- కృష్ణా జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
- డివైడర్‌ను ఢీకొట్టి కాలువలో పడ్డ దివాకర్ ట్రావెల్స్ బస్సు
- 10 మంది దుర్మరణం
- 32 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- మృతి చెందిన వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్
- భువనేశ్వర్ – హైదరాబాద్ బస్సును కాటేసిన మృత్యువు
- మద్యంమత్తు, అతివేగంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): నిశీధిని చీల్చు కుంటూ భానుడి కిరణాలు మరికాసేపట్లో నేలను తాకుతాయనేలోగానే... ఆ ప్రయాణి కుల జీవితాలు అర్ధాంతరంగా తెల్లారి పోయాయి. క్షేమంగా గమ్యస్థానానికి చేరుస్తుందని ఎక్కిన బస్సే మృత్యుశకటంగా మారి ప్రాణాలను బలితీసుకుంది. నుజ్జునుజ్జయిన బస్సు... అందులో ఇరుక్కుపోయి మృత్యువాతపడ్డ అభాగ్యులు... కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్తనాదాలు చేస్తున్న బాధితు లు... అంతటా రోదనలు... వర్ణింపశక్యంగాని వేదన. ఇదీ..
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామం వద్ద విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున హృదయాలను ద్రవింపజేసిన దృశ్యం. దివాకర్ ట్రావెల్స్ బస్సు(ఏపీ02 టీసీ 7146) మంగళవారం ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ముండ్లపాడు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆంధ్రా ఆసుపత్రి, హెల్ప్ ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
(కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కబళించిన అతివేగం
దివాకర్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒడిశాలోని కటక్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరింది. ఈ బస్సు మంగళవారం ఉదయం 9 గంటలకు హైదరా బాద్‌కు చేరుకోవాలి. కృష్ణా జిల్లాలో విజయ వాడ దాటిన తర్వాత 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మంగళవారం తెల్ల వారుజామున 5.45 గంటల ప్రాంతంలో ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద ప్రమాదానికి గురైంది. మద్యం మత్తు, డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సును నడుపుతుండటం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ముండ్లపాడు సమీపంలోని మలుపు వద్ద బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో మలుపు వద్ద బస్సు నేరుగా డివైడర్‌ను ఢీకొట్టింది. అత్యంత వేగంగా వస్తుండటంతో డివైడర్‌పై నుంచి అమాంతంగా గాల్లోకి ఎగిరి దాదాపు 150 అడుగుల దూరంలో ఉన్న మంగలకాలువ కల్వర్టు మధ్యలోకి దూసుకె ళ్లింది. దాదాపు 22 అడుగుల లోతున్న కల్వర్టు లోకి దూసుకెళ్తూ ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జు అయ్యిం ది. డ్రైవర్ ఆదినారాయణ (45), క్లీనర్ పట్టం శెట్టి పృథ్వీ(30) అక్కడికక్కడే మృతి చెందారు.
క్షతగాత్రుల రోదన
దివాకర్ ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టి అమాంతంగా గాల్లో ఎగురుకుంటూ 22 అడుగుల లోతులో కల్వర్టులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. బస్సు కల్వర్టులో నుజ్జునుజ్జై ఇరుక్కుపోయింది. దీంతో బస్సు తలుపులు తీయడం సాధ్యపడలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అరగంటకు సమీపంలోని ముండ్లపాడు, నవాబుపేట గ్రామస్తులు సంఘ టనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా మృతదేహాలు, రక్తపు మడుగు లతో భీతావహంగా మారింది. తీవ్రంగా గాయ పడిన ప్రయాణికులు తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎవరు మృతి చెందారో, ఎవరు గాయపడ్డారో కొద్దిసేపు ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. అప్పటికి ఇంకా చీకటిగానే ఉండటంతోపాటు, కాలువలో మురుగునీరు, బురద ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు వచ్చేలోగా బస్సులో ఉన్నవారిని బయట కు తీసేందుకు ప్రయత్నించారు. బస్సు కచ్చి తంగా కాలువ మధ్యలో ఇరుక్కుపోవడంతో క్షతగాత్రులను బయటకు తీయడం సాధ్యపడ లేదు. పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూటీమ్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. గ్యాస్ కట్టర్లు, క్రేన్‌లు, ఇతర సామగ్రితో బస్సు భాగాలను కోస్తూ ఒక్కొక్కరిగా క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. బస్సు మధ్యలో ఇరుక్కుపో యిన చివరి మృతదేహాన్ని క్రేన్‌ల సహాయంతో బస్సును పైకి లేపి మధ్యాహ్నం 12 తరువాత బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5.45కు ప్రమాదం జరిగితే మధ్యాహ్నం 12 గంటలకు సహాయక చర్యలు పూర్తయ్యాయి. దాదాపు 7 గంటలపాటు క్షత గాత్రులు బస్సులోనే ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోయారు.
