కబలిం‘చైనా’ | china over action on doklam | Sakshi
Sakshi News home page

కబలిం‘చైనా’

Published Sat, Aug 5 2017 8:36 PM | Last Updated on Mon, Sep 11 2017 11:21 PM

china over action on doklam



డోక్లామ్‌ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులైంది. నిజానికది భూటాన్‌ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్‌ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో విజయవంతమైంది. చైనా తమ భూభాగాన్ని విస్తరించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమణ చేయడం, తర్వాత అది తమ అంతర్భాగమని అన్ని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం.  సాధ్యమైనంత ఎక్కువగా అంతర్జాతీయ వేదికలపై దీని ప్రస్తావన తెస్తుంది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా... వివాదాస్పద భూభాగంగా మారిపోతుంది. మరో విధానాన్ని కూడా డ్రాగన్‌ అనుసరిస్తోంది. చిలకొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పారాసెల్స్, స్ప్రాట్లీ దీవుల సముదాయాలు పూర్తిగా తమవేనని చెప్పడం, కృతిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్‌ కింద మార్చేందుకు మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం... ఇలాంటిదే. డోక్లామ్‌ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నపటి నుంచీ చైనా దురాక్రమణల ద్వారా తమ భూభాగాన్ని విస్తరిస్తూనే ఉంది.

టిబెట్‌తో మొదలు...
మావో జెడాంగ్‌ నేతృత్వంలో కౌమితాంగ్‌ రాజవంశ పాలనను కూలదోసి సీపీసీ అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే చైనా విస్తరణపై దృష్టి పెట్టింది. బౌద్ధమతగురువుల పాలనలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్‌ను బలవంతంగా ఆక్రమించి... 12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమలో కలిపేసుకుంది. 1959లో తప్పించుకున్న దలైలామా భారత్‌లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. టిబెట్‌ పీఠభూమికి పశ్చిమాన ఉన్న షిన్జియాంగ్‌ ప్రాంతాన్ని కూడా కలిపేసుకుంది. 12 లక్షల చదరపు కిలోమీటర్ల టిబెట్, 16.64 లక్షల చదరపు కిలోమీటర్ల షిన్జియాంగ్‌ కలవడంతో చైనా భూభాగం ఏడాదిలోపే రెట్టింపైంది.

అక్సాయ్‌ చిన్‌... హాంఫట్‌
1962లో అక్సాయ్‌చిన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు తమవేనంటూ చైనా– భారత్‌తో యుద్ధానికి దిగింది. అరుణాచల్‌లో తవాంగ్‌ను ఆధీనంలోకి తీసుకున్నా... యుద్ధం ముగిశాక తిరిగి ఇచ్చేసింది. తమ ప్రాంతాలుగా పేర్కొంటున్నవి తమ ఆధీనంలోకి వచ్చినందున... ఇక ముందుకు చొచ్చుకెళ్లే ఉద్దేశం లేదని, కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు చైనా అక్టోబరు 19, 1962న ప్రకటించింది. కాల్పుల విరమణ 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. తవాంగ్‌ నుంచి వెనక్కితగ్గి... మెక్‌మెహన్‌ లైన్‌ను గౌరవిస్తున్నట్లు ప్రకటించిన చైనా... మరోవైపు 37,224 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అక్సాయ్‌చిన్‌ను ఆక్రమించి కలిపేసుకుంది. అక్సాయ్‌చిన్‌ సముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఎడారి ప్రాంతం. ఆవాసయోగ్యమైనది కాదు. షిన్జియాంగ్‌– టిబెట్‌లను కలిపే రహదారి నిర్మాణాన్ని చైనా 1952లో ప్రారంభించి... 1957లో పూర్తిచేసింది. ఇది అక్సాయ్‌చిన్‌ మీదుగా వెళుతుంది. భారత భూభాగంలో చైనా నిర్మాణం చేపట్టినా... మన నిఘావర్గాలు ఆలస్యంగా మేలుకొన్నాయి. అయితే నెహ్రూ ప్రభుత్వం దీన్ని అనధికారికంగా చైనా వద్ద లేవనెత్తింది తప్పితే... బహిరంగపర్చలేదు. చివరికి 1959లో పార్లమెంటులో చైనా దురాక్రమణతో రోడ్డు నిర్మాణం చేపట్టిందని నెహ్రూ అంగీకరించారు. 1993లో కుదిరిన ఒప్పందం ద్వారా అక్సాయ్‌చిన్‌పై చైనా నియంత్రణను పరోక్షంగా అంగీకరిస్తూ వాస్తవధీన రేఖను భారత్‌ గుర్తించింది.



దీవులపై డ్రాగన్‌ కన్ను....
తర్వాత చైనా వ్యూహాత్మకంగా కీలకమైన దీవులపై దృష్టి పెట్టింది. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో దీవులను వేర్వేరు దేశాల నుంచి లాగేసుకుంది. 1974లో వియత్నాం ఆధీనంలోని పారాసెల్‌ దీవులను చేజిక్కించుకుంది. 130 చిన్నాచితక దీవులున్నా... వీటి మొత్తం వైశాల్యం 7.7 చదరపు కిలోమీటర్లే. అయితే సముద్రరవాణా మార్గంలో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఇవి ఉన్నాయి. 1988లో వియత్నాం నుంచి జాన్సన్‌ రీఫ్‌ను, 1995లో మిస్చీఫ్‌ రీఫ్‌ను స్వాధీనం చేసుకుంది. 2012లో ఫిలిప్పీన్స్‌ నుంచి స్కార్‌బొరో షోల్‌ను స్వాధీనం చేసుకుంది. వీటి సమీపంలోకి ఇతర దేశాల నౌకల రాకపోకలను నియంత్రించింది. అయితే 2016లో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టే అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకొని చైనా పంచన చేరడంతో ఇప్పుడు ఫిలిప్సీన్స్‌ మత్యకారులను అక్కడికి అనుమతిస్తున్నారు.

జపాన్‌తో జగడం...
తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకూ దీవుల తమవేనంటూ వివాదం చేస్తోంది చైనా. సెంకాకూ దీవులు 1895 నుంచి జపాన్‌ ఆధీనంలోనే ఉన్నాయి. 1945 నుంచి 1972 వరకు రుక్యూ దీవులతో పాటు సెంకాకూ కూడా అమెరికాకు లీజుకు ఇచ్చింది జపాన్‌. 1972లో అమెరికా వీటిని ఖాళీచేసే సమయానికి చైనా ఇవి తమవేననే వాదనను తెరపైకి తెచ్చింది. సెంకాకూ దీవులు ఆవాసయోగ్యం కావు. అయితే వీటి పరిసరాల్లో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. దానితో పాటు చమురు నిక్షేపాలున్నట్లు 1970లో కనుగొన్నారు. దాంతో చైనా కన్ను సెంకాకూ దీవులపై పడింది. అప్పటినుంచి ఏదో ఒక మిషతో సెంకాకూ దీవులను చైనా వివాదాస్పదమైనవిగా చూపే ప్రయత్నం చేస్తోంది.

దక్షిణ చైనా సముద్రంపై పేచీ...
సహజ వనరులు, అసార సహజవాయువు నిలువలున్న దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 80 శాతం తమ ప్రాదేశిక జలాలేనని చైనా వాదిస్తోంది. ఇతర దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన... తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం... చైనా వాదనతో విభేదిస్తున్నాయి. చైనా ఇక్కడ కృత్రిమ దీవులను నిర్మించి ఆర్మీబేస్‌గా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని అమెరికా, జపాన్‌ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ నౌకా రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్‌. విటన్నింటిలోనూ చైనా విస్తరణ కాంక్ష ప్రస్పుటమవుతోంది కాబట్టి... డోక్లామ్‌లో చైనాను అడ్డుకోవడం పొరుగునున్న భారత్‌కు ముఖ్యం.

-సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement