అమెరికాలోని న్యూయార్క్‌లోగల బ్రూక్లిన్ మ్యూజియంపై వందలాది మంది పాలస్తీనా అనుకూల నిరసనకారులు హఠాత్తుగా దాడికి దిగారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
అయితే పోలీసుల రాకకుముందే నిరసనకారులు బ్రూక్లిన్ మ్యూజియం వద్దకు చేరుకుని, ఆ ప్రాంగణంలో టెంట్లు వేసి, భవనంపై ‘ఫ్రీ పాలస్తీనా’ పేరుతో గల బ్యానర్‌లను ఎగురవేశారు. మ్యూజియం వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో న్యూయార్క్ నగర పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కొంతమంది నిరసనకారులు పోలీసు అధికారులపై ప్లాస్టిక్ బాటిళ్లను విసిరారు.
ఘటనా స్థలంలో పోలీసులకు, ఆందోళనకారులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యూయార్క్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికిముందు పాలస్తీనా మద్దతుదారులు బార్‌క్లేస్ సెంటర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్నవారు డప్పులు కొడుతూ, పలు నినాదాలు చేస్తూ మ్యూజియం వైపు తరలివచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment