నేటితో తెర | Sakshi
Sakshi News home page

నేటితో తెర

Published Fri, Mar 4 2016 1:09 AM

నేటితో తెర - Sakshi

ఈ సాయంత్రం ముగియనున్న ‘గ్రేటర్’ ప్రచారం
టీఆర్‌ఎస్ కీలక శక్తిగా హరీశ్ రావు
చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్
బీజేపీ తరఫున దత్తాత్రేయ, హన్స్‌రాజ్
కాంగ్రెస్ నుంచి వీహెచ్ రాక

 
హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం తెరపడనుంది. వారం రోజులుగా హోరుగా సాగుతున్న ఓట్ల అభ్యర్థనకు నేటి సాయంత్రం ఐదు గంటలకు చివరి గడువు కానుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు నగరంలో ప్రచారంతో సందడి చేస్తున్నారు. టికెట్ల పంపిణీ నుంచి టీఆర్‌ఎస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్న హరీశ్‌రావు ఇప్పటికే దాదాపు నగరం మొత్తం ప్రచారం చేశారు. చివరి రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికార పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ ప్రచారానికి వస్తున్నారు.  ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీలు మొదట్లో నెమ్మదించినా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా వేగం పెంచాయి. ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో  నిలిచిన అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంది.

టీఆర్‌ఎస్ కీలక నేత హరీశ్‌రావు గ్రేటర్ వరంగల్ ప్రచారంలో కేంద్ర బిందువుగా మారారు. వారం రోజుల పాటు ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార వ్యూహంలో హరీశ్‌రావు ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రేటర్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు ప్రచారంలో పదును తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీర సీతారాంనాయక్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నగరంలో ప్రచారం చేస్తున్నారు. కాగా, చివరి రోజున టీఆర్‌ఎస్ మరో కీలక నేత కె.తారకరామారావు నగరంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన రోడ్‌షో నిర్వహించనున్నారు.

అధికార పార్టీని ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహం రచించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ గురువారం ప్రచారం నిర్వహించారు. చివరిరోజు ప్రచారానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ రానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రెండు రోజులుగా వరంగల్‌లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.{పచారాన్ని నెమ్మదిగా ప్రారంభించిన కాంగ్రె స్ చివరి దశలో వేగం పెంచింది. ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. చివరిరోజున పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రానున్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రచారం చేశారు. మొదటి నుంచి చివరి వరకు వీరిద్దరే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు.  

బడా నేతలతో సంబంధం లేకుండా రెబల్ అ భ్యర్థులు, స్వతంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రో జులుగా శ్రమిస్తున్నారు. ఎన్నికల గుర్తుల ను పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిఇంటికి వెళుతూ తమను గెలిపిం చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement
Advertisement