చంద్రబాబు టూర్‌లో కనిపించని శిల్పా చక్రపాణి
కర్నూలు: సీఎం చంద్రబాబు శనివారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం.. నంద్యాలకు రావడం ఇది రెండో సారి. ఈపర్యటనలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొనలేదు. ఇప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య అంతర్యుద్ధం జరుగుతోంది. అఖిల ప్రియకు ఉన్న ప్రాధాన్యం పార్టీలో సీనియర్ నేతలకు ఇవ్వడం లేదన్నది సీనియర్ల వాదన. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మంత్రి అఖిల ప్రియ కావాలనే శిల్పా చక్రపాణి రెడ్డిని పార్టీకి దూరం చేసినట్లు తెలుగుదేశం పార్టీలో గుసగుసలు. దీంతో చంద్రబాబు పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. అయితే అఖిల ప్రియ వర్గం మాత్రం ఇంకో వాదన చేస్తోంది. శిల్పా కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఉప ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికే ముఖ్యమంత్రి రెండు సార్లు నంద్యాల పర్యటిస్తున్నరనే విమర్శలు వస్తున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా 10 మంది డీఎస్పీలు, 23 మంది సీఐలు, 86 మంది ఎస్‌ఐలు, 254 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 654 మంది కానిస్టేబుళ్లు, 6 ప్లటూన్ల ఏఆర్, 3 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నారు. 46 మంది మహిళా పోలీసులు, 300 మంది హోంగార్డులు, 6 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.