సుందర నవల: సముద్రతీర గ్రామం
తెలుసుకోదగ్గ పుస్తకం
‘నీవు అభివృద్ధి చెంది నీలో మార్పు రావటానికి బాగా నేర్చుకో. ఎప్పుడూ పరిస్థితులు మారుతూంటాయి. ఏదీ ఒకే విధంగా ఉండదు. మన భూమి అంతా నీటితో నిండి ఉన్నప్పుడు అన్ని ప్రాణులు నీటిలో జీవించి ఈదుతుండేవి. నీరు తగ్గిపోయి, భూమి కనిపించడంతో సముద్రంలోని ప్రాణులు బయటకు పాకి గాలి పీల్చడం భూమి మీద నడవడం నేర్చుకున్నాయి. తినడానికి చాలినన్ని మొక్కలు లేకపోవడంతో అవి ఆహారం కొరకు వేటాడి చంపటం నేర్చుకున్నాయి. అన్నీ అలానే ఉన్నాయనుకోకు. ఇంకా మారుతూనే ఉన్నాయి. మారుతూనే ఉంటాయి. జీవించి ఉండాలంటే నువ్వు కూడా మారవలసి ఉంటుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆగదు’...
‘సముద్ర తీరగ్రామం’ నవలలో తన దగ్గర పని నేర్చుకుంటున్న చిన్న కుర్రాడికి వాచీలు రిపేరు చేసే ముసలాయన చెప్పిన బతుకుపాఠం ఇది. ‘ది విలేజ్ బై సీ’ నవలకు తెలుగు అనువాదమైన ఈ నవలను రాసింది అనితా దేశాయ్. ఇండియన్ ఇంగ్లిష్ రచయిత్రిగా పేరున్న అనితా దేశాయ్ 1982లో రాసిన ఈ నవల ‘గార్డియన్ ఆవార్డ్ ఫర్ చిల్డ్రన్ ఫిక్షన్’ బహుమతి పొందింది. నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు ఎం.వి.చలపతిరావు చేత దీనిని తెలుగులో రాయించారు.
ఇది బాల్యం నుంచి కౌమారంలోకి మళ్లుతున్న పిల్లల కోసం రాసిన నవల. నవలలో కూడా ఆ వయసు పిల్లలే పాత్రధారులు. పదమూడేళ్ల లీల, పన్నెండేళ్ల హరి, వాళ్ల చెల్లెళ్లు బేల, కమల, బుజ్జి, కుక్కపిల్ల పింటో... వీళ్ల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. వారిది బెస్త కుటుంబం. అయితే తండ్రి అప్పులు తీర్చడం కోసం పడవ అమ్మేసి వేట మానేస్తాడు. ఎప్పుడూ తాగుతూ మత్తులోనే ఉంటాడు. తల్లేమో పోషకాహారం లేక రోగంతో మంచం పడుతుంది. దాంతో కుటుంబభారం పిల్లల మీద పడుతుంది. చిన్నపాటి స్థలంలో ఆకుకూర పండించుకోడానికి లీల, హరి తంటాలు పడుతూ ఉంటారు. ఎప్పుడైనా బొంబాయి నుంచి డిసిల్వా కుటుంబం వాళ్లు సరదాగా గడపడానికి వాళ్ల గెస్ట్‌హౌస్‌కి వచ్చినప్పుడు వాళ్లకి ఇంటి పనిలో సాయపడుతూ ఆ పిల్లలు ఎంతో కొంత సంపాదించుకుంటూ ఉంటారు.
ఇంతలో ఎరువుల కర్మాగారం కట్టడానికి ఊళ్లో ఉన్న పచ్చటి పంటభూముల్ని తీసేసుకోవాలన్న పాలకుల నిర్ణయం ఊరి వాళ్లని కలవర పెడుతుంది. దీన్ని నిరసిస్తూ బొంబాయిలో జరిగిన ఒక ప్రదర్శన కోసం అందరితో పాటు హరి కూడా వెళతాడు. అక్కడ డిసిల్వాని కలిసి ఏదైనా పని అడుగుదాం అనుకుంటాడు. కాని ఆ జనారణ్యంలో ఆ ప్రయత్నం ఫలించక రోడ్డు పక్క హోటల్‌లో పనివాడుగా చేరతాడు. ఆ పక్కనే ఓ వాచి రిపేరు షాపు యజమాని హరిని చూసి ముచ్చటపడి ఖాళీ టైములో హరికి వాచీలు బాగు చేయటం నేర్పిస్తాడు. హరి వాచీలు బాగుచేయగా వచ్చిన డబ్బుని అతనికే యిస్తాడు. ఇక్కడ ఊళ్లో డిసిల్వా కుటుంబం చాలాకాలం గడిపేందుకు వచ్చి లీల చేసిన సహాయానికి ప్రతిఫలంగా వాళ్ల అమ్మని ఆసుపత్రిలో చేరుస్తారు. తండ్రి తాగుడుమాని ఆసుపత్రిలోనే తల్లిని చూసుకుంటూ ఉంటాడు. డిసిల్వా అందించిన ఆసరా ఆ కుటుంబాన్ని తెప్పరిల్లేలా చేస్తుంది. దుమ్మూ ధూళి మురికితో నిండిన బొంబాయిలో ఉండలేక హరి తను దాచుకున్న డబ్బుతో ఖచ్చితమైన ఆలోచనలతో ఊరికి తిరిగి వస్తాడు. తల్లి కూడా ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తుంది. పిల్లలు రేపటి మీద అనేక ఆశలతో రాబోయే మార్పులకు సిద్ధపడుతూ ఉండగా నవల ముగుస్తుంది.
మైదానంలోని ఏరులా ఎలాంటి డ్రామాలు, మలుపులు లేకుండా చల్లగా మనల్ని చుట్టుకుంటూ సాగిపోతుంది ఈ నవల. ఏముందిలే ఇందులో అనుకుంటే రోజుల తరబడి లీల, హరి, సముద్రపు హోరు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. దరిద్రం ఉంటుంది. కాని ఆ పిల్లల వ్యక్తిత్వం ముందు అది చాలా చిన్నగా అయిపోతుంది. అంతటి ప్రతికూల పరిస్థితులలోనూ పదమూడేళ్ల లీల ఆరిందాలా కుటుంబాన్ని నడపటం ముచ్చటేస్తుంది. వీళ్ల జీవితాల్ని బాగు చేయడానికి పచ్చదనానికి మంటలు పెట్టే కర్మాగారాలు అక్కరలేదు. చేయి యిచ్చి నిలబెట్టే చిన్నపాటి ఆసరా చాలు. అదే డిసిల్వాగాని, వాచీలు రిపేరు చేసే ముసలాయనగాని ఆ పిల్లలకి చేసిన ఉపకారం.
ఈ నవల పిల్లల కోసమే కాదు, కుర్రతనపు జ్ఞాపకాలను మోసుకొనే ప్రతి మనిషి కోసం. మార్పును తిట్టుకుంటూ అప్పుడెప్పుడో ఎంతో బాగుండేది అంటూ గుండెలు బాదుకునే నిరాశావాదులలో ఆశ కోసం, తమ మీద తనకి నమ్మకమున్న జాతి కోసం.
- కృష్ణమోహన్‌బాబు 9848023384