కలెక్టర్ ప్రీతి మీనా చేతిని తాకుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్
- మహిళా కలెక్టర్‌తో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తన
- మానుకోట ఎమ్మెల్యే తన చేయి పట్టుకోవడంతో నిర్ఘాంతపోయిన ప్రీతిమీనా
- ‘బీ ఇన్ యువర్ లిమిట్..’ అంటూ తీవ్ర హెచ్చరిక
- ఐఏఎస్‌ల సంఘం, సీఎస్‌తోపాటు పోలీసులకూ ఫిర్యాదు
- మహబూబాబాద్ కలెక్టర్‌కు ఉద్యోగుల బాసట
- నల్లబ్యాడ్జీలతో నిరసన.. చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్
- ఎమ్మెల్యే తీరుపై సీఎం కేసీఆర్ మండిపాటు
- తక్షణమే బేషరతుగా క్షమాపణలు కోరాలని ఆదేశం
- కలెక్టర్‌కు ఫోన్ చేసి సముదాయించిన డిప్యూటీ సీఎం కడియం
- పొరపాటున చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా: ఎమ్మెల్యే
సాక్షి, మహబూబాబాద్/హైదరాబాద్
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాకు తీవ్ర అవమానం జరిగింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలెక్టర్‌ను, పైగా మహిళనైన తనను చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆమె ఆగ్రహించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ అవమానంపై కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. అటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్ తరఫున వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు సీఎస్‌ను కలసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలూ మండిపడుతున్నాయి. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే గురువారం ఉద్యోగాలకు హాజరుకాబోమని కలెక్టరేట్ ఉద్యోగులు హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశంతో శంకర్ నాయక్.. కలెక్టర్‌ను కలసి క్షమాపణలు కోరారు. జిల్లాస్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడతారని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. 1988లో పంజాబ్‌లో నాటి డీజీపీ కేపీఎస్ గిల్.. ఓ సమావేశంలో ఐఏఎస్ అధికారి రూపన్ డియోల్ బజాజ్‌తో ఇలాగే అమర్యాదగా ప్రవర్తించినందుకు ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్లారని, చివరికి గిల్‌ను కోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. గిల్‌కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయని పేర్కొంటున్నారు.
ఐ యామ్ కలెక్టర్.. బీ ఇన్ యువర్ లిమిట్!
హరితహారం మూడోవిడత కార్యక్రమాన్ని మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అంతా కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండని అన్నారు. దీంతో ఆమె నిర్ఘాంతపోయారు. అక్కడే ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ‘ఐ యామ్ కలెక్టర్.. బీ ఇన్ యువర్ లిమిట్’అంటూ హెచ్చరించారు. అక్కడ్నుంచి సభావేదికపైకి వెళ్లారు. సభ ముగిసేంత వరకు మిన్నకుండిపోయారు. కార్యక్రమం ముగియగానే జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ ఆయూబ్ అలీని పిలిచి ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎస్, ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు
అనంతరం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మీడియాలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగుల కోసం ఆరా తీశారు. ఎమ్మెల్యే తన చేయిపట్టుకున్న ఫొటోలను సంపాదించి.. ఐఏఎస్‌ల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా పిలిచి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ లోపు విషయం దావానలంలా వ్యాపించడంతో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ వారందరితో సమావేశమయ్యారు. చివరకు అధికారులంతా నల్లబ్యాడ్జీలతో బయటకు వచ్చారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్ అఫీసర్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్‌కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితేమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం సీరియస్..
కలెక్టర్ ప్రీతి మీనాపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శంకర్‌నాయక్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌తో మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ తరఫున కలెక్టర్‌తో మాట్లాడి సముదాయించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేసి సముదాయించేందుకు ప్రయత్నించారు. వెంటనే వెళ్లి కలెక్టర్‌ను క్షమాపణ కోరాలంటూ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి హెచ్చరించారు. మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆమెతో చర్చించారు. దాదాపు గంటపాటు చర్చించిన అనంతరం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పిలిపించి కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పించారు.
చేయి తగిలి ఉంటే క్షమాపణలు కోరుతున్నా: శంకర్‌నాయక్, ఎమ్మెల్యే
‘జిల్లా కలెక్టర్ నాకు సొదరిలాంటిది. కలెక్టర్ అంటే చాలా గౌరవం ఉంది. నేను ఎస్టీ వర్గానికి చెందినవాడిని. ఆమె కూడా ఎస్టీ వర్గానికి చెందినదే. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఒకవేళ జనంలో పొరపాటున చేయి తగిలి ఉంటే, క్షమాపణలు కోరుతున్నా’అని వివరణ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కలెక్టర్ చేయిని కావాలనే పట్టుకొని... ఇప్పుడు ‘పొరపాటున తగిలి ఉంటే..’అంటారా అని ఆగ్రహం వ్యక్తచేస్తున్నారు.
ఎన్నోసార్లు కంటతడి పెట్టిన కలెక్టర్!
ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాతో గతంలో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పలు సందర్భాల్లో చేతులతో తాకడం, దురుసుగా మాట్లాడడం, పలుమార్లు దుర్భాషలాడినట్లు తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ సీనియర్ అధికారుల వద్ద ఎమ్మెల్యే తీరుపై పలుమార్లు కంటతడి కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే కావడంతో ఏం చేయలేక, చూసీచూడనట్లు వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే వైఖరిపై కలెక్టర్ ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా స్థాయి అధికారులతో కూడా ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడుతారని పలువురు అధికారులు చెబుతున్నారు. రారా, పోరా, వాడు, వీడు అని వ్యాఖ్యానించినా ఏం చేయలేక, మౌనంగా ఉంటున్నామని అధికారులు వాపోతున్నారు.
వివాదాస్పదంగా ఎమ్మెల్యేల తీరు..
ఐఏఎస్ అధికారిపై ఎమ్మెల్యే దురుసుగా వ్యవహరించిన సంఘటన ఇటు ప్రభుత్వాన్ని, అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కలవరపరిచింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ గతంలోనూ ఒక భూమి విషయంలో స్థానిక మహిళా తహశీల్దార్‌ను ఇంటికి పిలిపించి దుర్భాషలాడినట్టు ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు ఏకంగా కలెక్టర్‌కు చేదు అనుభవం ఎదురవటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు అందరి నోటా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రొటోకాల్ పాటించలేదంటూ అక్కడి మహిళా కలెక్టర్‌పై ఇటీవలే దుందుడుకుగా వ్యవహరించారు. సీడ్ బాల్ బాంబింగ్ కార్యక్రమానికి తనను పిలవలేదంటూ గదమాయించారు. ఈ వరుస ఘటనలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినవే కావటం గమనార్హం.