బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ చేసినందుకు ఐదుగురు అరెస్టు

Published Fri, Jul 19 2019 8:19 AM

People Arrested For Cricket Betting In Rajam Town, Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాకు సంబంధించి మరో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం ఐదుగురి బెంటింగ్‌రాయుళ్లను రాజాం పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో మరో ఐదుగురు పరారయ్యారు. వారిని గురువారం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వాటి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు ఎస్పీ వెల్లడించారు. గతంలోనే  ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగిందన్నారు.

ప్రస్తుతం పట్టుకున్న ముఠా నుంచి రూ. 2.40 లక్షల నగదు, 6 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజాం పోలీసులు పట్టుకున్న ముఠాలో రాజాం పట్టణానికి చెందిన గొర్లె దుర్గారావు, రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన కత్రి సింహాచలం, వంగర మండలం కొండచాకరాపల్లికి చెందిన గెంబలి అనిల్‌కుమార్, రేగిడి ఆమదాలవలస మండలం పెద్దశిర్లాం గ్రామానికి చెందిన లెంకా చిన అప్పలనాయుడు, రాజాం మండలం మొగిలివలసకు చెందిన ఆబోతుల భగవాన్‌ ఉన్నారన్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ను ఉపయోగించుకొని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యాప్‌ ద్వారా రేటింగ్స్‌ ముందుగానే లెక్కించి ఏ టీంకు బెట్టింగ్‌ కాయడం వల్ల లాభదాయకంగా ఉంటుందో తెలియజేస్తారని, దానికి అనుగుణంగా యువతను బెట్టింగ్‌లోకి దించుతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్‌ సమాజానికి మంచిదికాదని ఎస్పీ అన్నారు. యువత బెట్టింగ్‌లోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయన్నారు. బెట్టింగ్‌ వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 

ప్రమాదాల నివారణకు ‘ఆపరేషన్‌ లక్ష్య’..
జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సుదీర్ఘ జాతీయ రహదారి ఉండటంతో  ప్రమాదాల నివారణకు మొబైల్‌ పోలీసు బృందాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ‘ఆపరేషన్‌ లక్ష్య’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వాహనాలకు ముందు, వెనుక రేడియం స్టిక్కర్లను అతికించే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వన్‌ స్టిక్కర్‌–వన్‌ లైఫ్‌ నినాదంతో వీటిని తయారుచేశామన్నారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు..
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యువతను మంచి మార్గంలో నడిపే దిశగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. భామిని మండలంలో ఇటీవల వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. త్వరలో సీతంపేటలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసులకు సమాజ పరిస్థితులపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసులు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తరఫున లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎచ్చెర్ల ఏటీఎం చోరీపై మాట్లాడుతూ ఒక బృందం రాజస్థాన్‌ వెళ్లిందని, ఈ నెలాఖరు నాటికి ఈ కేసు విషయంలో ప్రగతి ఉండవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జి.గంగరాజు, రాజాం సీఐ సి.సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement