ఢిల్లీ: అగ్ర రాజ్యం అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్‌ను ఎంపిక చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. తులసీ గబ్బార్డ్ ఎంతో అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని నిర్మలా ప్రశంసలు కురిపించారు.
అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్ ఎంపికపై తాజాగా నిర్మలా సీతారామన్ స్పందించారు. నిర్మల ట్విట్టర్ వేదికగా..‘గత 21 ఏళ్లగా అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా తులసీ సేవలందించారు. మీతో నేను చేసిన కొన్ని సంప్రదింపుల సందర్భంగా మీ ఆలోచనలు, అంకితభావం.. కొన్ని విషయాల పట్ల స్పష్టత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కీలక బాధ్యతలు చేపట్టబోతున్న మీకు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా గతంతో ఆమెతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు.
Congratulations @TulsiGabbard on being selected to serve as Director of National Intelligence. For 21 yrs you served the USA as a soldier becoming a Lt. Colonel in Army Reserve. In my few interactions with you, have been impressed by the clarity of your thoughts and dedication.… pic.twitter.com/b5LSZyx9F9
— Nirmala Sitharaman (@nsitharaman) November 15, 2024
ఇదిలా ఉండగా.. అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్ వ్యవహరించబోతున్నారు. ఈ క్రమంలో జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో పాటు.. దాదాపు 18 యూఎస్ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా.. ఇవి సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు. నిఘా సమాచారాన్ని సేకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది.
తులసీ గబ్బార్డ్.. 1981లో అమెరికాలో జన్మించారు. ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. 21 ఏళ్లు రాగానే 2002లో ఆమె హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏడాదే హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్‌లో చేరారు. అదే ఏడాది ఆమె వివాహం ఎడ్వర్డ్ టమాయోతో జరిగింది. 2004-05లో ఇరాక్ యుద్ధ క్షేత్రంలో మెడికల్ యూనిట్‌లో పనిచేశారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయారు. 2007లో అలబామా మిలిటరీ అకాడమీలోని యాక్సిలరేటెడ్ ఆఫీసర్స్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు. దాని 50 సంవత్సరాల చరిత్రలో ఈ పట్టా అందుకున్న తొలిమహిళగా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ కువైట్‌లో ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ యూనిట్‌లో పనిచేశారు. ఆమెకు కాంబాట్ మెడికల్ బ్యాడ్జ్, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. 2010లో హోనలులు సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. గతంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున నెగ్గి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్‌లో సభ్యురాలిగా ఉన్నారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడారు. తాజా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌నకు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment