హృదయమున్న ప్రయోగం వికర్ణ | Diagonal experiment hearts | Sakshi
Sakshi News home page

హృదయమున్న ప్రయోగం వికర్ణ

Published Sat, Apr 11 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

హృదయమున్న ప్రయోగం వికర్ణ

హృదయమున్న ప్రయోగం వికర్ణ

  నవల

ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించినవాడు వికర్ణుడు. అంత మంది కురువంశ పెద్దలు, చక్రవర్తి ధృతరాష్ట్రుడు, భావి సామ్రాట్ దుర్యోధనుడు, పాండవులు... ఇంత మంది ఉండగా నోరు విప్పి ఇది తప్పు, అధర్మం అని అరిచినవాడు వికర్ణుడే. కౌరవ సోదరుల్లో  పదిహేడవ వాడిగా జన్మించిన  వికర్ణుడి కథే డా.చింతకింది శ్రీనివాసరావు పౌరాణిక నవల ‘వికర్ణ’. అయితే ఈ వికర్ణుడి పాత్రకు ప్రాధాన్యం లేదు. ఇతడి ఆదర్శాలకు ప్రచారం లేదు. స్త్రీల ఆత్మగౌరవాన్ని గౌరవించే ఇలాంటి పాత్రల విశిష్టత ఈ తరం వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ రచయిత ఈ నవల రాశారు. స్త్రీలపై నిత్యం వేధింపులు, దాడులు జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి రచనలు ఎన్ని జరిగితే అంత మేలు.

ఈ నవల కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని సమక్షంలో మొదలవుతుంది. కౌరవ వంశంలోగాని, పాండవ వంశంలోగాని అందరి కంటే ధర్మబద్ధుడైన వాడు ఎవరు? అని అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ప్రశ్నను సంధించగా అందుకు సమాధానంగా వికర్ణుడి కథ ముందుకు వస్తుంది. వికర్ణుడి జన్మ, కౌరవుల కంటే అతడు విభిన్నంగా పెరగడం, దుర్యోధునుడి కుట్రలను ఎదిరించడం, ధృతరాష్ట్రుడి అనధికార పుత్రుడైన యుయుత్సుని కోసం తపన పడటం, రాచసభలో అతడి మర్యాద కోసం వాదన చేయడం, వస్త్రాపహరణ ఘట్టంలో అగ్రజుణ్ణి ఎదిరించి రాజ్య బహిష్కారం పొందటం, చివరకు తల్లి మాటను శిరసావహించాలన్న ‘ధర్మానికి’ కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన నిలబడి ప్రాణాలర్పించడం వరకూ సాగుతుంది కథ.

 వికర్ణుణ్ణి చంపరాదని ద్రౌపది కోరిక. పాండవులు ఆ కోరికను మన్నించారు. అయినా భీముడి గదకే వికర్ణుడు ప్రాణాలు అర్పించాల్సి రావడం విషాదం. ఎన్టీఆర్ మహాభారతంలోని ఏ పాత్ర కడితే కథంతా ఆ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చి సాగినట్టు ఈ నవల కూడా వికర్ణుడికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. సులభ వచనం, వేగంగా సాగే శైలి ఇందులోని విశిష్టత. పాత్రికేయ వృత్తిలో ఉంటూ, ఉత్తరాంధ్ర పలుకుబడిలో కథలు రాస్తున్న చింతకింది పౌరాణిక భాషను అలవోకగా రాసే ప్రయత్నం చేయడం ముచ్చట గొలుపుతుంది. ధృతరాష్ట్రుడు ఒక సందర్భంలో ‘నాకు కళ్లు లేవుగాని కన్నీళ్లు లేవనుకుంటున్నావా?’ అంటాడు. ఇలాంటి మంచి మాటలు కూడా ఉన్నాయి.

అయితే కన్సిస్టెన్సీలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని గంభీరమైన మాటల్లో ఒక చులకనైన మాట జారుతోంది. ‘బూచి’  అనేది ‘బుస్సీ’ నుంచి వచ్చిందని రచయితకు తెలియని విషయం కాదు. అలాంటి మాటలు నవలలో కనిపించాయి. కృష్ణయ్య, శకునిమామా... అని రచయితే అనరాదు. పాత్రలు అనాలి. ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లే తప్ప ఇది హాయిగా చదువుకోతగ్గ నవల.
 వికర్ణ- డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు, వెల: రూ. 110 ప్రతులకు: 8897147067
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement