రావి కొండలరావు జ్ఞాపకాలు నాగావళి నుంచి మంజీర వరకు...
రావి కొండలరావు ఇప్పటికి చాలా పుస్తకాలే రాశారు. ఇది మరొకటి. కాని పెద్దవాళ్లలో ఉండే విశేషం ఏమంటే వాళ్ల దగ్గర ఎంత జీవితం ఉంటుందో అన్ని జ్ఞాపకాలుంటాయి. పదహారేళ్ల వయసులో మద్రాసు పారిపోయిన వ్యక్తి దాదాపు 60-70 ఏళ్లు ఆ రంగంతో పెనవేసుకుపోతే జ్ఞాపకాలకేం కొదువ? అయితే ఈ పుస్తకం కొంచెం ఆత్మకథ వరుసలో సాగింది. ‘నాగావళి నుంచి మంజీర వరకు’ అనడంలో ఆ వరుస కనిపిస్తుంది. కళింగాంధ్ర నాగావళి తీరం నుంచి తెలంగాణ మంజీర తీరం వరకూ తన ప్రస్థానంలో తారసపడిన అనుభవాల సమాహారమే ఈ పుస్తకం. చేయి తిరిగిన కలం కనుక చకచకా నడిపించుకొని పోతుంది.
సినిమా అంటే ఎవరికైనా ఆసక్తి కనుక కుతూహలం నిలబెడుతుంది. ‘ఆనందవాణి’ పత్రిక యజమాని ‘వంద ఇస్తాను. చేరు’ అంటే చేరారు రావి కొండలరావు. కాని ఆ వంద ఎప్పటికీ రాదు. రేపిస్తాను అంటుంటాడు యజమాని. అదాయన ఊతపదం అని ఈయనకు తెలియదు. ఆ సీట్లోనే అంతకు ముందు శ్రీశ్రీ, ఆరుద్ర చేసి ఆ వంద అందక పారిపోయారు. ఈయనా పారిపోక తప్పలేదు. ఈ పుస్తకం చదివితే అర్థమయ్యేదేమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. వినయం ఉంటే అవకాశం లభిస్తుంది అని. ఈ రెంటినీ రెండు చేతులు చేసుకొని పెద్దల ప్రోత్సాహం, ఆశీర్వాదంతో జీవితాన్ని ఈదేశారు రావి కొండలరావు. రేలంగి, పింగళి, చక్రపాణి, పెండ్యాల, మల్లాది, బాపు, రమణ... ఎందరు పెద్దలవో జ్ఞాపకాలు ఇందులో ఉన్నాయి. ఇంతకు మించిన అనుభవాలు ఉన్నవారు ఉండొచ్చు. వారు రాయరు. రాసే అదృష్టం రావి కొండలరావుకు దక్కింది. పాఠకులకు ఈ అనుభవఫలం సంప్రాప్తమయ్యింది.
వెల: రూ.150 ప్రతులకు: 98480 71175, 7893809839