వీడియో షాపు నుంచి సీఎం దాకా
శశికళ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్నదానికి ‘చిన్నమ్మ’ శశికళ చక్కని ఉదాహరణ. వీడియో షాపు నడిపిన స్థాయి నుంచి సీఎం పీఠం దాకా సాగిన ఆమె ప్రస్థానం ఆసక్తికరమే కాదు వివాదాస్పదం కూడా. జయలలితకు నెచ్చెలిగానే మొన్నటి వరకు తెలిసిన ఆమె.. ‘పురుచ్చితలైవి’ మరణానంతరం అన్నాడీంకేపై, ప్రభుత్వంపై పట్టుసాధించి రాజకీయాల్లోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. పార్టీలో జయ తర్వాత మరో శక్తిమంతమైన నేత లేకపోవడం శశికళకు కలసొచ్చిన అంశం. పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు ఒకరి చేతిలోనే ఉండే సంప్రదాయాన్ని ఎంజీఆర్, జయల తర్వాత చిన్నమ్మ కొనసాగించనున్నారు.
శశికళ 1957లో తిరుతిరైపూండిలో బలమైన దేవర్ సామాజికవర్గానికి చెందిన వివేకానందన్ , కృష్ణవేణి దంపతులకు జన్మించారు. ఆమెకు నలుగురు సోదరులు, ఒక సోదరి. తర్వాత వారి కుటుంబం మన్నార్‌గుడికి మారింది. 10వ తరగతి వరకు చదువుకున్న శశికళ 1973లో పౌరసంబంధాల అధికారి నటరాజన్ ను డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో పెళ్లాడారు. శశికళ వీడియో షాపు నడిపేవారు. 1982లో అప్పటి సీఎం ఎంజీఆర్‌కు సన్నిహితుడైన నటరాజన్ .. చంద్రలేఖ అనే కలెక్టర్ సాయంతో భార్యకు జయను పరిచయం చేశారు. జయ హాజరయ్యే పెళ్లిళ్ల వీడియోలు శశికళ తీయించేవారు. అలా మొదలైన స్నేహం.. మధ్యలో కొన్ని పొరపొచ్చాలు మినహా జయ మరణం వరకూ దాదాపు 3 దశాబ్దాలు కొనసాగింది.
పోయెస్ గార్డెన్ లో ఇద్దరూ కలసి ఉండేవారు. ఒకే రకం చీరలు, చెప్పులు, నగలు ధరించేవారు. శశి తనకు సోదరిలాంటిదని, అమ్మలేని లోటును తీరుస్తోందని జయ చెప్పేవారు. 1991లో జయ తొలిసారి సీఎం కావడంతో శశికళ వెలుగులోకి వచ్చారు. ఆమె సోదరి కుమారుడైన సుధాకరన్ ను జయ దత్తత తీసుకుని కోట్ల డబ్బుతో అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. కలర్ టీవీల స్కాంలో 1996లో ‘అమ్మ’లిద్దరూ అరెస్టయి జైలుకెళ్లారు. తర్వాతి కాలంలో ఇద్దరి స్నేహం చెడిపోయింది. 1996 ఎన్నికల్లో జయ ఓటమికి శశికళే కారణమని విమర్శలొచ్చాయి. ఆమెతో సంబంధాలు చెడిపోయాయని జయ కూడా చెప్పారు.
తర్వాత తనపై కుట్రపన్నుతున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటూ 2011 డిసెంబర్‌లో శశికళ దంపతులతోపాటు వారి బంధుమిత్రులను పార్టీ నుంచి తప్పించారు. ఐదు నెలల తర్వాత చిన్నమ్మ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో తిరిగి ఇద్దరూ దగ్గరయ్యారు. అన్నాడీఎంకేలో, ప్రభుత్వంలో క్రమంగా తన వ్యతిరేకులను తప్పించి, అనుచరులకు చోటుకల్పిస్తూ శశికళ టీమ్ పావులు కదిపిందంటారు. జయ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు శశికళ ఆమె వెంట ఉండడం అనుమానాలకు తావిచ్చింది. జయను ఎవరూ కలవకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. విమర్శలను, పార్టీలో వ్యతిరేకతను అధిగమించి శశికళ ‘పురుచ్చితలైవి’ స్థానాన్ని భర్తీ చేశారు.
మూడో మహిళా సీఎం శశికళ
తమిళనాడు కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న వీకే శశికళ ఆ రాష్ట్రానికి మూడో మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇంతకు ముందు జానకి రామచంద్రన్ , జయలలిత సీఎంలుగా పనిచేశారు. వీరంతా ఏఐఏడీఎంకే పార్టీlవారే కావడం విశేషం.
నాడు నెడుంజెళియన్.. నేడు పన్నీర్ సెల్వం
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఆదివారం రాజీనామా చేసిన తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం రాష్ట్ర చరిత్రలో మూడు సార్లు ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఇటీవలే సీఎం జయలలిత కన్నుమూయటంతో ఆయన ముచ్చటగా మూడోసారి ‘తాత్కాలిక ముఖ్యమంత్రి’గా ప్రమాణం చేశారు. అంతకు ముందు జయ కోర్టు కేసుల కారణంగా ముఖ్యమంత్రి పదవికి తొలిసారి రాజీనామా చేసినప్పుడు 2001 సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి ఒకటి వరకు, జయకు రెండోసారి జైలు శిక్ష పడినప్పుడు 2014 సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకూ పన్నీర్ సెల్వం సీఎం పదవిలో ఉన్నారు.
ఏఐడీఎంకే మాతృక డీఎంకే 1967లో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే పార్టీ నేత సీఎన్ అణ్ణాదురై మరణించాక పన్నీర్‌సెల్వం మాదిరిగానే సీనియర్ మంత్రి వీఆర్ నెడుంజెళియన్ 1969 ఫిబ్రవరి 3 నుంచి పది వరకు, 1987 డిసెంబర్‌లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, ఎంజీ రామచంద్రన్ మరణించాక డిసెంబర్ 24 నుంచి జనవరి 7 వరకు రెండోసారి తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి నెడుంజెళియన్ ను తొలగించి ఎంజీఆర్ భార్య వీఎన్ జానకికి సీఎం పదవి అప్పగించారు. ఇప్పుడు శశికళ కోసం పన్నీర్‌తో రాజీనామా చేయించడం నాటి నెడుంజెళియన్ ఉద్వాసనను గుర్తుచేస్తోంది.