కుటుంబపాలనను నిర్మూలిస్తాం
జయ సమాధి వద్ద పన్నీర్ శపథం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శశికళ కుటుంబపాలనను నిర్మూలించి, అమ్మ ప్రభుత్వ ఏర్పాటుకు పాటుపడతానని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం జయలలిత సమాధి సాక్షిగా శపథం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది శశికళ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు ఓటు వేసేలా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో మెరీనా బీచ్‌లోని జయ సమాధి వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంజీఆర్ స్థాపించిన, జయలలిత కృషితో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం నేడు శశికళ ఆమె కుటుంబ సభ్యుల సొత్తుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏర్పడిన దౌర్భాగ్య పరిస్థితిని అన్ని నియోజకవర్గాల ప్రజలకు వివరించి ఎమ్మెల్యేలను జాగృతం చేస్తామన్నారు. శశికళ శిబిరంపై ధర్మయుద్ధం చేయనున్నామని ప్రకటించారు. 124 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపుంటే ఏడుకోట్ల మంది తమిళనాడు ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.