'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను' | ‘I Have Seen Tribal Girls Stripped Naked in a Police Station and Tortured’ | Sakshi
Sakshi News home page

'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను'

Published Sat, May 6 2017 8:12 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను' - Sakshi

'దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను'

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులతో ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఆ రాష్ట్రానికే చెందిన ఓ ప్రభుత్వాధికారిణి ఎండగట్టింది. నక్సల్‌ సమస్యను చూపుతూ రాష్ట్రంలో ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ రాయ్‌పూర్‌ జైలు అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వర్షా డొంగ్రే చేసిన ఫేస్‌బుక్‌ పోస్టు సంచలనం సృష్టించింది. ఛత్తీస్‌ఘడ్‌లోని ఆదివాసీలపై సాయుధబలగాల ప్రయోగానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వ అధికారి గళం విప్పడం ఇదే తొలిసారి.



ఏప్రిల్‌ 24వ తేదీన సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై నక్సల్‌ దాడి తర్వాత ఆమె ఈ పోస్టు చేశారు. హిందీలో సాగిన ఆమె పోస్టులో ఏముందంటే.. ‘అందరూ ఒకసారి ఆత్మపరిశోధన చేసుకుంటే నిజం నిగ్గు తేలుతుందని నమ్ముతాను. నక్సల్‌ పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నక్సల్స్‌, జవాన్లు ఇద్దరూ.. భారతీయులే. వీరిలో ఎవరూ ప్రాణాలు కోల్పోయినా దేశం మొత్తం బాధపడుతుంది. ఆదివాసి ప్రాంతాల్లో పెట్టుబడిదారీ వ్యవస్ధను అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని భూమిని సొంతం చేసుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి బిడ్డలను వెళ్లగొట్టేందుకు వారికి ప్రత్యక్ష నరకం చూపుతున్నారు.

గ్రామాలను తగలబెడుతున్నారు. ఆదివాసి మహిళలను మానభంగం చేస్తున్నారు. పులుల ప్రాజెక్టుల పేరుతో రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు ఆదివాసీలను తమ భూముల నుంచి పంపించడాన్ని నిరోధిస్తున్నా.. దాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారు. నక్సలిజాన్ని రూపుమాపుతున్నామనే పేరుతో అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఖనిజసంపద కోసం.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ, తమ సొంతగూటిని వదులుకునేందుకు ఇష్టపడని అడవిబిడ్డలు ఆ ప్రాంతాన్ని వదిలేందుకు ఒప్పుకోకుండా ప్రభుత్వ బలగాల దాష్టీకానికి బలవుతున్నారు. నక్సలిజం అంతరించిపో్వాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. కానీ, పోలీసు బలగాల చేతుల్లో నలిగిపోతున్న తమ కూతుళ్లను, కాలిపోతున్న తమ గుడిసెలను కాపాడుకోలేకపోతున్నారు. నిరక్షరాస్యత వల్ల తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్లకు ఎవరు న్యాయం చేస్తారు?.

సీబీఐ, సుప్రీం కోర్టులు ఆదివాసీలపై జరగుతున్న అఘాయిత్యాల గురించి వ్యాఖ్యానిస్తాయంతే. ఇంకా ఎవరైనా మానవహక్కుల కార్యకర్తో లేక ఓ విలేకరో సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తే వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. ఆదివాసీ ప్రాంతాల్లో అంతా బావుంటే.. ఎందుకు ప్రభుత్వం భయపడుతోంది?. నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్లేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదు. 14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్‌లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్‌ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్‌ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను.

ఒకరిని హింసించేందుకు మన రాజ్యాంగం ఒప్పుకోదు. రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు (రాజ్యాంగంలోని ఐదు షెడ్యూలు పంచాయితీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టూ షెడ్యూల్డ్‌ ఏరియా-1996ను తెలుపుతుంది. దీన్ని రాష్ట్రపతి సూచించిన ప్రాంతాల్లో అమలు చేస్తారు) ను వెంటనే అమలు చేయాలి. ఆదివాసీలు ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతిని సంరక్షించాలే తప్ప నాశనం చేయకూడదు. పెట్టుబడిదారీ వ్యవస్ధ రెండు పార్శ్వాలను అర్ధం చేసుకోవాలి. రైతులు, జవానులు సోదరులు లాంటి వారు. వీరు ఇరువురు ఒకరినొకరు చంపుకోవడం అభివృద్ధికి, శాంతికి ఆటకం కలుగజేయడమే.

రాజ్యాంగం అందరికీ కోసం. అందరికీ న్యాయం జరగాలి. నేను కూడా వ్యవస్ధ బాధితురాలినే. కానీ, అన్యాయాన్ని ఎదిరించి నిలిచాను. కుట్రలతో నన్ను బలిపశువును చేయాలని చూశారు. నాకు లంచాలు ఇవ్వజూపారు. కానీ, నిజమే గెలిచింది. మనకు ఇంకా సమయం ఉంది. సత్యం వైపు మనం నిలబడకపోతే.. పెట్టుబడీదారులు మన దేశం నుంచి మానవత్వాన్ని నశింపజేస్తారు. అన్యాయం ఎక్కడ జరిగినా సహించనని మనకు మనమే మాట ఇచ్చుకుందాం. రాజ్యాంగం వర్ధిల్లాలి. భారత్‌ వర్ధిల్లాలి.’

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియమకాల్లో అవినీతి జరిగిందని 2006లో వర్షా ఛత్తీస్‌గఢ్‌ కోర్టులో కేసు వేశారు. కేసులో నెగ్గిన తర్వాత ఆమె డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కొద్దిరోజుల తర్వాత ఆమె దాన్ని తొలగించారు. కాగా, వర్షా పోస్టుపై స్పందించిన రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ కేకే గుప్తా.. వర్షాను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె పోస్టుపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. వర్షా ఆ పోస్టును రాశారా? లేదా? అనే విషయంపై విచారణ జరుగుతుందని తెలిపారు. దీనిపై వర్షా వాయిస్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement