'దిల్ సే' విత్ భూమిక
కమర్షియల్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకున్న భామ భూమిక చావ్లా. తెలుగులో దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ, ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. దక్షిణాది భాషలన్నింటితో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమిక, చాలా కాలం తరువాత ఓ తెలుగు సినిమాలో నటించేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన కెరీర్ లోని ఎత్తుపల్లాలతో పాటు తన అభిరుచులు, ఆశలు, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
2000 సంవత్సరంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన యువకుడు సినిమాతో భూమిక సినీ ప్రయాణం మొదలైంది. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా తెరకెక్కిన ఖుషీ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేసింది. తరువాత ఒక్కడులో మహేష్ బాబుతో, సింహాద్రి, సాంబ సినిమాల్లో ఎన్టీఆర్ తో జోడి కట్టిన భూమిక, తేరే నామ్ సినిమాతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సరసన నటించి మెప్పించారు.
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక, పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగిస్తునే ఉన్నారు. అయితే గ్లామర్ క్యారెక్టర్స్ ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చివరగా క్రికెటర్ ఎమ్ ఎస్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎమ్ ఎస్ ధోని : ద అన్ టోల్డ్ స్టోరి సినిమాలో కనిపించిన భూమిక, ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు.