పన్నీర్ సెల్వం తిరుగుబాటు
శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు ఆపద్ధర్మ సీఎం గళం
► నాతో బలవంతంగా రాజీనామా చేయించారు
► ప్రజలు కోరితే వెనక్కి తీసుకుంటా..
► నిజాలు చెప్పాలని అమ్మ ఆత్మ
► తనను ప్రేరేపించిందన్న సెల్వం
► పార్టీ పదవి నుంచి పన్నీర్ తొలగింపు..
► ఎమ్మెల్యేలంతా నా వెంటే: శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. సౌమ్యు డిగా, పార్టీకి విధేయుడిగా పేరున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయ సమాధి సాక్షిగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి శశికళపై తిరుబాటు బావుటా ఎగరేశారు. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏఐఏడీఎంకేలో ప్రకంపనలు పుట్టాయి. పార్టీ చీలిపోయిందనే ఊహాగానాలు చెలరేగాయి.
ఈ పరిణామాలతో ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా రంగంలోకి దిగారు. వెంటనే అధికార పక్షం బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డిల్లీ నుంచి బీజేపీ నేతలే పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని అన్నా డీఎంకే వర్గాల విమర్శిస్తున్నాయి. మరోపక్క పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తొలగించినట్లు పార్టీ వర్గాలు అర్ధరాత్రి చెప్పాయి. మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయ సమాధి వద్దకు సెల్వం చేరుకుని మౌన ముద్రలో కూర్చోవడంతో నాటకీయ పరిణామాలకు నాంది పడింది. ఆయన ఆ సమయంలో ఎందుకు అలా వచ్చారో.. ఎందుకు ధ్యానం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. 40 నిమిషాల తర్వాత మౌన ముద్రవీడి.. కళ్లు తుడుచుకుంటూ మీడియాతో మాట్లాడారు.
నిజాలు వెల్లడించాలని అమ్మ (జయ) ఆత్మ తనను ప్రేరేపించడంతో దేశ ప్రజలకు, పార్టీకి కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చానంటూ మాట్లాడటం ప్రారంభించారు. పార్టీని, రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మ చెప్పిందన్నారు. తనను సీనియర్ మంత్రులు, నేతలు అవమానాలకు గురిచేశారని, అణగదొక్కాలని చూశారని చెప్పారు. జయలలిత మృతి తర్వాత పార్టీ ఖ్యాతిని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన ప్రధాన పని అని చెప్పారు. అయితే తనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగా యన్నారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపుడు అమ్మ తనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారన్నారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్న మధుసూదన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని, సీఎంగా తనను బాధ్యతలు స్వీకరించాలని చెప్పారన్నారు. సీఎంగా ఉండేందుకు తాను నిరాకరిస్తూ ప్రజలు కోరుకునే వ్యక్తిని సీఎంగా నియమించాలని కోరానని తెలిపారు. అయితే గతంలో 2సార్లు సీఎంగా ఉన్న తననే పదవి చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. తాను సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మంచి పనులు చేశానని, అది చూసి ఓర్చుకోలేక పార్టీలోని అగ్రనేతలందరూ కలసి ఒంటరి చేసి వేధింపులకు గురి చేశారని తెలిపారు.
సీనియర్లు అవమానించారు..
శశికళను సీఎం చేయడానికి తనను పార్టీ నేతలు ఏవిధంగా ఇబ్బంది పెట్టింది పన్నీర్ వెల్లడించారు. ‘‘ఆదివారం పోయెస్ గార్డెన్‌లో సమావేశం ఏర్పాటు చేశారని నాకు తెలియదు. నన్ను పిలిస్తే చిన్నమ్మను కలవడానికి వెళ్లాను. అక్కడ పార్టీ సీనియర్ నేతలు శశికళను సీఎం చేయడానికి నన్ను రాజీనామా చేయమన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవి, సీఎం పదవి ఒకరే చేపట్టాలని చెప్పారు. నన్ను ఒప్పించడానికి 2 గంటలపాటు ప్రయత్నించారు. లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్న తర్వాత నన్ను రాజీనామా చేయమనడం సరైనదేనా అని ప్రశ్నించాను. పార్టీలో క్రమశిక్షణ కోసం అన్ని అవమానాలు భరించాను. నన్ను బలవంత పెట్టడంతో రాజీనామా చేశాను’’అని పన్నీర్ వెల్లడించారు. తన స్థానంలో ఎవరున్నా రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. జయ చూపిన దారిలో నడవాలన్నారు. దానికోసం తాను ఒంటరిగా మిగిలినా పోరాడతానని చెప్పారు.
పార్టీలో చీలిక లేదు: శశికళ
ఉదయం మాజీ స్పీకర్ పాండ్యన్.. జయ మృతిపై అనుమానాలున్నాయని చెప్పడంతో ఏఐఏడీఎంకేలో మొదలైన రాజకీయ ప్రకంపనలు పన్నీర్ తిరుగుబాటుతో తారస్థాయికి చేరాయి. పోయెస్ గార్డెన్‌లో పార్టీ ముఖ్యులతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కొంతమంది పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇదంతా బీజేపీ పెద్దలు ఆడిస్తున్నారంటూ మండిపడ్డారు. శశికళను సీఎం పీఠంపై కూర్చోనివ్వకుండా చేయడానికి పన్నీర్‌ను పావుగా వాడుకుంటున్నారని శశికళ అనుయాయులు వాదిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలంతా తనవెంటే ఉన్నారని, పార్టీలో ఎలాంటి చీలిక లేదని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మీడియాతో మాట్లాడిన శశికళ అన్నారు. డీఎంకే మద్దతుతోనే పన్నీర్ ఇలా మాట్లాడారన్నారు.
ఢిల్లీకి స్టాలిన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ–2గా ఉన్న శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిలుపుదల చేయాలని కేంద్రాన్ని కోరేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడుస్టాలిన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 8 రాష్ట్రపతి, ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. అన్నాడీఎంకేలో తన అభిమానుల బలాన్ని నిరూపించుకునేందుకు జయలలిత మేనకోడలు దీప సంతకాలు సేకరించే పనిలోపడ్డారు.