అమర్‌నాథ్‌లో మనోళ్ల పాట్లు
- కశ్మీర్‌లో చిక్కుకుపోయిన వందలాది తెలంగాణ యాత్రికులు
- అల్లర్ల నేపథ్యంలో లాడ్జీలు, సైనిక గుడారాల్లో తలదాచుకుంటున్న వైనం
- అందరినీ క్షేమంగా రప్పిస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి
- తగిన సాయం అందించండి: కశ్మీర్ ఏడీపీతో ఇన్‌చార్జి డీజీపీ
సాక్షి నెట్‌వర్క్ : తెలంగాణ నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారు కశ్మీర్‌లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలుచోట్ల ఆందోళనకారులు యాత్రికుల బస్సులు, బస కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు ఆర్మీ గుడారాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన 150 మంది, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 80 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన మరో 500 మంది పహల్గాం, బాల్తాల్ మిలటరీ బేస్ క్యాంప్‌లో ఉన్నారు.
బస్సుపై అల్లరి మూకల దాడి
మెదక్ జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా అల్వాల్, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన 105 మంది గత నెల 29న అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరారు. వీరిలో రంగారెడ్డి జిల్లా కండ్లకోయ హనుమాన్ పీఠాధిపతి, అఖిలభారత హనుమత్‌దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ కూడా ఉన్నారు. ఈ నెల 6న వీరు అమర్‌నాథ్‌కు వెళ్లి, 8న తిరుగు పయనమయ్యారు. మూడు బస్సుల్లో విడిపోగా, 30 మందితో ఒక బస్సు శ్రీనగర్ లాల్‌చౌక్ చేరుకుంది. సరిగ్గా అప్పుడే అక్కడ విధ్వంసం సాగుతోంది. దీంతో యాత్రికులు ఓ లాడ్జిలో ఆశ్రయం పొందారు. కాసేపటికే అల్లరిమూకలు అక్కడికి వచ్చి బస్సు అద్దాలు పగులగొట్టి యాత్రికులపై దాడికి యత్నించారు. మిగతా రెండు బస్సుల్లోని యాత్రికులు బాల్టాక్ ప్రాంతంలో నిలిచిపోయారు. ఎఫ్‌సీఐ గోదాం, హోటళ్లలో తలదాచుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వెళ్లిన 80 మంది యాత్రికులు బాల్టాక్‌లో బేస్‌క్యాంపుల్లో ఆశ్రయం పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 500 మంది పహల్గాం, బాల్తాల్ మిలటరీ బేస్ క్యాంప్ లో తలదాచుకుంటున్నారు. తాము సురక్షితంగానే ఉన్నట్టు వీరు సమాచారం అందించారు.
చర్యలు తీసుకుంటాం: లక్ష్మారెడ్డి, మంత్రి
అమర్‌నాథ్ యాత్రికులను క్షేమంగా ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. యాత్రికుల క్షేమ సమాచారాన్ని విచారించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నాం. ఈ మేరకు హోంమంత్రి తో మాట్లాడి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం.
కశ్మీర్ ఏడీపీతో మాట్లాడిన ఇన్‌చార్జి డీజీ
కశ్మీర్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం అందించాల్సిందిగా తెలంగాణ ఇన్‌చార్జి డీజీపీ అంజనీకుమార్ అక్కడి శాంతిభద్రతల ఏడీపీ ఎస్‌ఎం సహాయ్‌ను కోరారు.ఆదివారం ఫోన్ చేసి అక్కడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఏదైనా వ్యాధులతో బాధపడేవారికి తక్షణం మందులు అందేలా చూడాలన్నారు.
3 రోజులుగా బేస్‌క్యాంప్‌లోనే!
బల్తాల్, శ్రీనగర్ బస్టాండ్‌లో చిక్కుకున్న 365 మంది ఏపీవాసులు
సాక్షి, ఒంగోలు/బుచ్చిరెడ్డిపాళెం/నల్లజర్ల/ విశాఖపట్నం: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 365 మందికిపైగా యాత్రికులు తిరుగుప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులో జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో బల్తాల్‌లోని బేస్‌క్యాంప్ వద్దనే రక్షణ ద ళాలు వీరి వాహనాలను అడ్డుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగిన తరువాత పంపుతామని అక్కడి అధికారులు చెప్పడంతో మూడు రోజులుగా అక్కడే ఉండిపోయారు. మౌలిక వసతులు లేక యాత్రికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ చిక్కుబడిపోయినవారిలో ప్రకాశం జిల్లాకు చెందిన 118 మంది, పశ్చిమగోదావరి 80 మంది, గుంటూరు 40 మంది, నెల్లూరు జిల్లా నుంచి 47, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 80 మంది ఉన్నారు.
యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడిన వైవీ, బాలినేని
అమర్‌నాథ్‌లో ఇరుక్కుపోయిన ఒంగోలు ప్రాంతానికి చెందిన యాత్రికులతో ఆదివారం ఉదయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫోన్ లో మాట్లాడారు. అనంతరం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జమ్మూ డీజీపీ రాజేంద్రకుమార్‌తో సైతం మాట్లాడారు. యాత్రికులను పూర్తి రక్షణతో స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ భవన్ అధికారి శ్రీకాంత్‌ను ఆదేశించారు. మాజీ మంత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా యాత్రికులతో మాట్లాడారు. వారిని స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.