డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్ చెప్పారు. ఈ వివాదంలో అమెరికా ఎవరికి మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు నేరుగా సమస్య పరిష్కరించుకోవాలనే కోరుతున్నామని, ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని రాస్ పేర్కొన్నారు.
కాగా గత కొన్ని రోజులుగా అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం ప్రాంతంలో భారత, చైనాలు సైన్యాన్ని మోహరించడంతో గత నెలరోజుల నుంచి ఉద్రిక్తత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ట్రై జంక్షన్ ప్రాంతంలో భూటాన్ సరిహద్దులో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్ తన సైన్యాన్ని మోహరించింది. మరోవైపు జులై 27–28 తేదీల్లో చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల ఎన్‌ఎస్‌ఏ అధినేతల భేటీ కోసం భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ బీజింగ్ వెళ్లనున్నారు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ఈ పర్యటనలో ఆయన చర్చించే అవకాశముంది. దోవల్ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకుడు మా జిలాయ్ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్జియామెన్‌లో నగరంలో జరిగే బ్రిక్స్ అధినేతలు సదస్సుకు సన్నాహకంగా ఎన్‌ఎస్‌ఏ అధినేతల భేటీ నిర్వహిస్తున్నారు.