దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి
► పన్నీర్‌సెల్వం వైపు వలసలు
► శశికళ వ్యతిరేకులకు ప్రత్యామ్నాయ పవర్ సెంటర్
► దీప కొత్త పార్టీపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’ అన్నట్లుగా తయారైంది జయ మేనకోడలు దీప పరిస్థితి. పన్నీర్‌సెల్వం పుణ్యమాని పార్టీ పెట్టక ముందే, పర్యటనలతో ప్రజల్లో రాకముందే బలహీనపడుతోంది. అన్నాడీఎంకేలోని అందరికీ జయలలిత ఆరాధ్యదేవత. అడుగులకు మడుగులొత్తడమేకాదు, పాద నమస్కారాలు చేసేవారు. రాష్ట్ర ప్రజల చేత అమ్మగా కూడా జయ కీర్తింపబడ్డారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో తీరని అగాథం ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పార్టీలో అసంతృప్తి రాజేసింది. జయ మరణానికి కారణమైన శశికళ ప్రధాన కార్యదర్శిగా సహించలేమని బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి.
దీప వైపు కార్యకర్తల చూపు: అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులు ప్రత్యామ్నాయంగా జయ మేనకోడలు దీపను ఎంచుకున్నారు. చెన్నైలోని టీనగర్‌లోని ఇంటికి క్యూకట్టడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపను ఊహించుకున్నారు. ఇది కుదరని పక్షంలో దీప చేత కొత్త పార్టీ పెట్టించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన శశికళ వ్యతిరేకీయులు రాష్ట్రవ్యాప్తంగా దీప పేరవైలను ప్రారంభించారు. పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కూడా సాగిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. శశికళపై వ్యతిరేకత, తన పట్ల పెరుగుతున్న అభిమానానికి స్పందించిన దీప తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత నెల 17వ తేదీన అధికారికంగా ప్రకటించారు.
ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున కీలకమైన ప్రకటన చేస్తానని, ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం శశికళకు పోటీగా దీపను రాజకీయాల్లో తేవాలని భావించిన వారిని ఆలోచనలో పడేసింది. జయ మరణించిన మూడునెలల్లోనే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గంగా పార్టీ రెండుగా ముక్కలైంది. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో బలమైన పవర్‌సెంటర్‌గా మారిపోవడం వారిని ఆనందింపజేసింది. శశికళపై తమకున్న వ్యతిరేకత పన్నీర్‌సెల్వం రూపంలో తీరిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇక దీప అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు.
అన్నాడీఎంకేలో రాజకీయపోరు ప్రారంభం కాగానే దీప ఇంటి వద్ద అభిమానులు పలచన కావడం ప్రారంభమైంది. జయ మేనకోడలు హోదాలో దీపను ఆహ్వానిస్తున్నానని, ఎప్పుడు వచ్చినా తగిన మర్యాదనిస్తానని పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం పరోక్షంగా దీప పేరవైని దెబ్బతీసింది. శశికళపై కక్షతో దీపను బలమైన రాజకీయనేతగా తీర్చిదిద్దేకంటే పన్నీర్‌సెల్వం పంచన చేరడం మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే దీప నేతృత్వంలో కొత్త పార్టీ ఉదయించకుండానే అస్తమించినట్లు కాగలదు.