ఖమ్మం కల్చరల్: తీజ్ (గోధుమ మొలకల) వ్రతం. బంజారాల కన్నెల పండుగ..కన్నుల పండువగా చేసుకునే ఈ వ్రతాన్ని తండాల్లో పెళ్లికాని యువతుల ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రావణమాసంలో జరుపుకునే ఈ పండగన్ని రోజులూ లంబాడ తండాల్లో సందడి నెలకొంటుంది. తండా పెద్ద అనుమతి లభించిన వెంటనే వేడుక ప్రారంభమవుతుంది. మేర వసూలతో ఉత్సవానికి శ్రీకారం చుడతారు.
మేర వసూలు
తీజ్ నిర్ణయం జరిగిన మరుసటిరోజు యువతులు ఇల్లిల్లూ తిరిగి తీజ్ కోసం వసూలు చేసే విరాళాలనే ‘మేర’ అంటారు. దుకాణం నుంచి గోధుమలు, శెనగలు తెప్పిస్తారు. అడవికి వెళ్ళి ‘పిలోణీర్ ఏలే’ (దుసేరు తీగ)ను స్వయంగా తెచ్చి చిన్న బుట్టలను అల్లుతారు. తలారా స్నానం చేసి పుట్టమట్టిని సేకరిస్తారు. వీలుంటే ఈ మట్టికి మేక ఎరువును కలుపుతారు. దుసేరు తీగతో తాము అల్లిన చిన్న బుట్టలకు దండియాడి (మేరా మా భవాని), సేవాభాయా, తోల్జా భవాని, సీత్లా భవాని వంటి దేవతల పేర్లు పెడతారు.
ముందుగా తండా పెద్దను ఆహ్వానించి ఒక బుట్టలో మట్టిని పోయించి గోధుమలు చల్లిస్తారు. అనంతరం ‘శీత్లాయాడి బొరాయీ తీజ్, బాయీ తారో పాలణో...’ అంటూ పాడుతూ మిగతా బుట్టల్లో యువతులు చల్లుతారు. తండా మధ్యలో ఒక చోట కట్టెలతో కాస్త ఎత్తులో డాక్లో(మంచె)ను ఏర్పాటు చేస్తారు. దానిపైన గోధుమలు చల్లిన బుట్టలను ఉంచి నీళ్లు పోస్తుంటారు.
రేగుముళ్లకు గుచ్చటం...
గోధుమలను బుట్టల్లో చల్లిన రోజు సాయంత్రం నానబెట్టిన శెనగలను ‘బోరడి’ (రేగు ముళ్లు)‘ఝష్కేరో’ (గుచ్చటం) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూర్తి వినోద భరితమైన ఈ కార్యక్రమంలో శృంగార, కరుణ,హాస్య రసాలకూ ప్రాధాన్యముంటుంది.
వదినలు రేగుముళ్ళకు శనగలను గుచ్చేటపుడు మరిది వరసవారు ముళ్లను కదిలిస్తూ ఏడిపించటం, అన్నలు సైతం చెల్లెళ్ళలకు శనగలు దొరకకుండా దాచి, ముళ్ళను అడ్డుగాపెట్టి సున్నితంగా ఏడిపించటం చివరకు వారు సోదరులను ప్రార్థించే పాటలు పాడటం, అందరూ సహకరించి శనగలు వారికందేలా చేయటం వినోదభరితంగా నిర్వహిస్తారు. ఈ రేగులను దండియాడి (మేరా మా భవాని), తోల్జా భవాని పండిస్తుందంటూ ‘కాచిగ పాకీయో బోరడియో.....’ అంటూ పాటలు పాడతారు.
బావి నుంచి నీరు తెచ్చి తొమ్మిది రోజులపాటు బుట్టలపై చల్లుతూ తీజ్‌పట్ల తమ భక్తి, విశ్వాసాలను ప్రకటిస్తారు. పెళ్లికాని యువతులు తీజ్ రోజులలో శుచి, శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఉప్పు, కారం లేని శాఖాహారాన్ని స్వల్పంగా తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు. సామూహికంగా భవాని మాతకు పూజలు చేస్తారు. తీజ్ బుట్టలను భవాని దేవత పెట్టించిందని భావిస్తారు.
ఏడో రోజు ‘ఢమోళి’
తీజ్ ఉత్సవంలో భాగంగా ఏడో రోజు చుర్మో ( రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను ‘మేరా మా భవాని’ కి సమర్పించే కార్యక్రమమే ‘ఢమోళి’. ప్రతి ఇంటి నుంచి కొంత బియ్యాన్ని సేకరించి కడావ్ (పాయసం) వండుతారు. అనంతరం తండా వాసులంతా తీజ్ దగ్గర చేరి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.
ఎనిమిదో రోజు సాయంత్రం యువతులు చెరువు నుంచి మట్టి తెస్తారు. ఆ మట్టితో ఇద్దరు వృద్ధస్త్రీలు ఆడ, మగ బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మలకు పెళ్ళి జరిపించి సంబరం చేస్తారు. తరువాత ఆ బొమ్మలను ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకువెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనినే ‘ఛ్వారీ ఛ్వారారో’ పండుగగా పిలుస్తారు.
తొమ్మిదో రోజు ‘బోరడిఝష్కేరో’...
తొమ్మిదో రోజు ‘బోరడిఝష్కేరో’ వేడుక నిర్వహిస్తారు. చివరిఘట్టంలో ‘తీజ్‌వేరాయెరో’ (నిమజ్జనోత్సవం) కరుణ రసపూరితంగా సాగుతుంది. ‘మాయమ్మ మాకు దూరమైపోతోంది.. మళ్ళీ ఎప్పుడొస్తావో..’ అంటూ యువతులు కన్నీటిపర్యంతమవుతారు. తండాపెద్ద వారిని ఓదారుస్తారు. యువతులు భవానిమాతను తులుస్తూ తీజ్‌నారు బుట్టలను కిందకు దింపి పూజలు చేసారు. దానిలోనుంచి కొంతనారును తెంపి తమ్ముళ్లు, బంధుమిత్రులకు చెవులలో పెడతారు. పెద్దతలకు తలపాగాలో దోపుతారు.
బహుమానంగా యువతులకు కానుకలు ఇస్తారు. అనంతరం పూజలు చేసి బుట్టలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి సమీపంలోని చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేస్తారు. చెరువు వద్దకు చేరగానే సోదరులు తమ సోదరి పాదాలను నీటితో కడిగి దండాలు పెట్టి ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అనంతరం వారు తమ ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంరొట్టెలు, బెల్లంతో కలిపి చేసిన ‘చూర్మో’ ను వాయినంగా సమర్పిస్తారు. తీజ్ పాటలు పాడుతూ ఇంటికి చేరతారు. ఇంతటితో తీజ్ వ్రతం ముగుస్తుంది. తండాలను పంచాయతీలుగా గుర్తిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటం సహజంగానే తండాలలో ఆనందాన్ని నింపింది. బంజారాల బతుకమ్మ అయిన తీజ్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని బంజారాలు కోరుతున్నారు.
బంజారాల బతుకమ్మ..తీజ్
Published Wed, Aug 13 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement