‘ఉమెన్స్ డే’ జంటలను పరుగెత్తించి కొట్టారు
కొచ్చి: ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మునిగిపోగా శివసేన మాత్రం తన ఆగడాలను చూపించింది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కొన్ని జంటలను వెంబడించారు. బీచ్ వద్ద కూర్చుని సరదాగా సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటున్నవారిని దాదాపు కొట్టేంతపని చేశారు. పరుగెత్తించి పరుగెత్తించి తరిమికొట్టారు. చేతుల్లో లాఠీలు, కర్రలు, పార్టీ జెండాలు పట్టుకొని దాదాపు రౌడీలు చేసినంత దారుణంగా ప్రవర్తించారట.
పాశ్చాత్య సంస్కృతి తీసుకొచ్చి భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. దాదాపు 20మంది శివసేనకు చెందిన కార్యకర్తలు కలిసున్న పలువురు యువతీయువకుల జంటలపై దాడికి దిగారు. మహిళల సంరక్షణ పేరిట వారితో ఉన్న యువకులపై తమ కర్రలతో వాయించడం మొదలుపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుబడుతూ ఈ ఘటనకు కారణమైన వారందరిని అరెస్టు చేస్తామని తెలిపారు.