కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌ | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌

Published Mon, Apr 2 2018 3:34 AM

13 militants, three soldiers among 20 killed in Kashmir - Sakshi

శ్రీనగర్‌: ఉగ్రవాదులు లక్ష్యంగా భద్రతా బలగాలు ఆదివారం కశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్‌ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రత బలగాలు 13 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లతో పాటు నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

షోపియాన్‌ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా వద్ద ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతం కాగా.. ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్‌ జిల్లా దియాల్గాం ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. కశ్మీర్‌ లోయలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు.  

హిజ్బుల్, లష్కరేలకు భారీ ఎదురుదెబ్బ
భద్రతా బలగాల ఆపరేషన్‌తో హిజ్బుల్‌ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ ఎస్‌పీ వైద్‌ చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఎన్‌కౌంటర్‌ వివరాల్ని వెల్లడిస్తూ.. ‘మొత్తం ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు, అలాగే పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఈ ఎన్‌కౌంటర్లలో గాయపడ్డారు.

25 మంది పౌరులకు పెల్లెట్‌ గాయాలయ్యాయి’ అని చెప్పారు. అయితే సాయంత్రానికి మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 13కి చేరింది. షోపియాన్‌ జిల్లా కచుదూరాలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకోగా.. సాయంత్రానికి మరో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేçహాలు లభించాయి. కాగా కచుదూరా ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.  

ఎస్‌ఎస్‌పీ అభినందనీయం: కశ్మీర్‌ డీజీపీ
అనంత్‌నాగ్‌ జిల్లా దియాల్గాం ఎన్‌కౌంటర్‌ సందర్భంగా ఉగ్రవాది లొంగిపోయేందుకు ఎస్‌ఎస్‌పీ(సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు) చేసిన ప్రయత్నాన్ని డీజీపీ అభినందించారు. ‘ ఒక ఉగ్రవాదికి చెందిన కుటుంబ సభ్యుల్ని సంఘటనా స్థలానికి రప్పించి అతను లొంగిపోయేలా ఎస్‌ఎస్‌పీ ప్రయత్నించారు. కుటుంబసభ్యులు ఉగ్రవాదితో 30 నిమిషాలు మాట్లాడారు. అయితే వారి మాటల్ని వినేందుకు ఆ ఉగ్రవాది ఒప్పుకోలేదు.

అతను కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్‌కౌంటర్‌లో ఆ ఉగ్రవాది మరణించాడు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు’ అని డీజీపీ తెలిపారు. ద్రాగద్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు ఉగ్రవాదులు స్థానికులేనని, మృతదేహాల్ని బంధువులకు అప్పగించామని ఆయన తెలిపారు. ద్రాగద్‌లో ఉగ్రవాదులు నక్కిన ఇంటి యజమాని కాల్పుల్లో మరణించాడు.

కశ్మీర్‌లో అప్రమత్తం
ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. హురియత్‌ నేతలు సయద్‌ అలీ షా గిలానీ, మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్, యాసిన్‌ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు.   

ప్రతీకారం తీర్చుకున్నాం
షోపియాన్, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో శనివారం రాత్రే జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సీఆర్‌పీఎఫ్, ఆర్మీతో కలిపి ఈ ఆపరేషన్‌కు ప్రణాళిక రూపొందించారు.  ఎన్‌కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల్లో ఏడుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్, ఒకరు లష్కరే తొయిబాకు చెందినవారని, మరో ఐదుగురు వివరాల్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. కచుదూరా ఎన్‌కౌంటర్‌ సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో పలువురు గాయపడ్డారని సీఆర్‌పీఎఫ్‌ ఐజీ జుల్ఫీకర్‌ హసన్‌ తెలిపారు.

కచుదూరా, ద్రాగద్‌లో ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని, గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారని ఆయన చెప్పారు. గతేడాది షోపియాన్‌లో లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ హత్యకు ఈ ఎన్‌కౌంటర్లతో ప్రతీకారం తీర్చుకున్నామని 15వ కోర్‌ కమాండర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ ఏకే భట్‌ తెలిపారు. ఫయాజ్‌ హత్యలో కీలక సూత్రధారులైన ఇష్ఫక్‌ మాలిక్, రయీస్‌ తోకర్‌లు ఈ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని ఆయన తెలిపారు. 

Advertisement
 
Advertisement