మెరుపుదాడి | India Army to attack on Pakistan army camps | Sakshi
Sakshi News home page

మెరుపుదాడి

Published Fri, Sep 30 2016 2:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

మెరుపుదాడి

మెరుపుదాడి

♦  పీవోకేలో భారత కమాండోల వ్యూహాత్మక పంజా
♦  బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆపరేషన్
♦  నియంత్రణరేఖకు ఆవల మూడు కిలోమీటర్ల వరకూ సైనిక చర్య
ఉగ్రవాదులు పొంచివున్నారన్న ఖచ్చితమైన సమాచారంతోనే దాడి
ఆపరేషన్ మొత్తం యూఏవీలతో సైనిక కేంద్రాలకు ప్రత్యక్ష ప్రసారం
నార్త్‌బ్లాక్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రభుత్వ, సైనిక ముఖ్యులు
40 మంది ఉగ్రవాదులు హతం- ఉడీ దాడికి సైన్యం ప్రతీకారం
బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆపరేషన్
నియంత్రణరేఖకు ఆవల మూడు కిలోమీటర్ల వరకూ సైనిక చర్య
నార్త్‌బ్లాక్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రభుత్వ, సైనిక ముఖ్యులు

 
ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు బలంగా జవాబు ఇవ్వాలన్న ఒత్తిడి కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుకు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు దాడి చేయడానికి వారం రోజుల కిందటే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. బుధవారం నాడు.. రక్షణమంత్రి మనోహర్ పారికర్‌తో పాటు, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌లు రాత్రి ఓ విందుకు హాజరుకావాల్సి ఉంది. కానీ వారెవరూ ఆ విందుకు హాజరుకాలేదు. వారు ముగ్గురూ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్‌తో కలిసి సౌత్ బ్లాక్‌లోని సైనిక వార్ రూమ్‌లో రోజంతా చర్చించారు. రహస్య సైనిక చర్యకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ఆమోదం తెలిపాక.. అర్థరాత్రి సైనిక చర్య మొదలయింది.
 
 పీఓకేలో భారత కమాండోల నిర్దిష్ట దాడులు
న్యూఢిల్లీ: సీమాంతరఉగ్రభూతంపై భారత్ పంజా విసిరింది. నియంత్రణరేఖను దాటి మెరుపు దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పొంచివున్న ఉగ్రమూకలను అంతమొందించింది. భారత సైనిక కమాండోలు ఈ వీరోచిత ఆపరేషన్‌ను నిర్వహించారు. ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. ముంచుకొస్తున్న ముప్పునూ నిలువరించారు. ముందుగా రచించిన వ్యూహం ప్రకారం భారత సైనిక కమాండోలు బుధవారం అర్థరాత్రి పీఓకేలోకి చొచ్చుకెళ్లారు. దాదాపు 200 కిలోమీటర్ల పరిధిలో 7 ఉగ్రవాద ప్రయోగ స్థావరాలపై దాడులు నిర్వహించారు.


నాలుగు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో.. 38 మంది ఉగ్రవాదులతో పాటు, వారికి మద్దతునిస్తున్న ఇద్దరు పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు అంచనా. భారత్ ఈ సైనిక చర్య విషయాన్ని గురువారం పాకిస్తాన్‌కు తెలియజేసింది. ఉగ్రవాద రక్కసి నిర్మూలనలో సహకరిస్తారని గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకుంటారని ఆశిస్తున్నామనీ చెప్పింది. అయినా.. ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని స్పష్టంచేసింది. ఈ అనూహ్య పరిణామంతో పాకిస్తాన్ నివ్వెరపోయింది. కానీ.. అలాంటి దాడి ఏమీ జరగలేదని, అది కేవలం సీమాంతర కాల్పుల ఘటనేనని గాంభీర్యం ప్రదర్శించింది.

భారత సైన్యం కాల్పుల్లో తమ సైనికులు ఇద్దరు చనిపోయారని, తాము భారత జవాను ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నామని, మరో 8 మంది భారత సైనికులు తమ కాల్పుల్లో చనిపోయారని ప్రకటనలు జారీ చేసింది. ఈ ప్రకటన పూర్తిగా తప్పని భారత సైన్యం తిరస్కరించింది. పీఓకేలో మెరుపు దాడుల విషయమై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాముఫ్తీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తదితరులకు ప్రధాని మోదీ సమాచారం ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను పక్కనపెట్టి.. ఈ దాడి విషయంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. సైనికుల ఆపరేషన్‌ను ప్రస్తుతించాయి. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పి-5 శక్తులతో సహా 25 దేశాల రాయబారులకు ఈ దాడికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)కు ఆవల పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో గల ఉగ్రవాద ప్రయోగ స్థావరాలపై భారత సైన్యం బుధవారం అర్థరాత్రి మెరుపు దాడి చేసింది. భారత్‌లోకి చొరబడేందుకు ఏడు లాంచ్ ప్యాడ్ (ప్రయోగ స్థావరాల)లలో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్న వారిని గణనీయమైన సంఖ్యలో అంతమొందించింది. సైనిక పరిభాషలో ఈ దాడిని ‘సర్జికల్ స్ట్రైక్ (లక్షిత దాడి)’ గా  వ్యవహరిస్తారు.
 
 పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ.. కశ్మీర్‌లోని ఉడీలో భారత సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన 11 రోజుల తర్వాత భారత్.. ఉగ్రవాద శిబిరాలపై ఈ మెరుపు దాడి చేసింది. ఉడీలో 18 మంది సైనికుల బలిదానం వృథా కాదని, ఆ దాడి కారకులను శిక్షించితీరతామని ప్రధాని మోదీ అప్పుడే ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకూ సైన్యం పీఓకేలో లక్షిత దాడి నిర్వహించింది.మోదీ గురువారం ఉదయం భద్రతపై మంత్రివర్గ సంఘం(సీసీఎస్) భేటీ నిర్వహించి తాజా పరిణామాలను సమీక్షించారు. అనంతరం.. మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి.. సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాక్ వైపున పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని, భారత సైనికలందరూ క్షేమంగా తిరిగివచ్చారని చెప్పారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం పట్ల రక్షణమంత్రి పరీకర్ ట్వీటర్ ద్వారా సైనిక బలగాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను త్వరలో విడుదల చేస్తామని సంబంధిత వర్గాలు చెప్పాయి.
 
 పాక్ సైనికుల దృష్టి మరల్చి...
 ♦ అర్థరాత్రి 12:30 గంటలు దాటిన తర్వాత ఎల్‌ఓసీలో ఉడీ సహా పలు ప్రాంతాల్లో.. పాక్ సైన్యం దృష్టిని మరల్చడానికి భారత సైన్యం ఆర్టిలరీ కాల్పులు ప్రారంభించడంతో ఆపరేషన్ మొదలయింది. భారత సైన్యం కాల్పులను తిప్పికొట్టడంపై పాక్ సైన్యం దృష్టి కేంద్రీకరించడంతో.. భారత కమాండోలు మూడు బృందాలుగా విడిపోయి, ముందుగా నిర్ణయించిన ప్రదేశాల నుండి నేల మీద పాకుతూ ఎల్‌ఓసీ దాటి పీఓకోలోకి ప్రవేశించారు.
♦ పీఓకేలో 200 కిలోమీటర్ల పరిధిలోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ సైనిక చర్యను నిర్వహించారు ఆపరేషన్  చాలా వరకూ ఎల్‌ఓసీకి 2 కి.మీ దూరం లోపలే జరిగింది. అయితే.. ఒక కమాండోటీం హాట్‌వాటర్ స్ప్రింగ్స్‌లో దాదాపు 3 కి.మీ. దూరం లోపలికి వెళ్లాల్సి వచ్చింది.  
♦  లేపా లోయ, టట్టా పానీ, బీంబార్‌లలో ఈ బ లగాలు దాడులు నిర్వహించాయి. హాట్ స్ప్రిం గ్స్, కేల్, లిపాల్లోని ఉగ్రవాదుల లాం చింగ్ ప్యాడ్లపై సైన్యానికి చెందిన 15 కోర్, బీంబార్ గలీపై సైన్యపు 16వ కోర్ దాడి చేపట్టింది. కుప్వారాకు ఎదురుగా ఉన్న నాలుగు లాంచ్ ప్యాడ్లు ఎల్‌ఓసీ నుండి కేవలం 300 మీటర్ల దూరం లోపలే ఉన్నాయి. సైనిక బలగాలు భా రీ కాల్పులతో ఈ ప్యాడ్లను ధ్వంసం చేశాయి.
 
 ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాం: డీజీఎంఓ  
 ‘జమ్మూకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో దాడులులక్ష్యంగా కొన్ని ఉగ్రవాద ముఠాలు భారత్‌లో చొరబడడం కోసం నియంత్రణ రేఖ వెంట లాంచ్ ప్యాడ్లలో వేచివున్నాయని మాకు అందిన విశ్వసనీయ, కచ్చితమైన సమాచారం ఆధారంగా ఆ ల్యాంచ్ ప్యాడ్లపై భారత ఆర్మీ లక్షిత దాడి నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడడం ద్వారా దేశ పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగేలా విధ్వంసం సృష్టించే కుట్రలో సఫలం కాకుండా చూడడం కోసం ఈ చర్య చేపట్టాం. ఈ ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వారు గణనీయమైన సంఖ్యలో మరణించారు. ఉగ్రవాదులను అంతమొందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ అక్కడితో ముగిసింది. ఇంకా ఈ చర్యలు కొనసాగించే ప్రణాళికలేవీ మాకు లేవు. అయినప్పటికీ, ఎటువంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో శాంతి, ప్రశాంతతలను కాపాడలన్నది భారత ఉద్దేశం. కానీ.. ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు అవతలి నుండి పనిచేస్తూ దేశ పౌరులపై దాడులు చేయడాన్ని కచ్చితంగాఅనుమతించం.
 
పాక్ మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్‌తో నేను మాట్లాడాను. భారత ఆందోళనలను ఆయనకు తెలియజేశాను. ఈ సైనిక చర్య వివరాలనూ అందజేశాను. తన భూభాగాన్ని కానీ తన నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని కానీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకూ వినియోగించనివ్వబోమని పాకిస్తాన్ 2004 జనవరిలో ఇచ్చిన హామీకి అనుగుణంగా.. ఈ ఉగ్రవాద భూతాన్ని ఈప్రాంతం నుంచి తుడిచిపెట్టే దృష్టితో పాక్ సైన్యం మాకు సహకరిస్తుందని ఆశిస్తున్నాం.’
 
వారం ముందే గ్రీన్‌సిగ్నల్..!
ఉడీ ఉగ్రదాడి తర్వాత పాక్‌కు బలంగా జవాబివ్వాలన్న ఒత్తిడి కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారుకు ఎదురైంది. ఉగ్రవాద స్థావరాలపై ముందస్తు దాడికి వారం రోజుల కిందటే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సరిగ్గా వారం కిందటే.. ఉడీ దాడికి తాము ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో జవాబు ఇస్తామని భారత ఆర్మీప్రకటించింది. బుధవారం  రక్షణమంత్రి పరీకర్ ఢిల్లీలో ప్రారంభమైన కోస్ట్‌గార్డ్స్ కమాండర్ల సదస్సు ప్రారంభించారు. ఆ రోజు సాయంత్రం ఆయనతో పాటు, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌లు సదస్సులో రాత్రి విందుకెళ్లాల్సి ఉంది.
 
కానీ ఆ విందుకు హాజరుకాలేదు. వారు ముగ్గురూ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్‌తో కలిసి సౌత్ బ్లాక్‌లోని సైనికవార్ రూమ్‌లో రోజంతా చర్చించారు. రహస్య సైనిక చర్యకు ప్రధానిలాంఛనంగా ఆమోదం తెలిపాక.. అర్ధరాత్రి సైనికచర్య మొదలయింది. నలుగురు ముఖ్యులూ వార్ రూ నుంచి ఆ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు. ఆపరేషన్ యూఏవీ వీడియో ద్వారా ఉదంపూర్ సైన్యం నార్తరన్ కమాండ్ కేంద్రంతో పాటు బారాముల్లా, కుప్వారా, ఉడీ సైనిక స్థావరాలకు ప్రత్యక్ష ప్రసారం అయింది. ఆ కేంద్రాలతో పాటు.. సౌత్‌బ్లాక్‌లోని వార్‌రూంలో ప్రసారాలను వీక్షిస్తూ పర్యవేక్షించారు.
 
 మొత్తం 40 మంది హతం!
 మొత్తం 8 లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా ఎంచుకోగా.. ఆరింటిలో ఉగ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారు. రెండిటిలో అంతగా కదలికలు కనిపించలేదు. ప్రతి స్థావరం వద్దా బలగాలు వేగంగా వెళ్లి పేలుడు పదార్థాలు అమర్చి, వాటిని పేల్చి బయటకు వచ్చేశాయి.  కొన్ని చోట్ల సైనిక బలగాలకు కాల్పులు ఎదురయినా ఎవరూ గాయపడలేదు. కమాండోలు ఎదురు కాల్పులతో తిప్పికొట్టారు. దాడి చేసిన లక్ష్యాల్లో మూడు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.  ఈ లాంచ్ ప్యాడ్లకు మద్దతుగా ఉండే పాక్ సైన్యం వాటికి ఇంకొంత దూరంలో ఉంది. దీంతో లాంచ్ ప్యాడ్లలోని ఉగ్రవాదులపై భారత బలగాలు మెరుపు దాడి చేసి అంతమొందించాయి.  యూఏవీ వీడియో దృశ్యాలను బట్టి ఈ ఆపరేషన్‌లో 40 మంది చనిపోయినట్లు సైన్యం అంచనాకు వచ్చింది. అందులో 38 మంది ఉగ్రవాదులు కాగా.. మరో ఇద్దరు పాక్ సైనికులుగా చెప్తున్నారు. ఈ  సంఖ్యపై అధికారికంగా ఏమీ ప్రకటించలేదు.
 