బస్సులో ప్రయాణిస్తున్న కోట మధుసూదనరెడ్డి(40), నల్లబోతు శేఖర్ రెడ్డి(28), తులసమ్మ(45), బలదేవ్(39), షేక్ బాషా(34), మహ్మద్ తయ్యబ్(35), విద్యా పతి(34) సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 32 మంది ప్రయాణికులకు తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రు లను మూడు ‘108’అంబులెన్స్‌ల్లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నల్లబోతు కృష్ణారెడ్డి(32) నంది గామ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన నల్లబోతు శేఖర్‌రెడ్డి, నందిగామ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన నల్లబోతు కృష్ణారెడ్డి స్వయానా అన్మదమ్ములు. వారి స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మంది, ఆంధ్రా హాస్సిటల్‌లో 13 మంది, హెల్ప్ హాస్సిటల్‌లో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కె.చంద్రమోహన్‌రావు (ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా), కమల (శ్రీకాకుళం) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
అతివేగమే కారణం: డీజీపీ
ముండ్లపాడు వద్ద బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందడం, 32 మంది గాయపడటానికి ప్రధాన కారణం అతివేగమే కారణమని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కామినేని
నందిగామ రూరల్ (నందిగామ): బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో అందజేస్తామని తెలిపారు.
ప్రమాదం కలిచివేసింది: పవన్‌కల్యాణ్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన తనను ఎంతో కలిచివేసిందని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రమాదంలో మరణించినవారు
నల్లబోతు కృష్ణారెడ్డి(32), సూర్యాపేట
నల్లబోతు శేఖరరెడ్డి(28), సూర్యాపేట
తులసమ్మ(45), శ్రీకాకుళం జిల్లా
బలదేవ్(39), భువనేశ్వర్
షేక్ బాషా(34), భవానీపురం, విజయవాడ
మహ్మద్ తయ్యబ్(35), ముషీరాబాద్, హైదరాబాద్
విద్యాపతి(34), ఒడిశా
కోట మధుసూదనరెడ్డి(40), ఒడిశా
ఆదినారాయణ(45), డ్రైవర్, తాడిపత్రి, అనంతపురం జిల్లా
పట్టంశెట్టి పృథ్వీ(30), క్లీనర్, గణపవరం, గుంటూరు జిల్లా
పరిస్థితి విషమంగా ఉన్నవారు
కె.చంద్రమోహన్‌రావు, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా
కమల, శ్రీకాకుళం
క్షతగాత్రులు వీరే ..
కృష్ణా జిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడినవారు విజయవాడలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం. యుగంధర్(38), ఎం.కమల(61), టెక్క లికి చెందిన సీహెచ్ రేవతి(21), ఎర్రగడ్డకు చెందిన ఎ.ఎ.భాసిత్(49), కూకట్‌పల్లికి చెందిన ఎ.ప్రశాంత్ (28), భువనేశ్వర్‌కు చెందిన ఉత్తమ్(18), గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎం.కుమార్ (37), కొండపల్లికి చెందిన పటాన్‌జానీ(28), విజయవాడకు చెందిన బి.ప్రవీణ్ (26), టెక్కలికి చెందిన సీహెచ్ కిరణ్ (27), శ్రీకాకుళానికి చెందిన ఎ.అచ్యుతరావు(27), లక్ష్మీనాయుడు (28), హైదరాబాద్‌కు చెందిన ఎస్. కోటేశ్వరరావు(30), భువనేశ్వర్‌కు చెందిన దీప్తిరంజన్ (27), ఎస్.గణేష్((32), విజయనగరం జిల్లాకు చెందిన భార్గవి (22), శ్రీకాకుళం జిల్లాకు చెందిన వి.శివ రామకృష్ణ(31), ఆర్.దిలీప్ కుమార్(30), దినేష్(24), హైదరాబాద్‌కు చెందిన కృష్ణవర్దన్(34), సందీప్(27), బి.వాసు దేవరావు(30), జలయం నలీమ్(35), డి.గణేష్(35), హైదరాబాద్‌కు చెందిన పెరుమాళ్ల అహ్మద్(34), శెట్టి చిత్ర(22), శ్రీకాకుళం జిల్లాకు చెందిన వంబరవల్లి వెంకటరావు(31), ఆముదాలవలసకు చెందిన కెంబూరు చంద్రమోహనరావు (37), కటక్‌కు చెందిన సిరాజ్‌ఖాన్(40), హైదరాబాద్‌కు చెందిన కోట అభిషేక్ (22), సూరత్‌కు చెందిన అనూష్‌పాండే (22), సాలూరుకు చెందిన జి.బాలాజీ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.
అతివేగమే ప్రమాదానికి కారణం
సాక్షి, అమరావతి బ్యూరో: అతివేగంతోపాటు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైందని ఏపీ రవాణా శాఖ ప్రకటిం చింది. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఇ.మీరాప్రసాద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒడిశాలోని కటక్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 02 టీసీ 7146) కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద మంగళవారం ఉదయం 5.40కు ప్రమాదానికి గురైంది. రవాణాశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రైవర్ అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జోగడంతో బస్సు డివైడర్‌ను ఢీకొని కల్వర్టులో పడిందని అధికారులు చెబుతున్నారు. కల్వర్టు గోడలను రాసుకుంటూ పడటంతో డ్రైవర్‌తోపాటు కుడివైపు ప్రయాణికులు అక్కడే మృతిచెందారు.
ఆ క్షణం ఊపిరాగినట్లైంది: వి.శివరామకృష్ణ, ఉద్యోగి, శ్రీకాకుళం
హైటెక్ సిటీలో ఉద్యోగం చేస్తున్నా. శివరాత్రి సందర్భంగా సొంతూరు వెళ్లాను. తిరిగి హైదరాబాద్ బయలుదేరాను. నిద్రలో ఉండగా ఏదో కుదిపినట్లు అనిపించి కళ్లు తెరిచాను. చుట్టూ చీకటి.. అంతలోనే అరుపులు.. కేకలు... ఆ క్షణం ఊపిరాగినంత పనైంది.
ఇప్పటికీ కళ్ల ముందే కదులుతోంది: కొల్లూరు వెంకటభరద్వాజశర్మ, విశాఖపట్నం
హైదరాబాద్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నా. మహాశివరాత్రి కావడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చా. తెల్లవారు జామున పెద్ద శబ్దం, రోడ్డుపై ప్రయాణించాల్సిన బస్సు కల్వర్టులో ఉంది. భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కళ్లముందే కదులుతూ ఒళ్లు గగుర్పొడుస్తోంది.
గత ఐదేళ్లలో ఘోర బస్సు ప్రమాదాలు
- 2016 సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి షిర్డీ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు కర్ణాటక దగ్గర హుమ్నాబాద్ వద్ద తగలబడి పోయింది. ఈ మంటల్లో చిక్కుకుని తణుకు ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి విహాన్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో 30 మంది క్షతగాత్రులయ్యారు.
- 2013 అక్టోబర్ 30న బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా పాలెం గ్రామం వద్ద జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమయ్యారు.
- 2012 జూన్ 16న షోలాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై షిర్డీ వెళుతున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడి 32 మంది భక్తులు మరణించారు.