ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ తరలింపు..
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలను అంచనా వేయడంలో విఫలమైన రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వ వర్గాలు.. ఇప్పుడు కొత్త కరెన్సీ నోట్ల తరలింపుకు భారీ సన్నాహాలు చేశాయి. కరెన్సీ ముద్రణా కేంద్రాల నుంచి కొత్త నోట్లను బ్యాంకులకు తరలించే సమయాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. ఇంతకుముందు ఆయా కేంద్రాల నుంచి కొత్త కరెన్సీ బండిళ్లు బ్యాంకులకు చేరడానికి కనీసం 21 రోజులు పట్టేది.
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని నాసిక్, దేవాస్ ప్రెస్‌లతోపాటు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సాల్బోని(పశ్చిమ బెంగాల్), మైసూరు ముద్రణాలయాల నుంచి కొత్త నోట్ల రవణాను వేగవంతం చేశామని, కేవలం ఆరు రోజుల్లోనే కొత్త కరెన్సీ బ్యాంకులకు చేరుతున్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ఆర్మీ యుద్ధ హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నామని, జనవరి 15 నాటికి దేశంలో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయని తెలిపాయి.
మిగిలిపోయే డబ్బు జన్‌ధన్ ఖాతాల్లోకి..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయి. వీటిలో సుమారు 6 కోట్ల అకౌంట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. అలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్లలోకి ప్రభుత్వం రూ.10వేల చొప్పున జమచేస్తుందని.. తద్వారా నోట్ల రద్దు నిర్ణయంతో అందరికీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం పేదలకు వరాన్ని ప్రకటిస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇదంతా వట్టిదేనని, ప్రధానికిగానీ, ప్రభుత్వానికి గానీ జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బు మళ్లించాలనే ఆలోచన ఏమాత్రమూ లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
నోట్ల రద్దు ద్వారా (వెనక్కి రాని నల్లధనం వల్ల) సుమారు 3లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయని ప్రభుత్వం లెక్కకట్టిందని, వాటిని పేదలకు ఊరికే పంచెయకుండా ఉత్పాదకత పెంపు చర్యలకు వినియోగించాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రస్తుతం 18 నుంచి 20 శాతం వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని, నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత ఆ వడ్డీని గణనీయంగా తగ్గించి ఆయా పరిశ్రమలకు సులువుగా రుణాలు అందిపజేయాలని మోదీ ఆలోచిస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.