నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు? | Sakshi
Sakshi News home page

నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?

Published Sat, May 4 2024 4:57 AM

How do you label an accused as a murderer

కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు? 

హంతకుడిని సీఎం రక్షిస్తున్నారని ఎలా చెబుతారు? 

ఇలా చెప్పడం తప్పు కాదా? ఇది నేరపూరిత చర్య కాదా? 

ఐదేళ్ల క్రితం ఘటనపై ఇప్పుడెందుకు ఇంతలా మాట్లాడుతున్నారు?.. ఎందుకు మసాలా జోడిస్తున్నారు? 

షర్మిల, సునీత, బీటెక్‌ రవిని నిలదీసిన హైకోర్టు ధర్మాసనం 

మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు దాఖలైన పిటిషన్లను పరిష్కరించండి 

8లోగా నిర్ణయం వెలువరించండి 

కడప జిల్లా కోర్టుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్‌ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. 

ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్‌ రవి తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. 

వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్‌ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.

తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత, బీటెక్‌ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. 

వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ పబ్లిక్‌ డాక్యుమెంట్‌ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీ­ధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడు­తున్నార­న్నారు.

 సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్‌ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.

సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..
వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్‌ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. 

మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్‌ రవి తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్‌సీపీ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement