కొత్త బంగారు లోకానికి శ్రీకారం | deepawali special story on danwanthari | Sakshi
Sakshi News home page

కొత్త బంగారు లోకానికి శ్రీకారం

Published Sun, Oct 23 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

కొత్త బంగారు లోకానికి శ్రీకారం

కొత్త బంగారు లోకానికి శ్రీకారం

అమ్మ వారికి సంబంధించిన పవిత్రమైన ఆశ్వయుజ మాసానికీ, పండుగలకీ అవినాభావ సంబంధం. ఆశ్వయుజ మాసం మొదలవగానే సమస్త కార్యాలకూ, సకల శుభాలకూ శ్రీకారం చుట్టే మంచి రోజులు మొదలైనట్లు లెక్క. ఈ మాసంతోనే శరదృతువు మొదలు. ఆశ్వయుజం మొదలవగానే వచ్చే మొదటి తొమ్మిది రోజులూ వివిధ రూపాల్లో మహిషాసురుడిపై అమ్మ వారు యుద్ధం చేసి, విజయం సాధించిన శరన్నవరాత్రులు. పదో రోజు విజయదశమి. విశేషం ఏమిటంటే, ఆశ్వయుజ మాసం చివర వచ్చే రోజులు కూడా మహత్తర పర్వదినాలే. మాసం మొదట దుర్గాదేవిని ఆరాధిస్తే, ఈ మాసం చివరలో లక్ష్మీదేవిని పూజించడం ఆశ్వయుజంలోని ప్రత్యేకత. మొదట అంతా దసరా ఉత్సవాలైతే, చివరంతా దీపావళి వేడుకలు.

అయిదు రోజుల ‘దీపావళి’ వేడుక
దీపావళి అనగానే సాధారణంగా నరక చతుర్దశి, దీపావళి - రెండు రోజుల పండుగ అనుకుంటూ ఉంటాం. స్కూళ్ళకు సెలవులొచ్చే ఆ రెండు రోజుల గురించే ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ, చతుర్దశికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తిక శుక్ల విదియ దాకా అయిదు రోజులూ పండుగ దినాలే. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. మరునాడైన చతుర్దశి ‘నరక చతుర్దశి’ అనీ, ఆ మరునాడైన ఆశ్వయుజ బహుళ అమావాస్య ‘దీపావళి’ అనీ తెలిసిందే.

ఇక, ఆ వెంటనే కార్తిక మాసం మొదలవుతుంది. కార్తికంలో మొదటి రోజైన కార్తిక శుక్ల పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు. రెండో రోజైన కార్తిక శుక్ల విదియ నాడు తోడబుట్టిన అక్కచెల్లెళ్ళ చేతి భోజనం తినాలని పెద్దల మాట. దాన్నే ‘భగినీ హస్త భోజనం’ అంటారు (భగినీ అంటే సోదరి). ఇదీ అయిదు రోజుల దీపావళి వేడుకల వరుస. ఇవి కాక, మధ్యలో తదియ ఒక్క రోజు మినహా, కార్తిక శుక్ల చవితి నాడు ‘నాగుల చవితి’ కూడా పండుగే!

అజ్ఞానాంధకారాన్ని పారదోలే దీపం - లక్ష్మీదేవికి ప్రతిరూపం అంటారు. దీపావళి పండుగ రోజులు అనగానే లక్ష్మీపూజ గుర్తుకొస్తుంది. గుజరాతీయులకు దీపావళి నుంచి కొత్త సంవత్సరం. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించడం అలవాటు. అంతకన్నా రెండురోజుల ముందు ‘ధన త్రయోదశి’ నాడూ అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. ‘ధన త్రయోదశి’నే గుజరాతీయుల పద్ధతిలో ‘ధన్ తేరస్’ అంటారు.

‘ధన త్రయోదశి’ అంటే...
‘ధన్’ అంటే సంపద. ‘త్రయోదశి’ అంటే 13వ రోజు. పదమూడు మంచి అంకె కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ, మనకు మాత్రం పదమూడో తిథి (త్రయోదశి) మంచి రోజు. ‘ధన త్రయోదశి’కి వెండి, బంగారం కానీ, ఒకటి రెండు కొత్త పాత్రలు కానీ కొంటే అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. అందుకే, ఇంట్లో ఆడవాళ్ళు ఆ రోజున వెండి, బంగారు ఆభరణాలు, పాత్రలు కొనడం ఆనవాయితీ. దుష్టశక్తుల్ని పారదోలేలా ఆ రోజు సాయంత్రం వేళ మట్టి ప్రమిదల్ని వెలిగించి, లక్ష్మీపూజ చేస్తారు. భజన చేస్తారు. తీపివంటల్ని నైవేద్యంగా సమర్పిస్తారు.

మహారాష్ట్రీయులు ఈ ‘ధన్ తేరస్’ పర్వాన్ని చాలా గొప్పగా చేసుకుంటారు. ధనియాలు తీసుకొని మెత్తగా పొడి చేసి, దానికి బెల్లం కలిపి, లక్ష్మీదేవికి ప్రత్యేక నైవేద్యం పెడతారు. గ్రామాల్లో అయితే, రైతులు తమ ప్రధాన ఆదాయ వనరులైన పశువులను అలంకరించి, పూజిస్తారు.

‘ధన్ తేరస్’ రోజున వ్యాపారస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని, బాగా అలంకరిస్తారు. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. సకల సౌభాగ్యప్రదాయని అయిన లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తూ, గుమ్మంలో అందమైన ముగ్గులు వేస్తారు. దీపాలు పెడతారు. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడి బుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండేలా చూస్తారు.

 యముడి నుంచి కాపాడిన రాకుమారి
‘ధన త్రయోదశి’కి సంబంధించి ఆసక్తికరమైన ఒక ప్రాచీన కథ ప్రచారంలో ఉంది. అనగనగా హిమరాజుకు ఒక కుమారుడున్నాడు. సద్గుణవంతుడైన ఆ రాకుమారుడికి పెళ్ళయిన నాలుగోరోజున పాముకాటుతో మరణగండం ఉందని జోస్యులు చెబుతారు. పదహారేళ్ళ ప్రాయంలో రాకుమారుడికి వివాహం జరుగుతుంది. అతని భార్య తెలివైనది, దైవభక్తురాలు. మరణగండం విషయం తెలిసిన ఆమె ఆ రోజున భర్తను నిద్రపోనివ్వలేదు. ఒంటిమీది ఆభరణాలు, బంగారు, వెండి నాణాలు తీసి, గుమ్మం దగ్గర కుప్పగా పోసింది. ఆ ప్రాంతమంతా కళ్ళు జిగేల్మనేలా దీపాలు వెలిగించింది. భర్త నిద్రపోకుండా రాత్రి అంతా దైవగాథలు చెబుతూ, భజనలు పాడుతూ కూర్చొబెట్టింది.

 రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రానే వచ్చాడు. కానీ, గుమ్మం దగ్గర ఆ దీపాలు, ఆభరణాల వెలుగుతో కళ్ళ ముందు మరేమీ కనిపించలేదు. గది లోపలకు వెళ్ళ లేక ఆ నాణాల రాశి మీదే కూర్చొని, ఆ కథలు, పాటలు వింటూ ఉండిపోయాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లారాక పాము వెళ్ళిపోయింది. అలా పెళ్ళికూతురి తెలివితేటల వల్ల రాకుమారుడి గండం గట్టెక్కింది. అప్పటి నుంచి ఆ రోజును ‘ధన్ తేరస్’గా జరుపుకొంటున్నారు.

 దారి చూపే యమ దీపం!
ఇలాంటి పురాణ కథలు, గాథల వల్ల ఆ రోజున ‘యమ దీపం’ అనే మరో ఆచారమూ పాటిస్తారు. కుటుంబ సభ్యులెవరూ అకాల మృత్యువు బారిన పడకూడదని యమధర్మరాజును ప్రార్థిస్తూ, ఇంటి బయట ఒక దీపం వెలిగించి ఉంచడం కొన్నిచోట్ల సంప్రదాయం. ఇక, మాళవ దేశంగా ప్రసిద్ధమైన పశ్చిమ, మధ్య భారతావని ప్రాంతంలో మరో నమ్మకం ఉంది. ఈ ‘ధన త్రయోదశి’ పండుగకు యమలోకంలోని పితరులు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్థుల విశ్వాసం. అందుకని, ఆ రోజు సాయంకాలం తమ ఇంటి ముందు వీధిలో దక్షిణ దిక్కుగా దీపం పెడతారు. ఇంటికి వచ్చే పితరులకు అది దారి చూపిస్తుందని నమ్మకం. ఆ రోజున ఇంటిలో ప్రతి గదిలో దీపం పెట్టే ఆచారం అక్కడా ఉంది. ఇంట్లో దీపాలు ఆడవాళ్ళు పెడతారు కానీ, పితరుల కోసం వీధిలో దక్షిణదిక్కుగా పెట్టే దీపం మాత్రం తల్లితండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. తల్లితండ్రులున్న ఇంటి యజమాని మాత్రం ఆ దీపం అసలు పెట్టనే పెట్టడు

లక్ష్మీదేవి, ధన్వంతరి పుట్టిందీ ఆ రోజే!
మరో కథ ఏమిటంటే, సేవించినంత మాత్రాన మరణం లేకుండా చేసే అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. అప్పుడు సరిగ్గా ‘ధన్ తేరస్’ రోజునే ఆ పాలకడలి నుంచి చేతిలో అమృత కలశంతో విష్ణుమూర్తి అవతారమూ, దేవవైద్యుడూ అయిన ధన్వంతరి పైకి వచ్చాడట! అలా క్షీరసాగర మథనంలో అమృతకలశంతో ఆయుర్వేద విజ్ఞానదాత ధన్వంతరి పైకి వచ్చిన రోజే ‘ధన త్రయోదశి’ అని ఐతిహ్యం. అందుకే, ఈ ధన్వంతరి జయంతి నాడు ఆయురారోగ్యాలు కోరడం సహజం. అయతే ఆయురారోగ్యాలకు యమ ధర్మరాజు సహకారం కావాలి కాబట్టి, ఆయన ప్రీతి కోసం సాయంత్రం వేళ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం పెడతారన్న మాట!

అలాగే, ఆ రోజునే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందనీ అంటారు. అందుకే, ‘ధన్ తేరస్’ రోజున లక్ష్మీదేవి, ధనానికి అధిపతి కుబేరుణ్ణి పూజించే ఆచారం. ఆ తరువాత రెండు రోజులకు దీపావళి జరుపుకొనే అమావాస్య నాడు లక్ష్మీపూజ విశేష ఫలం.

ఆ రోజు ఏం చేయాలంటే...
‘ధన్ తేరస్’ రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడమే కాక, పాత్రలన్నిటినీ తోమి, తళతళలాడేలా చేస్తారు. అదేరోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త పాత్ర కొని, పూజలో పెడతారు. దాన్నే ఆ తరువాత దీపావళి పండుగ రోజుల్లో వాడతారు. ఇలా ఎన్నో విశేషాలున్న ‘ధన త్రయోదశి’తో దీపావళి వేడుకలు భక్తిపూర్వకంగా మొదలవుతాయి.

  ఏ సమయంలో పూజించాలి?
‘ధన త్రయోదశి’ నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవి పూజ శ్రేష్ఠం! ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని  నమ్మిక. అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం నుంచే త్రయోదశి తిథి మొదలవుతుంది. సాయంత్రం సుమారు ఏడు తరువాత నుంచి స్థిర లగ్నమైన వృషభ లగ్నం. కాబట్టి, ఆ రోజు ఏడుంబావు నుంచి 8.30 గంటల మధ్య సమయంలో ‘ధన్ తేరస్’ పూజ చేయడం విశేష ఫలప్రదమని జోస్యుల సూచన.  
- రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement