హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్‌భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్‌కు అందించారు.
జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
సోనియా రాక అనుమానమే!
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment