‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన
- హింసకు పాల్పడవద్దని కోవింద్ పిలుపు
- నాలుగు రాష్ట్రాలు ఆగ్రహజ్వాలలు..28 మంది మృతి
న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌పై కోర్టు తీర్పు అనంతరం ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు విధ్వంసకాండకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ఒక దశలో కాల్పులు జరిపారు. అల్లర్లలో ఇప్పటివరకు 28 మంది చనిపోగా, వందలమంది గాయపడ్డారు.
కాగా, కోర్టు తీర్పు అనంతరం చెలరేగిన హింసాకాండను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఖండించారు. హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. ‘‘ ఇవాళ్టి కోర్టు తీర్పుపై హింస చెలరేగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం నూటికినూరుపాళ్లూ ఖండనీయం. శాంతి నెలకొనేలా ప్రజలంతా సహకరించాలి’’ అని రాష్ట్రపతి తన అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలోని పలు ప్రాంతాల్లో డేరా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌కు విధించే శిక్షను సోమవారం(ఆగస్టు 28న) వెల్లడించనున్నట్లు కోర్టు పేర్కొంది. తీర్పు అనంతరం దోషిని అంబాలా జైలుకు తరలించారు.