ప్రసన్న కవి - స్వేచ్ఛా జీవి
- ఆగస్టు 10న శంకరంబాడి సుందరాచారి జయంతి
‘‘పోతన లాంటి భక్తుడూ తపస్వీ కావ్యం రాస్తే దానికొక విలువ ఉంటుంది. నా బోటి అల్పులు పిచ్చికుంకలు రాస్తే ఎవరు చదువుతారయ్యా’’ అంటూ తన 600 పద్యాల కాగితాల్ని చించేశాడు సుందరాచారి.
తిరుపతి. ఆ రోజు శ్రావణ పూర్ణిమ. ఒక శ్రోత్రియ కుటుంబం. ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకును తండ్రి, ‘‘నీకు జందెమెందుకురా? శుద్ధ దండగ’’ అని తిట్టాడు. కొడుక్కి ఒళ్లుమండింది. జందేన్ని పుటుక్కున తెంచి, ఇంటి వసారాలో పడుకొన్న కుక్క మెడలో వేశాడు. ఇక ఈ ఇంటికీ నాకూ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. విసవిసా నడుచుకుంటూ రైల్వేస్టేషన్ చేరాడు. అక్కడ ప్రయాణీకుల పెట్టే బేడా మోసి, వచ్చిన కూలీ డబ్బులతో తిండీ తిప్పలూ చూసుకోనారంభించాడు. ‘‘నేనున్న ఊళ్లో నాకిదేం అప్రతిష్ట?’’ అని తండ్రి మళ్లీ తిట్టాడు. అంతే! అక్కడినుంచీ చోళంగిపురం వెళ్లి హోటలు సప్లయరుగా చేరాడు.
***
కంచి. మధ్యాహ్నపుటెండ. నడకనాపి ఒక శ్రీవైష్ణవుల ఇంటి ముందు ఆగాడొక యువకుడు. లోపలికి వెళ్లి దాహంగా ఉందన్నాడు. ఆ ఇంటివాళ్లు చెంబెడు నీళ్లిచ్చారు. ఎందుకో ఆ ఇంటి స్త్రీలు బాధపడుతున్నారని గమనించి, యజమానిని కారణమడిగాడు. ‘‘మా ఇంట్లో పెళ్లికెదిగిన అమ్మాయుంది. పేదరికం వల్ల పెళ్లి చేయలేకున్నాము’’. ‘‘మీకభ్యంతరం లేకపోతే నేనా అమ్మాయిని చూడవచ్చా?’’... ఇదే సంభాషణ! రెండు మూడు నిమిషాల తర్వాత ఒక అమ్మాయి తల్లి తీసుకురాగా దేవతలాగా ప్రత్యక్షమైంది. ‘‘అయ్యా! నేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఒక వారం రోజుల్లో డబ్బు సర్దుకు వస్తాను’’ అని ఆ యువకుడు కంచి గరుడసేవను దర్శించి తిరుపతి చేరాడు. మేనమామని కలిసి విషయం చెప్పాడు. ఆయనిచ్చిన 500 రూపాయలతో ఏ శుభలేఖలూ ముద్రించకుండానే, ఏ ఆడంబరాలూ లేకుండానే బంధుమిత్రులు ఒక ఐదారుగురి సమక్షంలో పెళ్లి జరిగిపోయింది.
****
ఆ బాలుడు, యువకుడి జీవితంలో ఇలాంటి సంఘటనలెన్నో! ఎవరతడు? బ్రతుకుని తృణప్రాయంగా తోసిరాజని స్వేచ్ఛా జీవిత సంచారం సాగించిన సర్వ స్వతంత్రుడు. తెలుగుతల్లి మోడలో వాడని మల్లెపూల దండ. ప్రసన్న కవి. ‘రాష్ట్ర’ కవి. తెలుగు బంకించంద్రుడు. అతడు శంకరంబాడి సుందరాచారి (10.8.1914 - 8.4.1977).
బడిపిల్లల కోసం, సామాన్యుల కోసం కవిత్వం రాశాడు. వారినే నమ్ముకొని, వారికే అణాకి, రెండణాలకి పుస్తకాలు అమ్ముకొని జీవనం సాగించాడు. పద్నాలుగేళ్లకే ఛందోబద్ధ కవిత్వం. బుద్ధ గీత, ఏకలవ్యుడు, సుందర రామాయణం, సుందర భారతం, పేద కవి, స్వప్న సుందరుడు, అగ్నిపరీక్ష లాంటి కావ్యాలు రాశాడు. చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఆహ్వానించని బడి లేదు. పద్యాలను ఆనంద భైరవి, కేదారం, ముఖారి, కౌదారగౌళ, రీతిగౌళ, శ్రీరాగాలు వేసి పాడేవాడు. త్యాగయ్య కీర్తనలంటే ఇష్టపడేవాడు. గంభీరంగానూ, హాస్యోక్తులతోనూ సాగే ఆయన ఉపన్యాసం వింటే ఎవరైనా ఆయనకి అభిమానులు అయిపోవలసిందే!
అప్పటి లోక్‌సభ స్పీకరు శ్రీమాన్ అనంత శయనం అయ్యంగారికి స్వయానా మేనల్లుడు. తన ‘బుద్ధ గీత’ను నెహ్రూకి ఆంగ్లంలో వినిపించినవాడు. మండలి వెంకట కృష్ణారావు, కార్వేటి రాజా వంటి ప్రముఖులకెందరికో స్నేహితుడు. ఎవ్వరి సాంగత్యాన్ని ఎక్కడా వాడుకోలేదు. పట్టు జుబ్బాలు, ధోవతులతో తిరిగే సుందరాచారి చివరికి కోరాగుడ్డ జుబ్బాలు, చౌకబారు నాలుగు మూరల పంచెతో తన శరీరాన్ని కప్పుకొన్నాడు.
సుందరాచారి ఆజన్మాంత స్నేహితుడు వై.కె.వి.ఎన్.ఆచార్య. శంకరంబాడి ఆశువుగా చెబుతూ ఉంటే అంతే వేగంగా వాటిని లిపిబద్ధం చేసేవాడీయన. ఆచార్య రాసిన ‘ప్రసన్నకవి సుందరాచారి - నేను’ పుస్తకంలో ఈ విశేషాలన్నీ ఉన్నాయి. తన జీవిత చరిత్రను, సాహిత్య కృషినీ గురించి ఒక పుస్తకం రాయమని కవి ఇతడిని కోరాడు. తన జీవితంలోని మంచినీ చెడునీ, దేన్నీ వదిలిపెట్టకుండా రాయమన్నాడు. దాదాపు 30 ఏండ్లు గడిచాయి. ఈ స్నేహితుడికి పక్షవాతం వచ్చింది. 85 ఏండ్లు వచ్చాయి. జీవితం చరమ దశకి చేరిందని తెలుసుకొన్నాడు. పుస్తకం పూర్తిచేయాలి. ఆ తరువాత తనకీ ప్రపంచంలో ఒక్క క్షణం కూడా ఆగాలనిపించటం లేదు. వణుకుతున్న చేతులతోనే రాశాడు వై.కె.వి.ఎన్. మిత్రుడి ప్రేమ అది.
భాగవతం దశమ స్కందం ఆధారంగా సుందరాచారి చెబుతూ ఉంటే వై.కె.వి.ఎన్. ‘సుందర నంద నందనం’ రాస్తున్నాడు. 600 పద్యాలు పూర్తయ్యాయి. పద్యాలు బాగా వచ్చాయనుకొన్నారు. వై.కె.వి.ఎన్. ‘నల్లనివాడు, పద్మనయనంబులవాడు’ అని పోతన పద్యాలను పాడనారంభించాడు. కాసేపయ్యాక ‘‘ఇప్పటికిది నిలుపు. ఒక టీ సేవిద్దాం, తరువాత పోతన పద్యాల్ని చదువుదాం’’ అని సుందరాచారి అన్నాక, ఇద్దరూ లేచి వెళ్లి టీ తాగి వచ్చారు. ‘‘ఆ మహానుభావుడు గొప్ప భక్తుడురా. అతని జీవితం స్పటిక స్వచ్ఛమైనది. అలాంటి భక్తుడూ తపస్వీ కావ్యం రాస్తే దానికొక విలువ ఉంటుంది. నా బోటి అల్పులు పిచ్చికుంకలు రాస్తే ఎవరు చదువుతారయ్యా!’’ అంటూ తన 600 పద్యాల కాగితాల్ని చించేశాడు సుందరాచారి.
