‌బీఐని ప్రపంచంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుపొందినదంటూ కీర్తించటం వింతేమీ కాదు. ఇదే ఎఫ్‌బీఐ గతంలో చంద్రబాబు సహచరులు, తెలుగుదేశం సన్నిహితులు పలువురిపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులూ పెట్టింది. నేరాలు నిరూపణై వాళ్లు జరిమానాలూ కట్టారు. కానీ రామోజీ అలాంటివేవీ తన పత్రికలో రాయరు. దీన్నేమనుకోవాలి? రామోజీకున్న విదేశీ భక్తా! లేక తెలుగుదేశం భక్తా!!
 
 ఇదంతా ఎందుకంటే!!
 
 ఎన్నికల ముందు ప్రసారమయ్యే సర్వేలను రిగ్గింగ్ చేయటం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారం చేయటం ఇవన్నీ చంద్రబాబుకంటే రాజకీయ అవసరాలు. ఎందుకంటే పదేళ్లుగా ప్రజలు అధికారానికి దూరంగా కూర్చోబెట్టారు కనక. మరి రామోజీకి ఏంటవసరం? నిజానికి రామోజీ కూడా పరోక్షంగా అధికారానికి దూరమయ్యారు. ఎందుకంటే బాబు అధికారంలో ఉంటే తెరవెనక ఉండి చలాయించేది ఈయనే కనక. పదేళ్లుగా బాబు అధికారంలో లేకపోవటం వల్ల తన కొత్త కంపెనీలేవీ పెట్టలేకపోయారు సరికదా... మార్గదర్శి కుంభకోణం నుంచి బయటపడటానికి ఉన్న చానళ్లను సైతం రిలయన్స్‌కు కట్టబెట్టాల్సి వచ్చింది. బాబు గెలిస్తే రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ పాత రోజులు వస్తాయనేది ఈయన దింపుడు కళ్లం ఆశ. అందుకే నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా తన పత్రికలో చోటివ్వని రామోజీ... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినా నోరెత్తని రామోజీ... ఇరు ప్రాంతాల ప్రజల హక్కులూ సర్వనాశనమైనా స్పందించని రామోజీ... ఇప్పుడు మాత్రం గొంతెత్తుతున్నారు. దేశం కోసం కాదు... తెలుగుదేశం కోసం!!!
 
 అవినీతిని విదేశాలకు పాకించింది బాబు కాదా?
 
 అసలు అవినీతిని దేశం దాటించిందెవరు? భూములు కేటాయించి, గనులు కేటాయించి లంచాలు తీసుకున్నదెవరు? చంద్రబాబు కాదా!! ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ అకాడమీకి అనుబంధమంటూ ఇక్కడ తన బినామీలతో డమ్మీ కంపెనీ పెట్టించి... ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా... అప్పట్లోనే ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే 850 ఎకరాల భూమిని రూ.50వేల చొప్పున కేటాయించింది చంద్రబాబు కాదా? దీనిపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదేమని ఏనాడైనా అడిగారా రామోజీ? అంత పెద్ద కుంభకోణాన్ని కూడా అది కుంభకోణం అని ఏనాడైనా ఒక సింగిల్ కాలమ్ వార్త రాశారా? ‘ఈమార్’ వ్యవహారంలో వాళ్లు అడిగింది 250 ఎకరాలైతే బాబు కేటాయించింది 530 ఎకరాలు.
 
 అదికూడా ఆ అదనపు భూమిపై చంద్రబాబు స్వయంగా నోట్‌ఫైల్ రాశారు. హైదరాబాద్‌లో 280 ఎకరాలంటే ఈ రోజున కనీసంగా 10,000 కోట్ల ఆస్తిని చంద్రబాబు అడగకుండానే వారికి అప్పగించటం ద్వారా ఎంత ముడుపులు పొందాడు? హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2,000 ఎకరాలు చాలునని కేంద్ర సంస్థలు నివేదికలిచ్చినా కూడా పక్కనబెట్టి 5,500 ఎకరాలు కట్టబెట్టిందెందుకు? ఈమార్‌పై దర్యాప్తు చేసిన సీబీఐ... భూములిచ్చిన చంద్రబాబును ఎందుకు పిలవలేదు? సంబంధిత సెక్రటరీనీ ప్రశ్నించలేదెందుకు? హెరిటేజ్ భాగస్వామి సుజనా చౌదరి డమ్మీ కార్యకలాపాలు చూపించి వందల కోట్లు పన్నులు ఎగ్గొట్టినా రామోజీకి కనిపించదా? విదేశాల్లోను, స్వదేశంలోను వందల కోట్లు మనీల్యాండరింగ్ చేస్తున్న సుజనా చౌదరిపై రామోజీ పెన్నెత్తరేం? ఈ ప్రశ్నలు ‘ఈనాడు’ ఏనాడూ అడగదెందుకు? చంద్రబాబు డీల్స్ అన్నిటా రామోజీకి కూడా కమిషన్ ముట్టిందా? ఏమో!!
 
