న్యూ ఇయర్ వేడుకల్లో పెను విషాదం
టర్కీ: ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునికిపోగా, టర్కీలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ లోని నైట్ క్లబ్‌లో ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 35మంది మృతిచెందగా, మరో 40 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టకోయ్ లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ కథనం ప్రకారం.. న్యూ ఇయర్ వేడుకులు జరుగుతుండగా నైట్ క్లబ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. కాల్పులు జరిగిన సమయంలో దాదాపు 500 మంది నైట్ క్లబ్‌లో వేడుకల్లో పాల్గొన్నారు. సాయుధుడు నైట్‌క్లబ్ లో కాల్పులు జరపక ముందు ఓ పోలీసు అధికారి, ఓ పౌరుడిపై కాల్పులకు తెగబడ్డాడు.
అనంతరం నైట్‌క్లబ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గవర్నర్ వివరించారు. శాంతాక్లాజ్ దుస్తుల్లో ఉన్నందున ఎవరికీ వారిపై అనుమానం రాలేదన్నారు. కాల్పులు జరిపింది ఎంతమంది అన్న దానిపై ఇంకా స్పష్టతలేదని పేర్కొన్న ఆయన.. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అభిప్రాయపడ్డారు. కాల్పులు జరుగుతుండగా ప్రాణ రక్షణ కోసం నైట్ క్లబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత ఏడాది అమెరికాలోని ఓర్లాండోలో ఇదే తరహాలో ఓ నైట్‌క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిగిన ఘటనలో దాదాపు 50 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.