చెన్నై: తమిళనాడు రాజకీయాలు రాజ్‌భవన్కు చేరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు అవకాశం ఇస్తారా లేక ప్రభుత్వం ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావు.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళకు ఆహ్వానం పంపనున్నారు. అయితే కొంత సమయం కావాలని శశికళకు గవర్నర్ చెప్పినట్టు సమాచారం. పన్నీరు సెల్వం అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని గవర్నర్ చెప్పినట్టు తెలుస్తోంది.
తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రజలు కోరితే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని పన్నీరు సెల్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గురువారం గవర్నర్ను కలిసినపుడు కూడా బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని పన్నీరు సెల్వం కోరారు. నిన్న రాత్రి శశికళ కూడా గవర్నర్ను కలిశారు. ఆమెతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శశికళ కోర్టు కేసుల గురించి గవర్నర్ ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జయలలిత, శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసులో త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో పాటు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడం, అన్నా డీఎంకేలో చీలిక రావడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలన్న శశికళపై కోర్టు కేసులు ఉండటంతో తమిళనాడులో అనిశ్చితి ఏర్పడింది.