 నోటికొచ్చినట్లు రాయటమేనా?
 
 జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో ‘2ఐ క్యాపిటల్’ పెట్టుబడులు పెట్టిందని, అవన్నీ వర్జిన్ ఐలాండ్స్‌లోని సంస్థల ద్వారా వచ్చాయని ఏదేదో రాశారు రామోజీ? 2ఐ క్యాపిటల్ ద్వారా వచ్చిన నిధులేమీ రహస్య నిధులు కాదే! సండూర్ పవర్‌లో అది పెట్టిన పెట్టుబడి బహిరంగ రహస్యమేగా? అందుకుగాను వాళ్లు షేర్లు కూడా తీసుకున్నారు. ఆ షేర్లను తరవాత కంపెనీయే కాస్త లాభంతో బైబ్యాక్ చేయటంతో వారు ఎగ్జిట్ అయ్యారు. ఇదే 2ఐ క్యాపిటల్... అప్పట్లో టాటాలకు చెందిన ఐడియా సెల్యులర్, సుబ్బరామిరెడ్డికి  చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్, గుజరాత్‌కు చెందిన పిపావవ్ షిప్‌యార్డ్ వంటి పలు లిస్టెడ్ కంపెనీల్లో సైతం పెట్టుబడులు పెట్టింది. అలాంటి సంస్థ జగన్ కంపెనీల్లో పెడితే తప్పయిపోయిందా? ఈ రాతలకేమైనా అర్థం ఉందా?
 
 జనం నమ్మట్లేదని తెలియదా!!
 
 వైఎస్‌పై, జగన్‌పై ‘ఈనాడు’ చేస్తున్న ఆరోపణలు ఎన్నికల ముందు మరింత తీవ్రం కావటం మామూలే. జ్వరాల సీజన్‌లా... ఇది ఎల్లో వైరస్ సీజన్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించాక 20 ఎమ్మెల్యే ఉప ఎన్నికలు, 2 ఎంపీ ఉప ఎన్నికలు జరిగితే... వాటికి ముందు రామోజీ సంధించిన ఆరోపణాస్త్రాలు మామూలువి కావు. ఎన్ని చేసినా ఒక్కటంటే ఒక్కచోటా తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు. మొత్తంగా కలుపుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 16 కూడా లేదు. ఒక అభ్యర్థికి డిపాజిట్ రావాలంటే... కనీసం పోలైన ఓట్లలో ఆరింట ఒక వంతు రావాలి. అంటే 16.6 శాతం. అంటే వైఎస్ మరణించాక టీడీపీ... ‘టోటల్ డిపాజిట్లు పోయిన’ పార్టీగా మారిందన్న మాట. జనం రామోజీని, చంద్రబాబును నమ్మి ఉంటే ఇలా జరిగేది కాదుగా?
 
 ఏది విశ్వసనీయత?
 
 జర్నలిజం అంటే విశ్వసనీయత. ‘ఈనాడు’కు ఎప్పుడో పోయిందది. డబ్బులు పంచని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మసిపూసే ప్రయత్నం చేస్తూ... మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటుకు తెలుగుదేశం పార్టీ కనీసంగా రూ. 1,000 నుంచి 3,000 వరకు పంచినా దానిపై సింగిల్ కాలమ్ ఐటమ్ కూడా రాయలేదు రామోజీ. గుర్రాల హసన్ ఆలీ డైరీల్లో డెరైక్ట్‌గా చంద్రబాబు నాయుడుతో తనకున్న లింకుల్ని  బయటపెడితే... చంద్రబాబు ఏకంగా కేంద్రంలోని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుని తనమీద కేసులు పడకుండా చూసుకుని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిలబెడితే- అదంతా అవినీతిగా కనిపించలేదు ఈయనకి. ఇదీ రామోజీ మార్కు జర్నలిజం... విశ్వనీయత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement