పోరాటం.. ఆరాటమే! | Sakshi
Sakshi News home page

పోరాటం.. ఆరాటమే!

Published Sun, Jun 16 2024 3:31 AM

Unfortunate difficulties for employees in India

భావోద్వేగాల పరంగా ప్రతిరోజూ కోపగ్రస్తులవుతున్న వారు 35 శాతం 

దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌ 

భారత్‌లో  ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు 

గ్యాలప్‌ స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌–2024 నివేదికలో వెల్లడి

భారత్‌లోని ఉద్యోగుల్లో 86% ఇబ్బందులు, కష్టాల్లోనే..

40% మంది బాధ, విషాదాల్లో ఉన్నట్టుగా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లోని ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల సంతోషంగా లేరని ఓ సర్వేలో వెల్లడైంది. వారి ఉద్యోగ, వ్యక్తిగత జీవితం మానసికంగా, భావోద్వేగాల పరంగా, సామాజిక అంశాల పరంగా సంతోషంగా సంతృ›ప్తికరంగా సాగడం లేదని స్పష్టమైంది. దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో సాగుతున్నట్టుగా గ్యాలప్‌ స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌– 2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్ని విధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావాహ దృక్పథంతో ముందుకు అడుగు వేస్తున్నట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది.

అధ్యయనం ఇలా... 
దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా..ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక స్థితి, శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్‌ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ.. సంతృప్తి–పురోగతి, కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్‌), బాధ–కుంగుబాటు (సఫరింగ్‌) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరిస్తోంది. 

ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్‌ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? అనే అంశంపై పది పాయింట్లకు గాను కనీసంగా ఏడు, ఆ పై స్థాయిలో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్‌’(సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కిస్తోంది. ఉద్యోగులు తమ జీవితం పట్ల అభధ్రతా భావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారి ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్‌’(కష్టాలు ఎదుర్కోవడం)గా పరిగణిస్తోంది. ‘సఫరింగ్‌’ (బాధ–ఇబ్బందులు) గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారి ప్రస్తుత జీవనం, భవిష్యత్‌ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా, కనీస అవసరాలను కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధను అనుభవిస్తున్న వారిగా వర్గీకరిస్తోంది.

ఏమిటీ గ్యాలప్‌ సంస్థ ? 
ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్‌’కృషి చేస్తోంది. ఉద్యో­గు­లు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరు తెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో ఈ వర్గాల వారు ఎదుర్కుంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది.

ఉ­ద్యో­గి చేస్తున్న ఉద్యోగం, నిర్వర్తిస్తున్న విధు­లు, పనిలో భాగంగా ఎదురయ్యే అనుభవాలు, ఇబ్బందులను మాత్రమే కాకుండా.. జీవితంలో త్రైవింగ్, స్ట్రగు­లింగ్, సఫరింగ్‌ను తాము పరిశీలించినపుడు రోజువారీ భావోద్వేగాలు, కెరీర్‌ ముందడుగు వంటివి ప్రాథమికంగా ప్రముఖ పాత్ర పో­షిస్తున్నట్టుగా వెల్లడైందని గ్యాలప్‌ వరల్డ్‌ పోల్‌ గ్లోబర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ శ్రీనివాసన్‌ చెబుతున్నారు. ఉద్యోగం చేసే చోట్ల, పని ప్రదేశాల్లో సవాళ్లను, కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే వారికి... ఆయా అంశాలు వారి ఆరోగ్యం, సంతోషాలను ప్రభావితం చేస్తున్నట్టు స్పష్టమైందని తెలిపారు.  

‘స్టేట్‌ ఆఫ్‌ ద గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌’ నివేదికలో ఏముందంటే..?
ప్రతీరోజు భావోద్వేగ పరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపానికి, ఆగ్రహానికి గురవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం 

⇒ భారత్‌లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియాలో చూస్తే... శ్రీలంకలో ఇది 62 శాతంగా, ఆఫ్గానిస్తాన్‌లో 58 శాతంగా ఉండగా, భారత్‌లో 32 శాతం ఉంది

⇒ తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్‌లో మాత్రం 52 శాతంగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement