సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.
తాను అందరికంటే సీనియర్‌నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్‌ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్
కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్‌లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment