రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్! | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్!

Published Tue, Nov 24 2015 9:29 AM

రూ.2 కోట్ల ప్యాకేజీతో గూగుల్ లో జాబ్!

పుణే: ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభిషేక్ పంత్ భారీ ఆఫర్ దక్కించుకున్నాడు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజ సంస్థ గూగుల్ లో స్టాక్ ఆప్షన్ తో సహా భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. 22 ఏళ్ల అభిషేక్.. కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో కాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీస్ లో మూడు నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేశాడు. ఇటీవల అతడిని డిజైన్ సొల్యూషన్ సెల్ లోకి తీసుకున్నారు.

పుణేకు చెందిన అభిషేక్ సీబీఎస్ టెన్త్ పరీక్షలో 97.6 శాతం మార్కులతో నగరంలో టాపర్ గా నిలిచాడు. గూగుల్ సంస్థలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం రావడం పట్ల అభిషేక్‌ ఆనందం వ్యక్తం చేశాడు. పుణే నుంచి ఖరగ్ పూర్ కు, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు తన జర్నీ చాలా ఆసక్తికరంగా సాగిందని పేర్కొన్నాడు.

అమెరికాలో పుట్టి పెరిగిన అభిషేక్ తన కుటుంబ సభ్యులతో కలిసి 2006లో పుణేకు వచ్చాడు. అయితే గూగుల్ లో ఉద్యోగం రావడంతో మళ్లీ కాలిఫోర్నియాకు వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో అతడు జాబ్ లో చేరనున్నాడు. ఇప్పటివరకు అతడికి ఎటువంటి ప్రాజెక్టు కేటాయించలేదు. కాగా, తమ విద్యార్థుల్లో అభిషేక్ పంత్ కు దక్కిన ప్యాకేజీయే అత్యధికమో, కాదో ఇప్పుడే చెప్పలేమని ఖరగ్ పూర్ ఐఐటీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement