సబీర్ చేరికపై నక్వీ ఫైర్
బీజేపీ దావూద్‌నూ చేర్చుకుంటుందని ఎద్దేవా
న్యూఢిల్లీ: శ్రీరామ్‌సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్‌ను చేర్చుకుని గంటల్లోనే బయటకు పంపిన ఉదంతాన్ని మరవకముందే బీజేపీలో అలాంటి మరో వివాదం రాజుకుంది. జేడీయూ బహిష్కృత నేత సబీర్ అలీని కమలదళంలో చేర్చుకోవడంపై పార్టీ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆగ్రహోదగ్రులయ్యారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు అలీ స్నేహితుడని, ఇక పార్టీలో చేరబోయే తదుపరి వ్యక్తి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ కావొచ్చని స్వపక్షాన్ని ఎగతాళి చేశారు.
అలీని చేర్చుకోవడం తప్పని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తప్పు దిద్దుకోవాలని డిమాండ్ చేశారు. అలీ శుక్రవారం అట్టహాసంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న గంటల్లోనే నక్వీ పార్టీపై నిప్పులు చెరిగారు. ‘ఉగ్రవాది భత్కల్ మిత్రుడు బీజేపీలో చేరారు. త్వరలో దావూద్‌నూ చేర్చుకుంటారు’ అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అలీ చేరిక తనకు బాధ కలిగించిందని, ఈ విషయాన్ని పార్టీకి చెప్పానని తర్వాత విలేకర్లతో అన్నారు.
ఉగ్రవాదంపై పోరాడుతున్న బీజేపీ, ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని చేర్చుకోవడాన్ని ఎలా సమర్థిస్తుందని నిలదీశారు. ముంబైలోని అలీ ఇంట్లోనే భత్కల్ అరెస్టయ్యాడని, సంగీత వ్యాపారదిగ్గజం గుల్షన్ కుమార్ హత్య కేసులో అలీ పేరు ఉందని చెప్పారు. ‘పార్టీ ఒక హిందుత్వ నేతను (ముతాలిక్) గంటల్లోనే బయటకు పంపినప్పుడు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తిని ఎలా సహించగలం?’ అని అన్నారు. అలీ చేరిక గురించి పార్టీ చీఫ్ రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలియదని చెప్పారు.
కాగా, పార్టీ బీహార్ కమిటీ సిఫార్సుపైనే అలీని చేర్చుకున్నామని, అతని పూర్వాపరాలు విచారించి తదుపరి చర్య తీసుకుంటామని బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేదీ తెలిపారు. విమర్శల నేపథ్యంలో అలీని చేర్చుకోవాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అలీ చేరికను ఆరెస్సెస్ కూడా వ్యతిరేకించింది. రాజ్‌నాథ్‌కు నిరసన తెలిపింది. బీజేపీ కొత్తవారిని చేర్చుకోవడంపై పార్టీ సీనియర్ నేత బహిరంగంగా విమర్శకు దిగడం గత కొన్ని రోజుల్లో ఇది రెండోసారి. బీఎస్సార్ కాంగ్రెస్ నేత బి.శ్రీరాములును చేర్చుకోవడాన్ని సుష్మా స్వరాజ్ వ్యతిరేకించడం తెలిసిందే.