 ఆద్యంతం వ్యూహాత్మకం...
 సైనిక, ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మెరుపు దాడి  తీరుతెన్నులివీ...
  పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు ఎల్‌ఓసీకి ఆవల రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిపై వారం రోజులుగా భారత్ నిఘా పెట్టింది. భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు వీటివద్దకు చేరుకుని వేచివున్నారన్న పక్కా నిఘా సమాచారంతో ఎనిమిది లాంచ్ ప్యాడ్లపై దాడి చేయాలని నిర్ణయించారు.
 
♦  లాంచింగ్ ప్యాడ్లలో ముందుగా గుర్తించిన లక్ష్యాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను స్థానిక కమాండర్లకు ఇచ్చారు. బలగాలను ముందుగానే హెలికాప్టర్ల ద్వారా ఎల్‌ఓసీ సమీపానికి తరలించారు. అయితే భారత హెలికాప్టర్ ఏదీ ఎల్‌ఓసీ దాటి అవతలికి వెళ్లలేదు. ఎల్‌ఓసీకి సమీపంలోని ముందుగా నిర్ణయించిన ప్రదేశాల్లో సైనికులను హెలికాప్టర్ల ద్వారా దించారు. ఆపరేషన్ పూర్తయ్యేంతవరకూ హెలికాప్టర్లను సిద్ధంగానే ఉంచారు.
 
♦  పారా కమాండో దళాలు, స్థానిక యూనిట్లకు చెందిన ‘ఘాతక్’ ప్లాటూన్లు ఈ ఆపరేషన్లలో పాల్గొన్నాయి. ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడున్నాయో తెలిసిన గైడ్లు, మార్గదర్శకులు కూడా పాలుపంచుకున్నారు. డోంగ్రా, బిహార్ రెజిమెంట్ల సైనికులు ఈ ఆపరేషన్‌కు మద్దతుగా పాల్గొన్నారు.
♦  కమాండోలు థర్మల్ ఇమేజర్లు, హైమాస్క్‌డ్ లైట్లు, భారీ తుపాకులు, కార్ల్ గుస్తావ్ రైఫిళ్లు, గ్రెనేడ్లు తదితర ఆయుధాలు, సామగ్రిని ఉపయోగించారు. ‘షూట్ టు కిల్’ (చంపడానికి కాల్పులు) ఆదేశాలతో పాటు.. గాయపడిన సైనికుడెవరినీ వెనుక వదిలి రావద్దన్న ఆదేశాలు వారికి ఉన్నాయి.
 
♦ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 7 ఉగ్రవాద శిబిరాలను (లాంచ్ ప్యాడ్స్) సైన్యం మెరుపు దాడి కోసం లక్ష్యంగా ఎంచుకుంది.
 
♦ లాంఛనంగా అనుమతి లభించాక బుధవారం మధ్యాహ్నమే దళాలను హెలికాప్టర్లతో తరలించడం ప్రారంభించింది.
 
♦ బుధవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం దృష్టిని మరల్చి ఎల్‌వోసీనుంచి పర్వతశ్రేణులతో కూడిన పీవోకే భూభాగంలోకి పారా కమాండోలు మూడు కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లారు.
 
♦ 200 కి.మీ విస్తృతిలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఉగ్ర శిబిరాలపై  దాడి చేసి 40 మందిని మట్టుబెట్టారు.
 
♦  మొత్తం ఆపరేషన్‌ను డ్రోన్ కెమెరాల ద్వారా సైనిక కేంద్రాలకు,  నార్త్ బ్లాక్‌కు ప్రత్యక్ష ప్రసారం చేశారు.
 
♦  ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి తెల్లవారుజామున  4:30 గంటలకు తిరిగి మన భూభాగంలోకి చేరుకున్నారు.
 
♦ మెరుపు దాడి లక్ష్యం నెరవేరిందని, భద్రతా దళాలు పీవోకే లోపలకు ప్రవేశించి తెల్లవారేలోగా తిరిగి వచ్చేశాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
 
♦ ఈ ఆపరేషన్‌లో మనవారి మృతదేహాలను లేదా గాయపడిన సహచరులను వదిలి రావొద్దని జవాన్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
 
♦ జమ్మూకశ్మీర్‌తోపాటు మెట్రో నగరాల్లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైన్యం వారం రోజుల ముందు నుంచే పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెట్టింది.
 
♦ ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని ఉడి సైనిక క్యాంపుపై ఉగ్రదాడి జరిగిన అనంతరం పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు అందాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement