అక్షరాలతో కట్టిన గుడి...
సుప్రసిద్ధ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశర్మ కథలు ఎంత ప్రసిద్ధమో ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ అంతే ప్రసిద్ధం. శ్రీపాద జీవితం తెలుసుకోవడం కోసం మాత్రమే గాకుండా ఒకనాటి తెలుగు సమాజపు పోబడికీ, పలుకుబడికీ దర్పణంగా కూడా ఈ ఆత్మకథను చూస్తారు. దీనిని చదివి ఎందరెందరో గొప్పవాళ్లు ప్రశంసలు కురిపించారు. మహా పండితులు వేలూరి శివరామశాస్త్రి ఏమన్నారో చూడండి....
మీ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివాను. చదివించాను. ఆ చదివినవారూ నేనూ కూడా ఒక్క గుక్కలో చదివాం. ఇంకా ఇది (చదవాలని కుతూహలపడి తీసుకువెళుతున్నవారి వల్ల) వేయిళ్ల పూజారిగానే ఉంది. తెలుగు గుడి కట్టాలి కట్టాలి అని పరితపించిన శ్రీరామచంద్రశాస్త్రిగారు గనక బతికి ఉంటే అక్షరాలతో కట్టిన ఈ తెలుగు గుడికి ఎన్ని గోపురాలు ఎన్ని సోపానాలు కట్టి ఉండేవారో కదా. తెలుగువారిలో తెలుగుదనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది. ‘అది ఎప్పుడో ఉండేది’ అని కూడా మన తెలుగు పిల్లలెరగరు. ‘నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెద వాండ్రా’ అని నేను సుమారు నలుబది ఏండ్ల క్రితం ప్రశ్నించాను. మీ పుస్తకమున్నూ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆంధ్ర పురాణమున్నూ వచ్చినవి. చాలు-కాలో హ్యయం నిరవధి ద్విపులా చ పృధ్వీ.
ఈ సంపుటంలో అంతరంగా ఉన్న తెలుగుదనమూ దానికి చాలకమైన స్వయంకృషీ వీనికి దేవతలు కూడా సంతోషిస్తారు. తెలుగువారిలో తెలుగుదనం ఉన్నదని ఈ పుస్తకం కళ్లు తెరిపిస్తుంది. ప్రతి హైస్కూలులోనూ ప్రతి కాలేజీని ప్రతి తెలుగు వ్యక్తినీ ఈ పుస్తకం చదవమని అనురోధిస్తాను.
‘తెలుగుభాష’ ఆడవాళ్లలో ఉన్నదని రాశారు. ‘కాంతా సమ్మితతయా ఉపదేశయుజే’ అని చెప్పినవాడు తెలియకుండా మీ నోట్లో నుంచి ఊడి పడ్డాడు. దానికీ కొంత తేడా లేకపోలేదుగాని తరచి చూస్తే ఈ రెండూ ఒకదాని అవతారాలే. భేష్.