‘దీనబంధు’ చిత్రానికి మాటలూ పాటలూ సుందరాచారే. దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి తేటతెలుగులో ఒక పడవ పాట రాయమన్నాడు. అప్పుడు రాసిందే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. రెడ్డి మెచ్చుకొని యావత్కాలికమైన సాహిత్య విలువలున్న ఈ పాటను సినిమా పాటగా ఉపయోగించనన్నాడు. హెచ్.ఎం.వి. కంపెనీవారు ఒప్పుకొంటే తాను విడిగా పాడతానని టంగుటూరి సూర్యకుమారి అన్నది. సుందరాచారికి నూట పదహార్లు ఇచ్చి పాటను కొని సూర్యకుమారి చేత రికార్డు చేయించి ప్లేట్లు అమ్మితే యావదాంధ్రలో మారుమోగిపోయింది.
కానీ పాట రాసింది సుందరాచారని ఎవరికీ తెలియదు. కొన్ని పాటల పుస్తకాల్లో ‘దేవులపల్లి’ అని రాశారు. సుందరాచారి అభ్యంతరం తెలిపితే కొంత నష్టపరిహారం ఇచ్చారు. ‘‘ఇప్పటికీ ఈ పాట జనాల్లోకి వెళ్లినంతగా నా పేరు వెళ్లలేదు. నేనే కర్తనని ఆంధ్రదేశంలో చాలామందికి తెలియదు. ఇదే నా దురదృష్టం’’ అని కవి బాధపడ్డాడు. ఈ పాటను ఏప్రిల్ 1975, హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో సూర్యకుమారి పాడినప్పుడు రచయిత అక్కడ లేడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఏమిటో? ఎందరో రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు, లబ్ధ ప్రతిష్టులైన కవులు పాల్గొన్న ఆ సభలకి శంకరంబాడికి ఆహ్వానం ఉందో? లేదో? ఎవరికీ తెలియదు.
జీవితం పొడవునా దురదృష్టం వెంటాడిన ప్రజాకవి శంకరంబాడి. సినిమాల్లో ఉన్నప్పుడు మద్యం అలవాటయ్యింది. అంతకుముందు నుంచే గఫర్ జూనియర్ బీడీలను ఇష్టంగా కాల్చేవాడు. తెలుగుతల్లి పాటను విని మండలి వెంకట కృష్ణారావు తన ఖరీదైన చేతి గడియారాన్ని బహుమతిగా ఇవ్వగా, దాన్ని అమ్ముకొని మరీ తాగాడు. అప్పటి జిల్లా కలెక్టర్ రాజాజీ సుందరాచారి పుస్తకాలనమ్మగా వచ్చిన వేయి రూపాయలనిస్తే, తెగ తాగి చిత్తూరులో గాంధీ విగ్రహం కింద పండుకొని ఉండగా, మొత్తం డబ్బు రౌడీలు లాక్కోగా చూస్తూ ఊరుకున్నాడు. దీపావళికో, సంక్రాంతికో సముద్రాల నాగయ్య ‘‘ఆచార్లూ! ఈ చీరెను నీ భార్యకిచ్చి కట్టుకోమను పండక్కు.
ఆ పాకెట్టులో నీకు పంచె, ఉత్తరీయం కూడా ఉంది. నీవూ ధరించు’’ అని బస్టాండు వరకూ తన బంట్రోతును పంపితే, బంట్రోతు కొని యిచ్చిన టికెట్టును ఎవరికో అమ్మి, చీరెనూ పంచె, ఉత్తరీయాన్నీ అక్కడే విక్రయించి ఆ డబ్బుతో తాగుతూ తిరుపతిలోనే తిరుగుతూ ఉండిపోయాడు. శంకరంబాడి తనకు తాను ఇచ్చుకొన్న బిరుదు ‘మధుపాన మత్త మహాకవి’. ఆయన తన కవితలో భగవంతుణ్ని అడిగిన ప్రశ్న అప్పటి, ఇప్పటి చాలామంది కవులదీ, రచయితలదీ కూడా! ‘‘ఈ లోకమున నను ఏల సృష్టించితివి! సృష్టించి ఏ పనిని చేయ నియమించితివి?/ చిన్న బుచ్చక నాకు చెప్పరావా దొరా!/ ఈ చిన్న గుండెలో ఎన్ని గుండ్రాలురా/ ఈ లేత బుర్రలో ఎన్ని కంపాలురా/ వద్దురా ఈ బ్రతుకు వద్దురా దేవుడా!’’
- డా॥కాకుమాని శ్రీనివాసరావు
ఫోన్: 8008070775